‘ఒకటి రెండు చెడితేగాని వైద్యుడు కాదు’అని సామెత.
ఆ ఒకటి రెండుసార్లకి మాత్రం పడ్డవారి గోల పరమాత్మకే ఎరుక.
విషయము ఎదైనా కానీయ్యండి.
అందుకే ఎప్పుడు ఒకటి రెండు ప్రయోగాలు శత్రువుల మీదే కానీస్తే కనీసం మన కసిన్నా తీరుతుంది.
అంటే వంటైనా, మరోటైనా అని నా భావన.
కానీ మరీ అత్తగారింట్లోకి అడుగు పెట్టగానేనంటే ప్రయోగాలంటే మాత్రం పరువు పోతుంది. ముందు ఏ తమ్ముడి మీదో అయితే మరోలా వుంటుంది. కానీ నా జాతకములో శని క్రాసుగా చూసి కన్ను కొడితే మన ప్రయోగాలు అత్తగారి మీద, అక్షింతలు మన మీద పడి… మన పరవు మూసీలో కలిసినా ఆశ్చర్యం లేదు.
మా నానమ్మ చెప్పేది, ఇడ్లీలను పాడుచెయ్యటము హరికైనా సాధ్యం కాదని. హరికి సాధ్యము కానిది నేను చేశానని చెప్పినప్పుడు నవ్వేసి “ఓసి నీ అసాధ్యం కులా” అని మెత్తగా నవ్వింది.
కాని అత్తగారు మాత్రం తమ కట్టుడు పళ్ళ కదిలి, వాటిని దాచుకొలేక, వూడిన పళ్ళను నూరలేక కళ్లుతేలేసి నామీద కోపం దాచుకోలేక, నాకు అర్జెంట్ గా వంట నేర్పే ప్రయత్నంలో పడ్డారు.
అసలేమైనదంటే….
అవి మా పెళ్ళయిన క్రొత్తలో అంటే 20 రోజులకు మేము అప్పుడే హైద్రాబాదులో ఫాట్ లో సామాను గట్రా సర్దుకునే ప్రయత్నంలో వున్నాము.
మేము ఇల్లు సర్దటము పూర్తి కాకుండనే మా తోడుండి సమకూర్చటానికి మా అత్తగారు వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు ముందు బావగారింటికి వెళ్ళి మరురోజు వస్తామని టిపిను రెడి చేసి వుంచమని చెప్పారు.
శ్రీవారు అడిగారు ఇడ్లీ చెయ్యటం వచ్చా అని.
అదేమైనా రాకెట్ సైన్సా ఏమిటి? వచ్చని చెప్పినా అంతకు ముందు చేసిన అనుభవము మనకు మృగ్యం.
కాని అమ్మ నేను వచ్చెటప్పుడు పాపం కొన్ని వంటలు ఎలా చెయ్యాలో రాసిఇచ్చింది. ఆ పుస్తకము నాదగ్గర వున్న ఎకైక బలం.
ఆ లెక్కప్రకారము ఒక పప్పు మూడు రవ్వ నానేసి, పప్పు రుబ్బి, రవ్వతో కలిపాను. అద్ది చక్కటి గట్టి పిండి ముద్దగా వుంది. వెంటనే ఆ పిండిని ఇడ్లీ రేకులలో పెట్టి వుడికించాను ఓక ఇరువై నిముషాలు.
తర్వాత మూత తీసి చూస్తే పిండి పలచగ లేనందున ఇడ్లీలు గొగ్గులుగా ముతకగా, గట్టిగా, రాళ్ళలా వచ్చాయి.
తమ్ముడు చూసి “బావున్నటులేవు. వెరేవి చెయ్యి“! అన్నాడు.
అంత టైం లేదు. వాళ్ళొచ్చేసారు.
అందుకని అవి తీసి తిప్పి క్రింద వైపు పైకి, పైన ముతక క్రిందకు త్రిప్పి నీటుగా వుంటాయిగా, అలా అమర్చి టేబులుపై పెట్టాను. ఇడ్లీ పచ్చడి రాదుగా. అందుకే ఆవకాయ, నెయ్యి ప్రక్కనే వుంచాను. వంటలో క్రొత్తగాని, ప్రజంటేషనులో మనది అందె వేసిన చెయ్యి. అందంగా తెల్లగా మెరుతూ వున్న ఇడ్లీలు ఆరవిరసిన మల్లెల్లా, ఉదయపు పారిజాతాలలా, అర్థర్రాతి చీకట్లలో మెరిసే డెంటిష్టు పళ్ళలా నవ్వుతూ ఆహ్వానిస్తూ వుండెలా టేబులుపై అమర్చాను.
