మన వంటగది ఒక ప్రయోగశాల:

మన వంటగది ఒక ప్రయోగశాల:
ఇది నిజం కూడాను! చాలా సార్లు నిరూపించబడినది కూడా!!
నిన్నటి ఉదయం శ్రీవారు వంటగదిలోకి వచ్చి “ఏంటి వండుతున్నావు ఈ రోజు?” అని అడిగారు. ఆయన కళ్ళలో భయం నాకు స్పష్టంగా కనిపించింది.
నా వంటంటే భయం కాదు అది. నా వంటకు భయపడటం మానేసి చాలా కాలమే అయ్యిందిగా!
ఏదో సామెత చెప్పినట్లుగా, రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు ఉండడని, నా వంటకు ఎంతకాలం భయపడుతాడు చెప్పండి పాపం మానవుడు!
సరే మరి, ఆయన్ని ఇప్పుడు భయపెట్టినది ఏమిటంటే –
“కొబ్బరి”.

అవును!!
అచ్చంగానే ‘కొబ్బరి’.
కొబ్బరికి అంత బలముందా? అని అనుకోకండి. దేనికైనా బలముంటుందని, పిల్లిని గదిలో పెట్టి కొడితే సింహమౌతుందని మనం చిన్నప్పుడు చదివాముగా.
అలాగే ఏదైనా అతిగా, విరివిరిగా ఉంటే భయపడే స్థితే వస్తుంది.
క్రితం వారం మా ఇంట్లో పూజ జరిగింది. నాలుగు కొబ్బరికాయలు, అంటే 8 చిప్పలు అంటే రెండు పెద్ద జిప్ లాక్ బ్యాగులతో కొబ్బరి కోరు, నిన్న శివరాత్రికి మరో కాయ దానికి కలిసింది. అదన్న మాట సంగతి. నేను ఆ రోజే ఆ అర్చకులకు చెప్పాను. “అందరికి తలో చిప్పా పంచండి స్వామి” అని
కానీ ఆయన అప్పుడే ఇండియా నుంచి వచ్చారుట, ఇంకా జెట్లాగ్ లో ఉండి ఏమి చేస్తున్నారో గుర్తు లేక పాపం అన్నిటిని అలాగే ఉంచేసి వెళ్లిపోయారు.
నేను హడావిడిలో చూసుకోలేదు. తర్వాత చూస్తే మిగిలిన కొబ్బరి భయపెట్టింది.
మనం కూడా భయపడటం ఏంటని, కూడదని ధైర్యం చెప్పుకొని, ఇదిగో ఇలా మొదలెట్టాను.
కొబ్బరితో రకరకాలు….
కొబ్బరి అన్నం,
కొబ్బరి పెరుగు పచ్చడి
కొబ్బరి, మామిడి  పచ్చడి,
కూరలలో కొబ్బరి చల్లి కొబ్బరి కూర,
కొబ్బరి కేక్,
కొబ్బరి సాంబారు,
కొబ్బరితో మసాల చేసి వంకాయ కూర, కాకరకాయ కూర.
అంతే కాదు, చిన్నప్పుడు తినేలా
మాములు కొబ్బరి పొడి మీద పంచదార చల్లి స్నాక్,
ఒకటేమిటి సర్వం కొబ్బరిమయం.

మొదటి రోజు – ఆహా! ఓహో! అంటూ లొట్టలు వేశారు, సంతోషంగా తిన్నారు.
రెండో రోజు కొద్దిగా కలవర పడినా గంభీరంగా కొబ్బరి అన్నం, కొబ్బరి పెరుగు పచ్చడి తో తిన్నారు మా వారు.
మూడో రోజుకి కొబ్బరి కూర, కొబ్బరి పచ్చడి కూడా ముభావంగా కానిచ్చారు.

తరువాత కొబ్బరి సాంబారు, కూర అంటే కొంచం తేడా గా చూసారు.
ఇదిగో నిన్న సాయంత్రం కొబ్బరి కేక్ చేసి, కాఫీ విత్ కేక్ అని పెట్టేసరికి చాలా తేడా గానే నన్ను చూసి, నీ డైటింగ్ ఇంకా ఎన్ని రోజులు అంటూ విసుగేసుకోవటం మొదలెట్టేశారు.

నేనా డైటింగ్ అని నా వంట  నేను తినటంలేదుగా. సలాడు అనీ సూపని తిరుగుతున్నానుగా.
ఉన్న ఇద్దరిలో ఒకరు తినక, మరొకరికి తప్పక కొబ్బరంతా తినాల్సివచ్చేసరికే మా శ్రీవారు ఇలా ఈనాటికి గుడ్లు తేలేశారు.
అదన్నమాట సంగతి.

నాకే పాపం ఒక్కడే తినాల్సివచ్చిందని  కొద్దిగా జాలి కలిగి, పైపెచ్చు నాది చాలా జాలి హృదయం కాబట్టి  ఒక జిప్ లాక్ బ్యాగు నింపి ఫ్రీజర్ లో దాచి పెట్టాను మిగిలిన కొబ్బరిని.
వచ్చే నెలలో చూద్దాము లెమ్మని!

అదన్నమాట సంగతి!!

