అద్భుతమైన అలంపురం.

అద్భుతమైన అలంపురం. 

భారతావనిలో అమ్మవారు అష్టాదశ (18) శక్తి పీఠాలలో నెలకొని, భక్తులను అనుగ్రహిస్తుంది. 
అష్టాదశ పీఠాలలో అత్యంత శక్తివంతమైన  పీఠంగా పేరు పొందిన క్షేత్రం  అలంపురం. 
అలంపురం హైదారాబాదు కు 230 కిలోమీటర్ల దూరంలో, కర్నూల్ కు 20 కి.మీ దూరం లో తెలంగాణ రాష్ట్రము లో ఉంది. 
అలంపురం కి మాకు ఉన్న సంబంధం చాలా పాతది. మేము మా చిన్నతనంలో నివసించిన కొల్లాపూర్ కు అలంపురం చాలా దగ్గర గా ఉండేది. 
నేను నా ఎలుమెంట్రీ స్కూలులో ఉన్నప్పుడు ఒక శివరాత్రి నాడు మా నాన్నగారు మమ్ముల్ని అలంపురం పట్టుకెళ్ళారు. ఆనాటి శివరాత్రికి అలంపురానికి కంచి స్వాములు వచ్చి ఉన్నారు. వారి దర్శనానికి మా నాయనగారు మమ్ములను తీసుకెళ్లాలన్నమాట!
అదే మొదలు నాకు ఒక స్వామి నుంచి అస్సీసులు అందటం. ‘పెరియవాఅని ప్రేమగా భక్తులు పిలుచుకునే పరమహంస పరివ్యాజక శ్రీ. చంద్రశేఖర యతి వారేంద్రుల దర్శనం లభించటం ఆనాడు నాకు లభించిన వరం. 
అలా అలంపురం నాకు సాక్షాత్తు శ్రీ శంకర భగవత్పాదుల వారి అస్సీసులు అందించినది. అంటే సాక్షాత్తు పరమ శివుని కటాక్షం! 
అలాంటి అలంపురం తిరిగి  దర్శించుకోవటానికి నాటికి కుదిరింది. 

అలంపురంలో అమ్మవారు కొంత తాంత్రికారాధనకు చెంది ఉంటుంది. 
అమ్మవారిని జోగులాంబ అంటారు. జోగులాంబ అంటే ఒక అర్థంమొదటి యోగిని అని. రెండవ అర్థం జోగినులకు అమ్మ. జోగినగా కొందరి స్త్రీ లు (దేవా దాసి) గా దేవాలయ సేవలకు ఉండేవారు.

లంబస్థానీ వికృతాక్ష్మీంఘోర రూపం మహాబలం 
ప్రేతాసన సమారూఢంజోగులాంబమ్ నమామ్యహాః 

అమ్మవారి రూపం భయానకం. ఉబికిన కనుగుడ్లు, నాలుక బయటకి వ్రేలాడుతూ, నగ్నంగా, ప్రేతాత్మను ఆసనంగా, కపాలమాల ను ధరించి ఉన్న అమ్మవారి ఉగ్రరూపం చూపరులకు భయం కలిగిస్తుంది.  
అమ్మవారి తలమీద బల్లి, తేలు, గుడ్లగుాబ, కపాలం ఉంటాయి. 
ఇవ్వన్నీ కీరిటం పై ఉంటాయి.
అవి అపశకునాల గుర్తులు. మన ఇంట్లో గుడ్లగూబ ప్రవేశిస్తే అపశకునంగా భావిస్తారు. బల్లి మీద పడితే అపశకునం. మరి అలాంటి అపశకునాలు ఎందుకు అమ్మవారు శిరస్సు పై ధరించింది? 
అలాంటి అపశకునాలు మన ఒట్టి నమ్మకం మాత్రమే అన్న? లేక అందులో వేరే అర్థం ఉన్నదా? 
ఒక అర్థంఏది అపశకునం కాదని’. మరో అర్థం అమ్మను చూసినా,తలచినా ఎలాంటి అపశకునం కూడా మనలను బాధించదని. 

ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జగద్గురువులు చేశారంటారు. 
విగ్రహం క్రింద 108 కిలోల శ్రీచక్రం ఉంచి, పైన అమ్మవారిని ప్రతిష్టించారని, బంగారం కోసం ముసల్మానులు దేవాలయం మీద దాడి చేశారని చరిత్ర చెబుతుంది. దాడి ఫలితంగా విరిగిన విగ్రహాలు ఆలయ ప్రాగణమంతా కనిపిస్తాయి. 
1500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయ సముదాయంలో మనకు కొట్టొచినట్లుగా కనిపించేది నవబ్రహ్మశ్వేర దేవాలయాల శిల్ప సంపద.  
చాణుక్యులలో రెండవ పులకేశి నిర్మించిన అద్భుత దేవాలయ సముదాయం, శిల్పాలు చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. నవ బ్రహామేశ్వర ఆలయాలు అన్ని శివాలయాలు. శివుని దేవాలయాలైనా, బ్రహ్మ పేరున పిలువబడటానికి కారణం బ్రహ్మ ఇక్కడ తపమొనర్చాడని, ఇక్కడ వెలసిన ఆలయాలలో తన పేరు మీద నివాసముండమని శివుడిని వరమడిగాడని స్థల పురాణం చెబుతుంది. 
తొమ్మిది బ్రాహ్మలు:
బాల బ్రహ్మేశ్వరాలయం  
కుమార  బ్రహ్మేశ్వరాలయం  
గరుడ  బ్రహ్మేశ్వరాలయం  
స్వర్గ  బ్రహ్మేశ్వరాలయం  
వీర  బ్రహ్మేశ్వరాలయం  
అర్క  బ్రహ్మేశ్వరాలయం  
తారక  బ్రహ్మేశ్వరాలయం  
విశ్వ  బ్రహ్మేశ్వరాలయం  
పద్మ  బ్రహ్మేశ్వరాలయం . 

ఇందులో బాల బ్రహ్మేమేశ్వరాలయం పెద్దది. ఆలయంలో  స్వామికి నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. 
దేవాలయాలన్ని 7 శతాబ్దపు లో నిర్మించినవి. 
నవబ్రహ్మల ఆలయము నిలయమైనది కాబట్టి, పట్టణానికిబ్రహ్మపురిఅని కూడా పేరు వున్నది.  
తొమ్మిది శివాలయములతో నెలకొన్న పురమునునవలింగ దివ్య భవనంఅని కూడా అంటారు. 
ప్రస్తుతం ఇవ్వన్నీ భారతీయ పురావస్తు శాఖ వారి పరిధిలో ఉన్నాయి. కేవలం బాలబ్రహ్మ, జోగులాంబ దేవాలయాలు మాత్రం దేవాదాయ శాఖ క్రింద ఉన్నాయి. 
అందుకే కేవలం బాల బ్రహ్మ దేవాలయంలో, జ్యోగులాంబ కు మాత్రమే పూజ పునస్కారాలు జరుగుతాయి. 

శివుడుబాలబ్రహ్మ గా అవతరించిన పురంలో శివలింగం గుఱ్ఱం గిట్ట ఆకారంలో ఉంటుంది. పాదరస లింగమని కూడా అంటారు. 
అది పూర్వం సిద్ధులు ఇక్కడ దర్శించి, రస మూలికలతో లింగం చేసి ప్రతిష్టించారని అంటారు. 
కోటి పైన ఒక్క లింగంకొట్టొక్క లింగంతో నెలకొన్న క్షేత్రం అలంపురం. 
బహ్మనీ సుల్తానుల చేతులలో దురాక్రమణకు గురైన దేవాలయ ప్రాంగణాలను విరిగిన శిల్పాల మధ్య కొన్ని అపురూప శిల్పాలు నాటి ప్రజా జీవితాన్ని చూపుతూవుంటాయి. జోగులాంబ దేవాలయం పూర్తిగా నేలమట్టం చేయ్యటం వలన, అమ్మవారి మూలమూర్తిని, బాలబ్రహ్మ దేవాలయంలో ఒక మూల చిన్న గూటిలో చాలా సంవత్సరాలు దాచారు. అమ్మవారు అక్కడే 650 సంవత్సరాలు ఉండి పూజలందుకుంది. 
2005 లో శృంగేరి స్వామిచే పునః ప్రతిష్టింపబడింది కొత్త దేవాలయం లో. 
దేవాలయం పూర్వపు స్థలం లో పునః నిర్మించి ప్రతిష్టించారు. 
అమ్మవారికి చేసే సేవలలోదశ దిశ హారతులుముఖ్యమైనవి. అవి పది రకాల హారతులు, జోగులాంబ కు సాయంత్రం 7 గంటలకు ఇస్తారు. ఇది కాక ఖడ్గమాలతో అర్చన, త్రిదశితో కుంకుమార్చన ఎంతో ప్రముఖమైనవి. 
వసంత పంచమికి అక్కడ జరిగే అభిషేకము, అమ్మవారి నిజరూప దర్శనము భక్తులు చూడవచ్చు. 