తమ్ముడొచ్చి అడిగాడు, ‘వెరెవి చేశావా? క్లీనుగా బలే వున్నాయి చూడటానికి” అని.
“లేదురా! తిప్పి పెట్టాను” అని సర్ది చెప్పెశా. చూడటానికి బావున్నాయి. తినాలనిపిస్తున్నాయి. రెండూ చేతులూ చాచి ఆహ్వానిస్తున్నాయి రారమ్మని.
అందరూ బిరబిరా వచ్చారు. కొత్త కోడలు టిఫినులూ చేసింది తిందాము అంటూ ఒకటే ఆనందము అత్తగారు, మామగారు, ఆడబడుచులకు అంతా.
వారికి తెలియదు వాళ్ళకు రాబోయే గండం. అంతా ఆ ప్రజంటేషను చూసి డంగైపోయారు. అంతా తలో నాలుగు ఇడ్లీలు వడ్డించుకున్నారు. నోట్లో పెట్టుకుని కొరకపోతే ముక్క తునగలేదు. నోట్లోకి రాదే ఇడ్లీ.
బలవంతాన ముక్కలుగా చేసి నోట్లో పెట్టుకుంటే గట్టిగా, ఇటికముక్కలలా వున్నాయిట. అందరూ మూఖాలు చూసుకున్నారు. నేను ఇడ్లీ తినను. కాబట్టి నాకర్థం కాలేదు వాళ్ళ హావభావాలు.
పాపం కొత్తకొడలిని ఏమంటారు? ఏమని అడుగుతారు? మింగలేక, కక్కలేక తెగ ఇబ్బంది పడ్డారు అందరూ. ఒక్కొక్కళ్ళు పళ్ళు సరిచూసుకున్నారు. మా అత్తగారి కట్టుడు పళ్ళు. కటకట మని కదిలి వూడే పరిస్థితి దాపరించింది చివరికి. శ్రీవారికి ఏదైనా, ఎలా వండినా తింటమే తప్ప వంక పెట్టడము రాదు పాపం.
ఆయన శక్తంతా వాడి తుంపుకు తింటున్నారు టకటకా. అందుకే ఎవరూ ఏమీ మాట్లాడలేక పోతున్నారు.
చివరకు ధైర్యం చేసి మామయ్యగారు అడిగారు ‘ఎలా చేశావు?’ అని.
నేను రెసిపి అప్పచెప్పాను.
ఆయన తినలేక మూతి వంకరపోతుంటే ‘అమ్మాయి! పిండి పలచగ చేసుకో, ఒక పూటన్నా పిండి నాన్చు’ అని సలహా ఇచ్చి, తినలేక అవి వడిలేశారు.
అత్తగారు కట్టుడు పళ్ళు వూడాయని తినలేదు. ఆడబడుచులు నన్ను తింటం మొదలెట్టారు ఆ ఇడ్లీలు తింటం మాని. వెరసి ఆ రోజు తినింది మాత్రం పాపం శ్రీవారు మాత్రమే!!
అత్తగారు భయపడి నన్ను ఇంక కొన్ని రోజులు వంట చెయ్యనియ్యలేదు. దగ్గరుండి నెర్పించే పనిలో పడ్డారు.
అలా నా మొదటి ఇడ్లీ ఇటుకముక్కలకు రూపాంతరమైనాక,
నేను నా పాఠం నేర్చుకున్నాను. ఇక నా ఇడ్లీలే కాదు ఏ వంట రూపాంతరము చెందలేదు. కాబోతే అత్తగారి వి కట్టుడు పళ్ళని తెలిసింది అప్పుడే. ఈ రోజు ప్రపంచ ఇడ్లీ రోజుట. ఆ విషయం గుర్తుకొచ్చి మీతో ఇలా పంచుకుంటున్నాను.