మరి నేను చేసిన కొబ్బరి అన్నం, పచ్చడి, కేక్ రెసిపీ మీతో సరదాగా పంచుకుంటున్నాను.

మీరు మీ ప్రయోగ శాలలో ప్రయత్నించి, సుఖించాలన్న నా కోరికతో!

ముందుగా కొబ్బరి రైస్:
ఇది చాలా ఈజీ గా అన్ని అన్నం మాదిరిగానే!
ముందుగా 2 కప్పుల బాసుమతి అన్నం వండుకోవటం.
ఒక బాండీలో 2 చెంచాల నెయ్యి వేసి, అందులో
2 ఇలాచీ, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చానచెక్క ముక్క, 3 చెంచాల జీడిపప్పు, రెండు పచ్చి మిరప, ఒక రెమ్మ కరివేపాకు, వేసి కొద్దిగా వేగాక, కప్పు కొబ్బరి తురుము కలుపుకోవాలి.
పచ్చి పోయేలా కొబ్బరిని వేయించాలి. ఉప్పు కూడా ఇప్పుడే కలిపేసుకోవాలి.
రెండు కప్పుల అన్నంను కూడా కలిపి, చక్కగా రైతా తో వడ్డించాలి. నేను రైతా గా కొబ్బరి పెరుగుపచ్చడి చేశాను. అదీ బాగా కుదిరిందనుకోండి.
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
బోలెడు రకాలైన వంటలు చేసే గొడవ తప్పుతుంది.
******
ఇంక పచ్చడి. కొబ్బరి మామిడి పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళకి ‘మరో ప్రాణ’మేమో అనిపిస్తుంది నాకు.
మామిడి కాయ దొరకదు అన్ని కాలాలలో. దానికి ఫ్రోజెన్ మాంగో తెచ్చుకొని, ఫ్రీజర్ లో ఉంచుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడి మనకు అందుబాటులో ఉంటుంది.
పచ్చడి రెసిపి:
ఒక కప్పు తురుము కి ఈ లెక్క వాడుకోండి.
ముందు బాండిలో 2 చెంచాల నూనె వేసి, కాగాక
1 చెంచా మినప పప్పు, శనగపప్పు, ఆవాలు (అన్నీ ఒక్కొక్క చెమ్చానే) వేసి, 4 ఎండుమిర్చి, 2 పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి.

దీనికి కొద్దిగా ఇంగువ కలుపుకొని చల్లారపెట్టాలి. కొద్దిగా చల్లారిన తిరగమాతను, కొబ్బరి కోరును, చిటికెడు పసుపును, 1/2 కప్ చింతపండు రసం, వేసి మెత్తగా నూరుకోవాలి. చివరిలో మామిడి ముక్కలను కలిపి మళ్ళీ మిక్సీని ఒక తిప్పు తిప్పుకోవాలి. అంటే  కొద్దిగా నూరుకోవాలి. అది కొబ్బరి పచ్చడి. ఇది మీకు అన్నంతో కానీ, దోశలకు, ఇడ్లీలలో కూడా బాగుంటుంది.
———

చివరిగా కేకు

మీకు కావలసినవి
1/3 కప్పు గోధుమ పిండి,
1/2 కప్పు మైదా
1 కప్పు కొబ్బరి కోరు
1/2 కప్పు వెజిటబుల్ నూనె
1/2 కప్పు పంచదార
చిన్న చెంచా బేకింగ్ పొడి
చిన్న చెంచా బేకింగ్ సోడా
చిన్న చెంచా వెనిగర్ ఎక్సట్రాక్ట్
ముందుగా గోధుమపిండి, మైదా, వెజిటల్ ఆయిల్, పంచదార కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. దానిలో సోడా, బెకింగ్ పొడి వెనిల్లా వేసి కలపాలి. డ్రై ఫ్రూప్ట్స్ కొన్ని కలుపుకుంటే బాగుంటుంది కేక్.
ముందుగా కన్వేషన్ ఓవెన్‌ 400 డిగ్రీ ల ఫారిన్హీట్ దగ్గర వేడి చేసి వుంచుకోవాలి.
కేక్ చేసే గిన్నెలో కలిపిన మిశ్రమం ఉంచి, 25 నిముషాలు బేక్ చెయ్యాలి.
ఒకసారి తీసి ఏదైనా సన్నని పుల్ల గుచ్చి చుస్తే ఏమి అంటు కోకుండా రావాలి ఆ పుల్ల. అప్పుడు కేక్ చక్కగా అయినట్లు. లేనిచో మరో 5 నిముషాలు ఉంచండి ఓవెన్‌ లో.
తర్వాత తీసి ముక్కలు చేసుకు కాఫీ తో గాని, అలాగే గాని సర్వ్ చేస్తే బాగుంటుంది.
మీకు కేక్ పైన ఐస్ఇంగ్ కూడా కొబ్బరి తో పెడతారు ఇష్టపడే వారు.

అదండీ మా కొబ్బరి వారోత్సవాలు.
మరో సారి మరో రెసిపీ ఏదైనా ప్రయోగిస్తే, దానితో మీ ముందుంటాము మరి.
అంతవరకూ ..ప్రయోగించండి వంటకాలు… మీరు మాత్రం డైటింగ్ మానకండి!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s