అలంపురం అమ్మవారు శక్తివంతమైనా, వూరు పెద్దగా అభివృద్దికి చోటుచేసుకోలేదు. దానికి స్థానికులలో ఒక కథ ప్రచారములో వుంది. 
పూర్వం ఒక బౌద్ధ సన్యాసి నివాసం ఉండేవాడు అలంపూరంలో. ఆయన సాయంత్రం తుంగా నది వడ్డున కూర్చొని గమనిస్తూ ఉండేవాడు. ప్రతి రోజు శ్రమ జీవులు వచ్చి, వారి నాటి శ్రమకి తగ్గ ఫలితంగా చేతికి ఇసుక తీసుకోగానే, అది సువర్ణంగా మరేదిట. అందుకని అలంపురమునుసువర్ణ పురిఅనికూడా అంటారట. ఆయన పురానికి గల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించి, అలమాపురమా అన్నాడుట. (ఆగిపోపురమా). అందుకని అలంపురం ఉన్న స్థితిలో ఉండి పోయింది అని అబివృద్ధి కి నోచుకోలేదని స్థానికులు అంటారు . 

ఇక్కడ కృష్ణ,తుంగ నదులు కలసే సంగమములో సంగమేశ్వరాలయం మరో అద్భుతం. 
అక్కడ ఉన్న శిల్పాలలో రాతిలో చెక్కిన కిటికీలు చూపరులను ఆశర్యం లో ముంచెత్తుతాయి. 
ఆలయము శ్రీశైలపు డ్యాము ముంపు ప్రదేశంలో వుండబట్టి, దేవాలయాన్నీ యధాతదంగా తెచ్చి అలంపురంలో నెలకొల్పారు. సంగమేశ్వరాలయము 6 శతాబ్దంలో నిర్మించారు. దేవాలయములో శిల్పాలలో మనకు బౌధపు ప్రభావము కనపడుతుందు. ధర్మచక్రము, పద్మములు, కుబేరుడు, పద్మపాళి ఇత్యాది శిల్పాలను మనము అక్కడ చూడవచ్చు. శికరాన వున్న  ఒక్కే శిల్పంలో వివిద దశలలో వివిధ మానవ మూర్తులను రూపురేఖలను చూడవచ్చు. అది శిల్పకారుల నైపుణ్యానికి పనితనానికి గుర్తు. 

అచ్చటి మరో చక్కటి దేవాలయ సముదాయముపాపనాశన శివాలయము’. మరకత లింగము అక్కడ నెలకొన్న మూర్తి. ఆది శంకరులు అలంపురమును కాశితో పోల్చారని అంటారు. 
అచ్చటి పురావస్తు శాఖావారి ప్రదర్శనశాల చూడటానికి ఎన్నో శిల్పాలతో, చరిత్రను బద్రపరుస్తున్నది. 
ఎన్నో అద్భుత శిల్పాలతో, శక్తి వంతమైన శక్తి పీఠముతో, నవ బ్రహ్మాలయాలతో, కృష్ణానది వడ్డున వేలసిన క్షేత్రం అలంపురం. 
అక్కడి తెలంగాణా ప్రభుత్వ టూరిజం వారి హరిత గెస్టుహౌసు వసతి బావుంది. హైద్రాబాదు నుంచి తేలికగా ఒక వీకెండు వెళ్ళి రావచ్చు. ఒక గొప్ప ప్రదేశం చూసిన సంతోషాన్ని, చరిత్ర లోకి ప్రయాణించిన ఆనందము మూటగట్టుకోవచ్చు. అక్కడి గైడు స్వౌకర్యముతో చరిత్ర తెలుసుకోవచ్చు. అమ్మవారి ప్రథాన అర్చకుల ద్వారా మనకు మరించ చరిత్ర కూడా తెలుస్తుంది. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s