చరిత్ర చదవటం ఎందుకు?
దానికి సమాధానం కన్నా ముందు అసలు ఒక విషయం చెప్పండి….
బాగా సంపద ఉన్నవారి పిల్లలలో కనిపించే మంచి,గొప్ప లక్షణం ఏమిటి?
ఆత్మవిశ్వాసం !
గమనించారా? వారి ఆత్మ విశ్వాసం…. అది వారి సంపద మూలంగానే కదా!
అలాగే గొప్ప చరిత్ర వారసత్వ సంపదగా ఉన్న జాతిలో కనపడేది కూడా ఆత్మ విశ్వాసమే! ప్రపంచ దేశాలలో ఘన చరిత్ర వున్న రాజ్యాల పద్దతి, పస్తుత వారి విధానాలలో మనము గమనించవచ్చు. తమ జాతి సాధించిన విజయాల మూలంగా లభించిన ఆత్మవిశ్వాసం. ప్రపంచానికి, మానవ జాతికి అందించిన ఫలాలను చూపిన విశ్వాసం అది.
అయితే ఆ ఆత్మవిశ్వాసం కావాలంటే వారికి – వారి జాతి చరిత్ర తెలిసి ఉండాలి ముందు! వారి చరిత్ర పుస్తకాలలో కనపడాలి. ప్రభుత్వం, విద్యార్థులకు చరిత్ర గురించి తెలిసే విధానాలు అవలంబించాలి.
ఘనమైన చరిత్ర కలిగిన భారతీయ జనులకు ఎందరికి వారి చరిత్ర తెలుసు? అని ప్రశ్న వేసుకుంటే నేటి రోజు దాని సమాధానం చాలా నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే మన తరగతి పుస్తకాలలో కానీ విశ్వవిద్యాలయాలలో చరిత్ర చెప్పటం, చదవటం కూడా గగన కుసుమ య్యింది. ప్రతివారు ఇంజనీయరు లేదా మరో టెక్నికల్ కోర్సో తప్ప చరిత్ర చదివేవారు మృగ్యం. పైపెచ్చు మనం చరిత్రను జాతీయ స్థాయిలో, మన ప్రాంతీయ స్థాయిలోను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాము.
కారణాలు ఏమైనా, ఇప్పటికీ కళ్ళు తెరవని ప్రభుత్వ పాలసీల మధ్య, తెలుగు జాతి చరిత్ర తెలుసుకోవాలంటే లభిస్తున్న రచనలు వేళ్ళమీద లెక్కించ వచ్చు. చరిత్ర మీద గౌరవంతో, పరిశోదించి, తన పరోశోదన ఫలితాలను నలుగురికీ అందించాలనే సదుద్యేశంతో సాయి పాపినేని గారు పుస్తక రూపంలో “ఆంధ్ర నగరి” అందించారు. అది చదవటానికి కూడా కుదరదనుకువారికి కోసం, చరిత్రలోని కొన్ని ముఖ్యమైన విషయాలతో కమ్మని కథలల్లి తీయని మధుర రసంలా అందించారు. అంటే కొన్ని చారిత్రత్మాక విషయాల మీద కథలను, వాటికి సంబంధించిన రిఫరెన్సులతో సహా కొన్ని ఫోటోలతో కలిపి అందించిన కొత్త పుస్తకం ‘ఆంధ్రపథం A journey through History’.
ఈ పుస్తకం చదవటానికి సులభంగా ఉంది. ఆసక్తి కలిగించే విధంగా, అర్ధమయ్యే విధముగా ఉండి చారిత్రాత్మక విషయాలను, చదువరులను ఆశ్చర్య ఆనందాలలో ముంతెచ్చుతాయి.
ఆయన మాటలలో చెప్పాలంటే “మనవాళ్ళకి హిస్టరీ అంటే మక్కువే!”
కానీ వారికి సమయం కుదరదు హిస్టరీ చదవాలంటే. అందుకే కాబోలు అరటిపండు వలచి చేతిలో పెట్టారు చిన్న కథల రూపంలో.
చరిత్రలో కథల రూపంలో చదవటం, పాఠకులకు మరింతగా అవగాహన కలుగుతుంది. ఆ కథ చదివిన తరువాత, చరిత్రకు సంబంధించిన సత్యం అలవోకగా అర్థమయి గుర్తుంది పోతుంది. ఇది ధారావాహికంగా ‘పదం నుంచి పథంలోకి” అన్న శీరిక్షన తెలుగు పత్రిక సాక్షిలో వచ్చిందిట.
ఆర్య – ద్రావిడులు కాలం నుంచి మొదలైన ఈ విషయాలు నుంచి 1945 కాలం వరకు వేరు వేరు కాలాలకు సంబంధించిన చారిత్రాత్మక సత్యాలను, ప్రజల జీవనశైలినీ, దినచర్యలు, రహదారులు, వసతులు, న్యాయము, రాజనీతి ఇత్యాది విషయాలను 27 కథల సమాహారంగా అందించారు.
‘ఆవశ్యక సూత్రం ‘ అనే జైన గ్రంథం బట్టి ఆఖరి తీర్థాంకరుడు వర్థమాన మహావీరుడు మోషిరి రేవు (గుంటూరు జిల్లా మోటుపల్లి) సందర్శించాడని చెబుతుంది. ఆ రకంగా బౌద్ధం కన్నా జైనం ఆంధ్రా దేశంలో మొదట ప్రవేశించింది.
