కోతికొమ్మచ్చి -5
చెరువులో మునక
మేము పెరిగిన వూరులో నీటికి సంబంధించిన వేమీ అంటే చెరువు, నదీ కాలువ లాంటివి వుండేవు కావు. కేవలము ప్రభుత్వపు నల్లా తప్ప. పాడుబడిన పెద్ద దిగిడుబావి వుండేది కాని, దాని దగ్గరకు వెళ్ళిందే లేదు.
ఎప్పుడైనా పుణ్యదినాలలో నదీ స్నానాలకు దగ్గరలోని సోమశిలకు గూడు బండిలో వెళ్ళేవారము.
దారంతా ఎగుడు దిగుడుగా వుండి ఈ పెద్దాళ్ళంతా లబలబలాడేవారు.
అందుకని అది చాలా తక్కువ సార్లు వెళ్ళాము. ఈ కారణాన మాకు కంటి నిండా నీరు చూసిందేలేదు ఎప్పుడూ మా చిన్నతనాన.
నానమ్మ వాళ్ళ వూరు రేపల్ల దగ్గర పల్లెటూరు. నాన్నమ్మ కు బాల్య వివాహము. ఆమెకు ముగ్గురు పిల్లల తరువాత తాతగారు పాముకాటుకు పోయారు. దాంతో అన్నీ వదిలేసి ఆమె పుట్టింటికి తెనాలి వచ్చేసింది.
ఆ హడావిడిలో తాతాగారి వంద ఎకరాలు, ఈమెవి ఏడువారాల నగలు దాయాదులు స్వాహా చేశారు. చివరకు వీళ్ళు కు ఎలాగో 10 ఎకరాలు ఇచ్చారుట. ఆ పది ఎకరాలు, పోలానికి ఆనుకొని ఒక ఇల్లు ఆమెకు ప్రాణప్రదంగా వుండేవి. నాన్నగారు మాత్రం అటు వెళ్ళేవారు కారు. అందుకని నాన్నమ్మే వెళ్ళి కౌలు కిచ్చిన డబ్బు తెచ్చుకునేది.
ఆమె వేసవిలో వెళ్ళినప్పుడు రెండు సార్లో, మూడు సార్లో మమ్ములను కూడా తీసుకుపోయ్యింది.
ఆ పల్లెటూరిలో మమ్ములను వింత కోతులనో, అప్పుడే వేరే గ్రహం మీద్నుంచి దిగిన గ్రహంతరవాసులను చూసినట్లు చూసేవారు.
‘నైజాముకి వెళ్ళిపోయారు’ అని చెప్పుకునే వారు.
మేము అక్కడ నోరు విప్పకూడదని ఒక నిబంధన కూడా మా మీద అమలు పరచబడి వుండేది.
ఎందుకంటే మేము మాట్లాడే తెలంగాణాకు వాళ్ళు తట్టుకోలేరని. వాళ్ళ యాస నిజానికి మమ్ములను ఉక్కిరిబిక్కిరి చేసేది.
వాళ్ళ పాలు పోయటానికో, మరోక పనికో వచ్చేవారు
‘మామ్మగారండి బావున్నారా? పిల్లలన్ని తీసుకొచ్చినట్లువుండారే” అంటూ..
నాన్నమ్మ ’అవును లే. నీవు పాలు పోసి వెళ్ళు’
వాళ్ళు వెడతారా? ఉహూ, మా దగ్గరగా వచ్చి
’పాపగారండి, ఏంటి చదువుతున్నారండి తమరు?’
నేను ‘ఎందీ’?
పాలు తెచ్చినామె ‘ అదెంటండి ? ఎం చదవండీ? మీ నాన్నగారేరండీ’
నేను ’నాయన ఆఫీసు పోయిండు. మేమిడికి వచ్చినము. నీకు సమజైత లేదా మేము చెబితే. నీకు తెల్వడంటగా. నాన్నమ్మ చెపుతుండె’
అప్పటికే నాన్నమ్మ వచ్చి వాళ్ళను తరిమేశేది.
అలా వుండేది సంభాషణ.
వాళ్ళు నవ్వేస్తూ వుండేవాళ్ళు మమ్ముల్ని చూసి. మేము ఇగిలిస్తూ తిరిగేవాళ్ళము.
ఆ వూర్లో రెండే బ్రహ్మణ కుటుంబాలు. ఒకటి నానమ్మది. మరోటి నాన్నగారి దాయాదులనెవారు. ఆయన బాబాయి మాకు. వూర్లో రెండు చెరువులు వుండేవి. ఒకటి మంచి నీటి చెరువు, ఒకటి బట్టలుతుకునేది. అక్కడే బర్రెలను కూడా తోముకునే వారు.
ఆ చెరువులో కమలాలు కూడా వుండేవి. ఆ పెద్ద పెద్ద చెట్లు, చెరువులు , గట్టు, పొలమూ, దాని ప్రక్కగా పంట కాలువ, చాలా అందముగా చూడ చక్కగా వుండేవి.
నాన్నమ్మ బట్టలను మమ్ములను తీసుకొని ఈ చిన్న చెరువు వద్దకొచ్చేది.
మేము నీళ్ళు మొకం ఎరుగని వారము కాబట్టి నీళ్ళ లోకి కొద్దిగా వెళ్ళి తెగ గెంతేవారము.
అలాంటి ఒక హడావిడి ఉదయాన మేము పోలో మంటూ చెరువుకెళ్ళాము. నాన్నమ్మ తరువాత వస్తానని మమ్ములను ముందు పంపింది. పెద్ద అక్క కాపలా మేము నీటిలోకి వెళ్ళకుండా.
మేము తాళ్ళు విప్పిన దూడలలా పరుగు పరుగు చెరువుకు చేరాము.
నీళ్ళ దగ్గర నానమ్మ లేకపోవటం వలన బోలెడంత స్వేచ్చ. ఇంక మునకలే మునకలు. పెద్ద అక్క కూడా పిల్లే కదా. తనూ ఆనందముతో నీళ్ళలో గెంతుతూ వుంటే జరిగిందిట ఆ యాక్సిడెంటు నాకు. నేను లోపల లోపలికి వెళ్ళి బురదలో కాలు దిగ పడి మునిగి పోయాను. బాగా నీళ్ళు కూడా త్రాగానుట.
నా గౌను తేలుతూ చెరువు లోపల కనపడిందట. అక్క పెద్దగా కేకలు, అందరూ గట్టెక్కి అరుపులు ఏడుపులు. అటుగా వెడుతున్న పెద్దోళ్ళు చెరువులోకి దూకి, గౌను లాగి నన్ను వడ్డున పడేశారుట. నా పొట్ట నొక్కటము గట్రా చేసి వుంటారు.
ఎవరో నానమ్మను తీసుకొచ్చారు. ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చి ఎత్తుకుపోయింది ఇంటికి. తరువాత నేను కళ్ళు తెరవని జర్వంతో వుంటే నాన్నకు కబురు పంపారు. నాన్న వచ్చి మమ్ముల్ని కొల్లాపూరు తీసుకొచ్చారు.
నాకు తెలియవు తరువాత జరిగిన వన్నీ. చిన్నక్క చెప్పింది. ఆ తరువాత మేము మళ్ళీ ఆ వూరు మరో రెండుసారి వెళ్ళాము కాని చెరువుకు ఎప్పుడూ వెళ్ళలేదు. నాకు నీటి గండం వుండేదని, అలా పోయ్యిందని అనుకునేవారు అప్పట్లో.