కోతికొమ్మచ్చి -6
నానమ్మ వాళ్ళ వూరు వెళ్ళాలంటే అదో ప్రహసనములా వుండేది. అప్పటి ప్రయాణ సౌకర్యమల వలననో మరి ఎందుకో. మా వూరు నుంచి ఉదయము బస్సులో హైద్రాబాదు బయలుచేరితే మధ్యహాన్నానికి హైద్రాబాదు చేరేవారము. అక్కడ్నుంచి రైలు ప్రయాణము. మాకు రైలు కూడా చాలా కొత్తగా బలేగా వుండేది. మా వూర్లో రైలు వుండేది కాదు మరి. రైలులో తెనాలి కి ఒక రాత్రి పట్టేది. తెనాలి నుంచి రెపల్లె బస్సు అర్ధరోజు. అక్కడ్నుంచి 5 కిలో మీటరులు కూడా వుండని కటిక పల్లెటూరు కు మూడు గంటల బస్సు. బస్సు దిగి ఇసుకలో నడిచి పోతే నానమ్మ ఇల్లు వస్తుంది.
(రాక్షసుని ప్రాణాలలా నానమ్మ ప్రాణాలన్నీ ఆ ఇంటి
మీదే)
అక్కడ కరెంటు వుండేది కాదు. బయలుచేరిన రెండు రోజులకు ఆ వూరు చేరేవారము. మాకు నిజానికి అట్లాంటా నుంచి హైద్రాబాదు ఒక్కరోజులో వెళ్ళిపోగలము. మన దేశంలో రవాణ సౌకర్యాలు ఆ రోజులలో అలా వుండేవి మరి.
ఒక వేసవికి నానమ్మ మళ్ళీ బయలుచేరింది వూరికి మమ్ముల నందరిని తీసుకు. ఆ వూరు సముద్రానికి దగ్గరగా వున్న పల్లెటూరు.
మేము వెళ్ళినప్పుడు అక్కడకు సాయంకాలాలు సముద్రపు ఘోష వినపడేది. ఆసారి పల్లెటూరి లే బాబాయి పిల్లలు మురళి అన్న, చిన్న చెల్లి కూడా అక్కడే వున్నారు.రెపల్లె లో చదువుకునేవారు వారు.
మేము వాళ్ళతో కలసి ఎంతగా ఆడామో ఆ వేసవిలో.
గడివాములు ఎక్కి దుమికాము. ఆవు దూడల వెనక పడి పరిగెత్తాము. అక్క పెద్దమనిషీలా ఆవు పొదుగు నుంచి మా అందరి నోట్లోకి పాలు పితికేది.
రెండు రోజులు మాకు పగలు రాత్రికి తేడా తెలియలేదు. అంతగా రోజంతా గెంతులే. సాయంకాలాని వళ్ళంతా దురదలు.
“గడ్డి వాము ఎక్కకండిరా వళ్ళు దురద పెడుతుంది’ అని నానమ్మ గోలపెట్టేది. కానీ మాకు రెక్కలు వచ్చినట్లుగా వుంది. ఆ ఆటలు మా వూర్లో కుదరవు కదా.
మూడో రోజు ముసురుగా వుంది. మేము ఆగకుండా ఎగురుతునే వున్నాము. అక్కకు గడివాము మీద ఎదో గుచ్చుకుందని ఇంటికి వెళ్ళిపోయ్యింది.
మేము గెంతి గెంతి ఇంటికి వెళ్ళేసరికే నానమ్మ స్తోత్రం అందుకుంది. నేనే రింగు లీడరని. అందరిని జేరెసి ఆటలని దొడ్లెంబడి పడి తిరిగి ఆమెను సతాయిస్తున్నానని. అక్క కాలికి పెద్ద వాపు. అది ముల్లు కాదట. తేలు కుట్టిందట. అక్కడ ఆసుపత్రి కూడా వుండదు. రెపల్లె వెళ్ళాలి. అప్పటికి చీకటి పడుతోంది. కరెంటు కూడా వుండదు ఆ వూర్లో. నాన్నమ్మ నెతి కొట్టుకుంటూ ఎవరినో కేకెసింది. వాళ్ళు వెళ్ళి పాముల వెంకయ్య అంట పట్టుకొచ్చారు. అతను తేలు మంత్రం వెసి దీని నోట్లో పొడి పోసి వెళ్ళాడు.
అక్క ఎంత నొప్పి పెట్టినా ఏడవదు. నేను మాత్రం చిన్నదానికే గంగా యమున ప్రవహింపచేస్తాను. అయినా అది ఇంటికి ఆట మధ్య లో వెళ్ళిందిగా. అప్పుడే నానమ్మకు చెప్పవచ్చుగా. అన్నీ నేనె చెప్పాలి. చూసుకోవాలి. చిన్నదానినైనా కూడా. మరు రోజుకు దాని వాపు నొప్పి తగ్గిపోయాయి. నానమ్మకు ఏవో మంత్రం వచ్చు. ఆమె దీనికి నొప్పి రాకుండా ఆ మంత్రం వెసేది రోజూ.
ఆ తరువాత రెండు రోజులలో అనుకోకుండా పెద్ద గాలివాన రావటము, అక్కడ బాబాయి ఇంటి పెరడులో వున్న పెద్ద చీమచింత చెట్టు కూలటము జరిగాయి. మేమంతా పోలో మంటూ విరిగిన చెట్టు మీద పడి సీమచింత కాయలు కోసుకు తింటూ రోజంతా కోతులలా ఆ చెట్టు మీదే కాపురము. ఈ అక్కకు తేలు భయం తో నో మరోటో మరి రాలేదు. కుళ్ళుతో నానమ్మ ను పది సార్లు పంపినా నేను తమ్ముడు, మురళి అన్న పడిన చెట్టు నుంచి దిగలేదు. వచ్చాక మాత్రం ఆవిడ వదలేదు. బాగా దేహశుద్ది చేసింది. ఇంక నా ఎడుపూ అల్లరి భరించలేక రెండోరోజు మా వూరు తీసుకోచ్చేసింది.