ఒక పెళ్ళికి వెళాల్సి వచ్చింది.
ఎటైనా వెళ్ళటమంటేనే భయంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా పెళ్ళి అంటేనూ ఇంకా భయం.
ఒక చీరతో అవదు. అంటే కనీసం ఒక నాలుగైదయినా కావాలి. వాటికి మాచింగ్ బ్లౌసులు తప్పక ఉండాలి. అవి కూడా నేటి లేటెస్ట్ ఫ్యాషన్వ్ అయి ఉండాలి. లేకపోతె చిన్న చూపుగా ఉంటుంది నలుగురిలో.
ఎలాంటి బ్లౌసుల ఫ్యాషన్ నడుస్తోందో ఏంటో నేటి కాలంలో, తెలియకుండా ఉందిగా.
పారిస్ లో ఫ్యాషన్లు రోజు రోజూ కీ మారిపోతాయని మా చిన్నప్పుడు అనుకునేవారు.
ఎవరు చెప్పారు మన హైదెరాబాదులో మారటంలేదని? మన హైద్రాబాదు పారిస్ కన్నా ఫ్యాషన్ లకు నెలవైంది కదా మరి!
అందుకే హైదరాబాద్ లో కూడా ఫ్యాషన్లు తెగ మారిపోతున్నాయి.
ఆ మాట కొస్తే ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ రోజు ఫ్యాషన్ రేపు ఉండటంలేదు. అంత త్వరగా ఉంది మార్పు.
మా అమ్మ మా చిన్నప్పుడు ప్రతి ఫ్యాషన్ కి లైఫ్ అంటే నిలబడి ఉండే కాలం ఒక 20 సంవత్సరాలు అని అంటూ ఉండేది.
ఒక రకంగా అది నిజమనిపిస్తుంది. అసలు సృష్టిలో ప్రతిదీ ఒక చట్రం ప్రకారం మారుతూ ఉంటుంది.
ఉదాహరణకి చూడండి:
తెలుగు సంవత్సరాలు కూడా ప్రతి 60 ఏళ్ళకి మళ్ళీ ప్రథమ, ద్వితీయకు చేరుతాయి.
ఋతువులు మారుతూ ఉంటాయి ప్రతి మూడు నెలలకు.
నీరు ఎండకి ఆవిరై పోతుంది. మబ్బులో నిండి తరువాత వర్షంగా కురుస్తుంది.
ప్రతీదీ ఇలా సృష్టిలో ఒక చట్రంలో తిరుగుతూ ఉంటాయి.
మరి అన్నీ తిరుగుతూ ఉండగా బ్లౌజ్లల ఫ్యాషన్ కూడా తిరగడం న్యాయమేగా.
మా అమ్మమ్మ ఫోటోలు చూస్తే, వాళ్ళకి మోచేతులు కిందికి చేతులు, మెడకు దగ్గరగా ఉన్న నెక్ తో ఉండే బ్లౌజ్ లు ఉండేవి. అవి నెమ్మదిగా మారటం మొదలయ్యాయి.
చేతులు పొట్టిగా, పొట్టిగా మరి మెగా బ్లోస్ అని చాలా చిన్న, పొట్టి చేతి బ్లౌస్స్ లు తెగ ఫ్యాషన్ అయ్యాయి కొన్నాళ్ళు.
మెడ దగ్గర ఉన్నది కాస్త యూ షేప్, వి షేప్, నుంచి రౌండ్కు మారి, డీప్ నెక్ వరకు సాగాయి.
ఆ మధ్యలో బుట్ట చేతులు, పఫ్ హాండ్స్ తెగ రాజ్యం చేసాయి.
అవి మారి కొంతకాలం పెద్ద నెక్, డోరితో వీపంతా బయటేసే బ్లౌజ్ లు వచ్చాయి. ఇప్పటికి ఉన్నాయనుకోండి అవి.
పాత నలుపు తెలుపు చిత్రాలలో, అందునా మీకు గుర్తుంటే కనుక మిస్సమ్మ చిత్రంలో ‘బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే” అన్న పాట తప్పక గుర్తుంటుంది.
