చేతనవు, స్వయం ప్రకాశ చైతన్యము !!
జగతుకు కారణము, పోషణ నీవు!!
ధారుణా యన్న అజ్ఞానము నీవే, జ్ఞానము నొసగు మహా సరస్వతినీ నీవే!!
అన్నింటిని స్వహాచేయు కాలము,
అన్నింటిని లయము చేయు రాత్రివీ నీవే!!
కాళరాత్రివి, మహారాత్రి మోహరాత్రివి నీవు!!
ప్రజలను తిరిగి తిరిగి మోహింపచేయు మహామాయవు!!
ఉత్తముల చెంత లక్ష్మివి
అధముల ఇంట అలక్ష్మివి నీవే!
బుద్ధిమంతునిలో మేదవు..
సత్పురుషులలో హృదయములో తెలివి నీవే!!
స్త్రీలకు బిడియపు రూపమైన లజ్జవు నీవు!!
సంసారములో మునిగే జీవులను
దాటించు దుర్గవి నీవు !
ఈ జగత్తును కాపాడు జగదంబవు నీవు!!
ఈ జగత్తు నీకు ఆట కదూ అమ్మా
పూర్వాపరములు ఇచ్చి క్రీడించ జగన్మాతవు నీవు.
నీ అపార కరుణతో పరమ పాపులకు సైతం ముక్తినిచ్చు ముక్తి కాంతవు నీవే!!
‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’ కార ‘య’కార అనుచ్ఛారముల మూడున్న మాత్రల
‘ఓం’కారము నీవు.
మానవులోని మూడున్నర మూర్ల కుండలిని శక్తి నీవు!!
‘య’ అనుచ్చారమను తురీయము నీవు, తురీయాతీతవు నీవు!!
అమ్మా నిన్ను పరాగా ధ్యానించు నావంటి దీనులకు కరుణతో దీవించు కారణ స్వరూపమైన శ్రీమాతవు నీవే!!