భట్టిప్రోలు స్తూపం లో ‘సద వంశం’ కి చెందిన రాజుల ప్రస్తావన ఉంది. తరువాత చుస్తే వేల్పూరు, గుంటపల్లి లలో సద వంశీయులు వేసిన శాసనాలు కనపడుతాయి. జైన ఇతిహాసం నుంచి మొదటి గ్రహించిన విషయాలను పరిశీలిస్తే శాతవాహన మొదటి రాజైన శ్రీముఖుని గురించి అవగాహన కలుగుతుంది.
‘సంగం వాజ్మయం’ నుంచి గ్రహించిన విషయాలతో ఆంధ్రులు ముందుండి నడవగా మౌర్య సేనలు మోకురులో తిరుగుబాటు అణిచి వేశారని తెలుస్తుంది.
ఇవ్వన్నీ చారిత్రక సత్యాలు.
వీటిని అన్నిటిని పొందుపరిచి అందించిన కథ ‘ముని–రాజు ‘ .
కథా కాలం క్రీ. పూ: 3000 నాటిది. స్థలం: గుంటూరు జిల్లా, బ్రటిప్రోలు.
సద వంశపు రాజు కుబేరుడు ఆనాటి చర్చలు ముగించి కోట కు చేరుతాడు. ఆంధ్ర జనపదాల మీద ఆర్యావర్తానికి (ఉత్తర భారతావని) కన్ను పడుతుంది. గోదావరి , కృష్ణా పరివారక ప్రాంతాల సంపన్న పంటలు, ధాన్యాలకి పేరు పొందింది. కరువు తో ఉన్న ఉత్తర భారతానికి చక్రవర్తి మగధ రాజుకి కప్పంగా చెల్లించవలసి వస్తుంది ఈ జనపదాలకు.
ఆంధ్ర జనపథం లోని రాజు కుబేరునికి అది సంసిద్ధమే కానీ, మిగిలిన జనపదాలకు ఆ కప్పం కట్టడం ఇష్టం ఉండదు. వాళ్ళు కలవక పోత్తే చక్రవర్తి కోపాన్ని తన ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతూ ఉంటాడు రాజు కుభేరుడు.
ఆ సందర్భంలో మనకు ఆ నాటి జనపదాలైన కనకగిరి (గుల్బర్గా ), సువర్ణ గిరి (కర్నూల్ ), ఆశిక (హైదరాబదు) స్కంద గిరి (ఖమ్మం), బ్రహ్మగిరి (కర్ణాటక) లను పరిచయం చేస్తారు రచయిత.
ఆ రాత్రి గడవటం కష్టమౌతుంది రాజుకి. రాజు యొక్క క్రమ శిక్షణతో కూడిన దినచర్య– రోజు గురించి కూడా మనకు వివరాలు ఇస్తారు అప్పుడే. అవన్నీ కూడా కౌటిల్యుని అర్థ శాస్త్రంలో వివరంగా ఉందని పేర్కొంటారు.
ఈ ఆలోచనల మధ్య రాజు గారు మంత్రి, పురోహితులతో చర్చించి ఊరి చివర ఉన్న గుహలో బస చేసిన జైన గురువులకు సమస్య విన్నవించాలని నిర్ణయించుకుంటాడు.
జైన గురువు చక్రవర్తులకి మిత్రులని ఆయన సలహా ఆశించి వెళ్తాడు. అక్కడ జైన గురువుతో పాటు మరో తేజో మూర్తిని కూడా చూస్తాడు. ఆయనకు కూడా నమస్కరించి , జైన గురువులకు తనకు వచ్చిన సమస్యను వివరిస్తాడు. మగధ చక్రవర్తులు వ్యతిరేఖంగా తనకు వెళ్ళాలని లేదని, కానీ మిగిలిన జనపదాలు కలిసి రావటం లేదని సమస్య వివరిస్తాడు.
ప్రక్కన ఉన్న తేజోమూర్తి సమాధానం గా, మగధ సైన్యంను ముందు ఉండి నడిపించమని, తనే చంద్రగుప్తుడని తన వివరాలు వివరిస్తాడు. చంద్రగుప్తుడు రాజ్యం కుమారునికి అప్పగించి కార్ణాటక లోని జైన ఆవాసానికి వెడుతూ వుంటాడు అప్పుడు.
ఈ కథ చదివితే ముందు వివరించిన చారిత్రక విషయాలన్నీ, ఈ ఒక్క కథ చదవటం వలన పాఠకునికి తెలిసిపోతాయి. ఇలా అల్లనల్లన చరిత్రను అందించటం చక్కటి ప్రయోగం. చరిత్రను తెలుకోవాలనుకునే వారు, తెలుగు వారు అందరూ తప్పక చదవలసిన పుస్తకం ఇది.
ఈ విషయాలన్నీ పొందుపర్చిన పద్దతి, కథా కాలం, స్థలం, పేర్లు పద్దతి అన్ని మనకు “ఓల్గా నుంచి గంగ” అన్న రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం గుర్తుకు వస్తే తప్పులేదు.