టటట
మామిడి బుట్ట – టెంకెల గుట్ట
కొల్లాపూరు మామిడి పండ్ల కు, సీతాఫలాలకి చాలా ప్రసిద్ధి. అక్కడి మామిడిని మించిన మామిడి లేదని పేరు. నాకు నూజివీడు, బంగెనపల్లి ఇత్యాదివి తెలియవు. కొల్లాపూరు లో దొరికే మామిడి పండును మించినది లేదన్న నమ్మకము నేటికీ మారలేదు. అక్కడ దొరికే పళ్ళు చాలా తక్కువ. ఈ మామిడి, సీతాఫలలు మాత్రమే తెగ లభ్యం. కిలో లలో డజనులలో అమ్మేవారో లేదో నాకు తెలియదు. కానీ నాన్న గారు ఎప్పుడూ బుట్టలతో తెచ్చేవారు. ఒక బుట్ట మామిడి, ఒక బుట్ట సీతా ఫలము అలా. పిల్లలము వున్నామనే కాదు ఇంటికి ఎవరో ఒకరు వచ్చేవారు. వారికి పండ్లు చేతిలో పెట్టేవారు.
ఒక బుట్టలో 25 పండ్ల వరకూ వుండేవి. అవి పెద్దగా కూడా వుండేవి. రసాలైనా అమ్మ వాటిని మేము పిండుకు తినలేమని తరిగి ముక్కలు చేసి ఇచ్చేది. నాన్నగారైతే చక్కగా చాకుతో చెక్కంతా వలచి, చిన్న ముక్కలు తరిగి మా కిచ్చేవారు. అమృత మయమైన ఆ ఫలల ముక్కలు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయి ఎంతో సంతోషానిచ్చేవి.
అందుకే మామిడి పండ్లు అంటే ఇంట్లో అంతా ఎంతో సంతోషంగా ఎలాంటి అల్లరి లేకుండా అన్నం తినేసేవారము.
బుట్టలో గడ్డి వేసి వాటిలో పండ్లు పెట్టేవారు. పైన మెత్తవి, కొంచం పచ్చివి క్రింద వుంచేవారు. పైవి తినేసరికే క్రిందివి పండి తినటానికి సిద్దమయ్యేవి.
కొన్ని సందర్బాలలో చిన్న రసాలు కూడా తెచ్చేవారి. అవీ మధురమే. తీసుకొని కొద్దిగా చుట్టూ వత్తి పిండగానే రసమంతా వచ్చేసేది. టెంకకు అంటుకునేది కాదు. అసలు మామిడి పళ్ళే అన్ని పండ్లలో రారాజు. అలాంటి పండ్లు బుట్టలతో తెచ్చుకు తినటము తప్పక ఒక భోగమని నాకు అమెరికా వచ్చాక తెలిసింది.
సీతాఫలాలు అంతే. అవి కొన్ని పచ్చి వాటిని తెచ్చి కాల్చి ఇచ్చేవారు. నాకు కాల్చినవి ఇష్టం వుండేవి కావు. పండకపోతే బియ్యం డబ్బాలో పెడితే రెండురోజులకు చక్కగా పండిపోయేవి. మాకు బియ్యానికి డ్రమ్ము వుండేది. అందులో ఈ పండ్లు మగ్గపెట్టేది అమ్మ.
సరే ఒక వేసవిలో మామిడి బుట్ట తెచ్చారు నాన్న. అమ్మ వాటిని రసాలని చెప్పింది. కొద్దిగా పండాలను రెండు రోజులు ఆగి తిందామని చెప్పింది. మరురోజుకు ఆ వాసనతో ఇల్లంతా గుమగమలు. ఆగనీయ్యటమే లేదు మాకందరికి. మేము విలవిల లా డుతున్నాము. రెండోరోజుకు బుట్టు తీసి చూస్తే అంతా కాళీ. అమ్మకే కాదు మాకందరికి కంగారు. వాసనకు వాసనొస్తోంది, బుట్ట చూడబోతే హొళ్ళే. పళ్ళు మాయం. అమ్మ నావైపు చూసి తలెగరేసింది ‘ఎమయ్యాయి?’ అన్నటు. ఇంటో ఏది పాడైనా నాదెనా బాధ్యత. టూమచ్.