అందులో సావిత్రి బ్లౌజులు చూడండి ఎంత ఫ్యాషన్ గా ఉంటాయో. మళ్ళీ అలాంటివి ఇప్పుడు తెగ చూస్తున్నాము.
అదే బోట్ నెక్ బ్లౌసులు.
ఇక జమున ‘రాముడు భీముడు‘ లో వేసుకున్న ఫ్యాషన్ బ్లౌసులు మనకు ఆశ్చర్యం కలిగించక మానవు. అంత డిజైనర్ బ్లౌజ్లులా ఉంటాయి ఆమెవి.
1945 లో స్వర్గసీమ అని ఒక చిత్రం వచ్చింది. అందులో భానుమతి రామకృష్ణ ‘ఒహొహ్ పావురమా‘ అని పాడుతూ నాగయ్య గారి మీద వలపు ప్రకటిస్తూంది. 12 ఏళ్ళ భానుమతి వేసుకున్న ఆ బ్లౌజ్ చుడండి, 1945 లో ఉన్న ఫ్యాషన్ ఏంటో అర్థమౌతుంది. యూట్యూబ్ లో ఆ వీడియొ దొరుకుతుంది.
పౌరాణికాలు వదిలేస్తే, సాంఘికాలలో ఆనాటి ఫ్యాషన్ నేటికీ తక్కువ కాదు.
ఆనాటి వారు వచ్చి చూస్తే, ‘ఏమీ మార్పులేద‘ని అనుకోవటం తథ్యం.
ఇంక ఈ మధ్యలో భుజాలమీద చిన్న కంతతో క్లోల్డు భుజాల జాకెట్లు వస్తున్నాయి. అది లేటెస్ట్ ఫ్యాషన్ ఏమీ కాదు.
పూర్వపు రోజులలో అంటే దాదాపు స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వారి ఫోటోలు చుస్తే, వీటిని మించిన డిజైన్స్ కనపడుతాయి.
అంటే ఇవి 1950 సమయపు ఫ్యాషన్. ఇలా చూస్తుంటే ఈ ఫ్యాషన్ లు తెగ మారి పోతూ కంగారు పెట్టేస్తున్నాయి.
నా నేస్తం ఉన్నది, ఫ్యాషన్ అంటే మక్కువ ఎక్కువ.
‘ఇలా బ్లౌసుల ఫ్యాషన్ మారితే ఏమి చేస్తావు?’ అంటే, ‘మళ్ళీ అన్నీ కొత్తవి కుట్టుకుంటాను‘ అని చెప్పింది.
తన ఓపికను నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను.
చక్కటి మనిషి, చక్కగా ఎప్పుడు అరవిరిసిన పుష్పంలా చీర, లేటెస్ట్ ఫ్యాషన్ బ్లౌజ్ తో అందరి మన్నన పొందుతారు ఆమె లాంటి కొందరు.
అలా అంతా చెయ్యలేరు కదా …
మరి ‘కిమ్ కర్తవ్యం?’
రోజు రోజుకి మారిపోయే ఈ ఫ్యాషన్ లతో ఎలా వేగటం?
దానికి నాకు తోచిన ఉపాయం మాత్రం, మనకు నచ్చిన ట్రెండు లో మనం కుట్టేసుకొని, మనమే కొత్త ట్రెండ్ మొదలెట్టాలి.
లేకపోతే ‘గయా గోవిందా’ లాగా మనము వెనకపడిపోయామన్న బాధా,
కోల్పోయిన జీవితం కళ్ళ ముందు కనిపించి కంగారు, వెరసి ‘డబడి దిబడే’ కదా!
ఇంకో చిట్కా, కొన్ని రెగ్యులర్ కలర్స్, అంటే కామన్ రంగులు అన్ని డిజైన్ లలో కుట్టించుకుంటే సరి, ఈ ఫ్యాషన్ కు ఆ డిజైన్ తో, ఏ ఎండకా గొడుగులా సర్వ సిద్ధంగా ఉండొచ్చు..
ఏమైనా మళ్ళీ నాకు బ్లౌజ్లుల షాపింగ్, టైలర్ తో కష్టాలు తప్పేలా లేవని జాతకంలో రాసి ఉన్నట్లుంది!!