ముక్కు చెంపలు
మా బడి 5 తరగతి వరకూ మామూలు బడి వంటిది.
అది వీధి బడికి ఎక్కువ, ప్రభుత్వ బడికి తక్కువ.
కానీ తాలూకా సెంటరు కాబట్టి మంచి హైస్కూలు వుండేది.
దాంట్లో 6 తరగతి నుంచి మొదలు.
5 తరగతి వరకూ కూడా పిల్లలు ఎక్కువ టీచర్లు తక్కువ వుండే స్కూలు. అంటే రెండు క్లాసులు ఒక టీచరు.
ఫర్నీచరు వుండేది కాదు.
అంతా నేల మీదే కూర్చునేవారు. ఒక్క ఐదవ తరగతిలో మాత్రమే బల్లలు అన బడే పీటలు వుండేవి. అందుకని అదో విధంగా గోల గోలగా వుండేది.
అందుకే మేమందరూ
“ఎప్పుడు హైస్కూలుకు పోతామురా బాబు!”
“ఎప్పుడు బల్లలపై కూర్చుంటోమురా బాబు!!”
అని ఎదురు చూస్తూ వుండే వాళ్ళము.
మాకు టీచర్ల కొరత చాలానే వుండేది. ఒక్కొక్క సారి నాలుగు, ఐదు క్లాసుల వాళ్ళని ఒకచోటకు చేర్చి, నడిపేవారు.
అలాంటప్పుడు, గోల ఎక్కువగా వుండేది.
పిల్లలను కంట్లోల్ చెయ్యటానికి లెసన్ బదులు పిల్లలని ప్రశ్న లడిగి చెప్పని వారికి రకరకాల పనిష్‌మెంట్లు వేసెవారు.
అంటే, కొందరు కర్రతో చేతిలో ఒక్కటి వేసేవారు. కొందరు టీచర్లు చెప్పని పిల్లలను బల్ల మీద నిలబెట్టేవారు. కొందరు గోడకుర్చి వెయ్యమనేవారు. కొందరు సమాధానము చెప్పిన పిల్లలతో ముక్కచెంపలు వేయ్యించేవారు.
ఈ ముక్కచెంపలు వెయ్యటమంటే చాలా గ్రేటు. వాళ్ళు చాలా చలాకి. స్డూడియస్‌లకి అలా అవకాశమన్నమాట.
ముక్కు పట్టుకు ఆ చెంపా ఈ చెంపా ఈడ్చి లెంపకాయ కొట్టాలి.
మళ్ళీ ఇందులో ప్రెండ్స్ కు లైటుగా దెబ్బతగలకుండా కన్సేషన్ తో తడుముతారు. టీచరు కనుక నోటిస్ చెస్తే,
“ఎందద గంధం రాస్తున్నవా? వెయ్యి లేకుంటే నీకు పడతయయి’
అని మళ్ళీ వెయ్యించేవారు.
కాదంటే వీళ్ళకు పడేవి.
లీజరు లో ఫ్రెండ్సు మధ్య రహస్య ఓప్పందాలు వుండేవి.
అదీ అంతర్జాతీయ స్థాయిలో.
‘నీవు కొట్టాల్సి వస్తే నెమ్మదిగా కొట్టు’
నాకు చాన్సు వస్తే నేనూ మెల్లగా కొడతాను’ అని
ఒక్కోసారు కొందరికి ముక్కు పట్టుకోగానే చీమిడి కారేది.
నవ్వి నవ్వి మళ్ళీ ముక్కు పట్టుకోకుండా చెంపదెబ్బలు వెసేవారు.
అయినా ముక్కచెంపలు వెయ్యటం సరదాగా వుండేది. బ్రేకులో మెల్లగా కొట్టానుగా అని వాళ్ళతో బడాయి పోయేవారము.
ఇలాంటి పనిష్‌మెంట్లలో కొందరు సెన్సిటివ్ గాళ్ళు ఏడ్చేవారు. “ఆ ఏడుపు చదివేటప్పుడుండాలి’ అని టీచరు కోప్పడేవారు.
నేను క్లాసులో బానే చదివేదాని. క్లాసు టెస్టులలో నాది ఎప్పుడూ రెండో మూడో స్థానము వుండేది. మొదటి స్థానము కోసము పోటి పడేదాన్ని కాదు పెద్దగా. ఎందుకంటే, మా క్లాసులో ఒక బట్టీ మేళం వుండేది. పుస్తకాలలో వున్నది పున్నట్లుగా దింపేది. నాదంతా భావము గ్రహించి సొంత తెలివితో కెలకటం. ఆ తేడాతో ఎప్పుడూ ఆ పెంకుకే క్లాసు పస్టు.
అక్క ఐదు, నేను నాలుగులో వున్నప్పుడు ఆ రోజు అందరిని కలిపి కూర్చోపెట్టారు.
సైన్సు తరగతి. టీచరు ఎదో ప్రశ్న వేశారు. నేను తప్ప క్లాసు క్లాసంతా నిలబడ్డారు. ఐదో తరగతి నాల్గో తరగతి వాళ్ళందరికి హోలుసేలుగా ముక్కుచెంపలు వేసే బంపరు ఆఫరు నాకు తగిలింది.
అది లాటరీ కన్నా ఎక్కువ.
అసలు ఇద్దరికో ముగ్గురికో వెస్తారు చెంపలు. కానీ హోల్‌సేల్‌గా ఇంత మందికి. అసలు నా తెలివితేటలకు నేను మురిసిపోయాను.
నాకు కలిగిన ఆనందములో తప్పు చేశాను. అది తిప్పుకోలేని తప్పు.
రష్యాలో ఎడారి రావచ్చు, గల్ఫ్ లో మంచు కురవచ్చు కాని మా అక్కను మాత్రం ఎవ్వరూ తాకకూడదు.
నేను అది మరచాను.
అందరిని దడ దడ లాడించుకుంటూ, అదే ఫోర్సులో అక్కను కూడా వేశాను.
దానికి నాకు పచ్చ గడి మద్యవేస్తే తగలడేది. అది నన్ను గుర్రుగా చూసి అప్పటికి వూరుకుంది.
దానికి చెయ్యి దూకుడు జాస్తి. నేను దూకుడులో దూకుడుగా పైగా దాని మీద వుంచు కున్న పగతో వాయించాను.
కానీ రాబోయే అగ్నిపర్వతమును ఆపలేక పోయాను.
ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఏమవుతుందో అన్న విషయం మరచాను. క్షణికమైన ఆనందాలతో ముక్కు చెంపలు వేశాను.
ఇంటికి వెళ్ళాక నన్ను పూర్తిగా త్రిబుల్ ఎక్స్ సబ్బుతో తెల్లగా వుతికి, ఆరేసి,
గంజి పెట్టి మళ్ళీ ఆరేసి ఇస్త్రి చేసింది.
అమ్మ
“ఎందుకు కొట్టుకు చస్తారే”
అంటే చెప్పదు.
నన్ను చెప్పనీయ్యదు.
“వదిలెయ్యవే ఒంటివూపిరిది”
అంటే కూడా వదల్లేదు ఆ రోజు.
అలా నేను నా తెలివితో తెచ్చుకున్న తంటా.
ఆ తరువాత మళ్ళీ మేము ఇద్దరము ఒక తరగతి గదిలో కూర్చోలేదు.
కాని ఆనాటి ఆ భయం నాకు ఈ రోజుకూ వుంది తనంటే. తను నవ్వేస్తుంది కానీ నా భయం నాది. ఏ మంగలము నా మీద పడుతుందో అని.