‘నాకు నిజంగా తెలీదమ్మా!’ అన్నా నే డబుల్ కంగారుగా. నా మీద కొచ్చిందేంటని మొదటి కంగారు.
పళ్ళు ఏమయ్యాయి అని మరో కంగారు.
భయం గా వెతికాము మంచం క్రిందంతా. కనపడలేదు.
అమ్మకు అర్థం కాలేదు ఎమయ్యాయో. నాన్నగారి ని అడుగుదామని అప్పటికి వెతుకులాట ఆపి అన్నాలు తిన్నాము. నాన్నాగారు క్యాంపు నుంచి రాత్రికి గాని రారు.
ఆ రోజు మేమంతా డిసైడు అయ్యాము మా ఇంట్లో భూతముందని. మా ఇంటికి ప్రహరి గోడకు మధ్య వున్న దక్షిణ సందు మేము వాడము. మాకు భయం కూడా అందులో భూతాలంటాయని అనుకునేవారము. ఆ సందులో వీధి వైపుకు మెట్లు. ముందు నుంచి మెట్ల వైపు వెడతాము. అంతే. వెనక వైపుకు మేము వెళ్ళము పనివాళ్ళు తప్ప.
సాయంత్రము పెరడులో దాగుడు మూతలు ఆడుకుంటున్నాము. నేను చాలా ధైర్యం గలదానినని కదా పేరు. దానికితోడు ఎవ్వరికి దొరక కూడదని ఆ సందులో దాకున్నా. బెడురూము కిటికి క్రింద పెద్ద గుట్ట. అసలు రహస్యం తెలిసింది. అదే మాయమైన మామిడి పండ్ల విషయము. గుట్టలా టెంకలు పడి వున్నాయి.
ఆవేశం పాలు ఎక్కవ కాబట్టి, లెక్కపెడితే 25 వున్నాయి. బోయి మంటూ అమ్మ ను కేకలేసి పిలుస్తూ పరుగెతాను ఇంట్లోకి. అందరూ కంగారు ఎం చూశానో అని భయపడ్డారు.
నేను డిటెక్టివ్ లా అమ్మ తో
‘చూడు ఎవరో తిని ఇక్కడ సందులో ఎవ్వరూ చూడరని టెంకలు పడెశారు. ఆ మంచం ప్రక్క కిటికి ఈ సందులో వుంది కాబట్టి వాసనొస్తూ వుంటే మనము బుట్టలో వున్నాయనుకున్నాము. అన్నీ ఎవరో మింగేశారు. నీవు నన్ను అనుమానపడుతున్నావు” అన్నాను పరమ ఆవేశంగా!
అమ్మ మిగిలిన తమ్ముడు, అక్క వైపు చూసింది. అక్క చూపు తప్పించి
‘ఆ ! ఏంటి? నాకు ఆకలేసింది. నేను తినేశా. దీనికి లెక్క చెప్పాలా?” అంటూ వెంఠనే ప్రతిదాడికి సిద్దమయ్యింది.
అమ్మ దానిని చాలా లైటుగా కేకలేసింది చెప్పలేదని. కడుపు నొప్పి వస్తుందని. అంతే ఇంకేమి అనలేదు.
ఎంటో అమ్మలు అసలు. మన కన్నా పెద్దాళ్ళని ఏమీ అనరు. మనలను సూపరు రిన్ తో తోముతారు.
సరే అనుకున్నా. తరువాత బుట్టలో దానిని కాయలు మట్టనీయ్య కూడదనుకున్నా గానీ ఎం చేస్తాము చెప్పండి? అది పెద్దది. వద్దంటే తంతుంది. అందుకే ఎమీ చెయ్యలెక మనసులో బాగా తిట్టుకున్నా.
పండ్లలన్నీ తిని టెంకలు వదిలేసిన మా అక్క హ్యాపి.
మేము ఆకరుకు టెంకలు లెక్కెట్టు కోవలసి వచ్చింది. అందుకే తరువాత కొన్న వెంటనే నా వాటా నేను తీసుకొని తినటము మొదలెట్టేశా.