నా సంగీతము – నానా యాతన
నా మొదటి సంగీత గురువు అమ్మనే!
అమ్మ సంగీతం నేర్చుకుంది. చక్కటి త్యాగరాజ కృతులు పాడేది. అమ్మమ్మ ఇంట్లో అమ్మమ్మకి, అమ్మకి , పిన్నికి సంగీతం వచ్చు. అమ్మమ్మ ఫిడేలు వాయించేది. పిన్ని వీణ, అమ్మ మాత్రం గాత్రమే పాడేది. అదేంటి అమ్మా అంటే, పాటలు ఎక్కడైనా హాయిగా పాడుకోవచ్చును. అదే ఇన్సర్టుమెంట్ అయితే మోసుకు పోవాలి అని” అని చెప్పి నవ్వేసేది.
సన్నని కంఠం తో అమ్మ పాడుతూ ఉంటే ఆ హాయి చెప్పనలవి కాదు. అసలు పనులు చేసుకుంటూ అమ్మ ఎన్ని కీర్తనలు పాడేదో అన్ని జానపదాలు కూడా పాడేది. జోలపాటలు అమ్మకు వచ్చినన్ని ఎవ్వరికి తెలియదని పిన్ని రికార్డు చేసే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు.
ఆమె కంఠంలోని మాధుర్యం మాకెవ్వరికి లేదని నానమ్మ అబిప్రాయపడేది. అది నిజము కూడా.
అక్క కంఠం సన్నగా ఉంటుందని అమ్మ అభిప్రాయం. నాది బొంగురు గొంతు అన్నది కూడా ఆవిడ అభిప్రాయమే అనుకోండి!
అందుకే దానికి సంగీతం నేర్పించాలని అమ్మ ఉబలాటపడింది కానీ నాకు నేర్పించక తప్పలేదు.
ఎందుకంటే దానికి అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు పాడటం.
అమ్మ పిలిచి కూర్చుపెట్టినా ఉండేది కాదు అది. వెళ్లిపోయేది.
“నాకు అలాంటివేమీ వద్దు ” అని విసిగేసుకునేది.
చిన్నపోవటం పాపం అమ్మ వంతు. అప్పుడు మనం రంగ ప్రవేశం చేసి, :నేను నేర్చుకుంటానుగా! నాకు నేర్పు” అని వెంటపడేదాని.
మా ఊరులో సంగీతం నేర్పే వారు ఎవ్వరు ఉండేవారు కారు. సంగీతం మాస్టారు ఉంటే వారి దగ్గర నేర్చుకుంటానని అక్క బొంకేది.
వచ్చానని, కొద్దిగా శ్రద్దగా ఉన్నానని అమ్మ నాకు సంగీతం మొదలెట్టింది ఒక శుభముహూర్తాన.
మా దగ్గర తంబూరా కానీ, శృతి బాక్స్ కానీ ఉండేవి కావు. అయినా అమ్మకు స్రుతి బాగా తెలుసు. ఎలాగో నాకు అర్థమయ్యేది కాదు.
అలా అమ్మ దగ్గర నా సంగీతం మొదలుపెట్టాను. నా సంగీతం క్లాస్ ఏమంత సీరియస్ గా సాగలేదు. అమ్మ వంట చేసుకుంటూనో, మరో పని చేసుకుంటూనో సరిగమలు పాడించేది. అలా నేను నేర్చుకుంటూ అలంకారాలు వరకూ నేర్చాను.
మా హై స్కూల్ కి మొత్తానికి ఒక సంగీతం టీచర్ని పంపారు దేవుడెవరో.
ఆవిడ చాల మంచివారు. అందరికి ఎంతో కొంత సంగీతం నేర్పాలనే చాలా తాపత్రయ పడ్డారు. ఆవిడ స్కూల్ లో జాయిన్ అయ్యాక అమ్మకి ఆ కబురు అందింది. సంగీతం టీచర్ వచ్చారని. ఇంక అమ్మ సంతోషంగా మమ్ములను ఆవిడా దగ్గరకు పంపే ఏర్పాటు చేసింది.
మా అక్కకు తప్పలేదు. చచ్చినట్లు వచ్చేది సంగీతం క్లాసుకు. మేము అలా ఎక్కువ రోజులు కూడా వెళ్ళలేదు. ఆమెను మళ్ళీ ట్రాన్సుఫర్ చేసేసారు. అసలు ఆమె ఎదో తప్పక ఆ ఊరు వచ్చినట్లుగా ఉంది. తనకు కావలసిన ఊరు ట్రాన్సఫర్ రాగానే ఆవిడా జంప్.
ఆ సంగీతం టీచర్ గారు భారీ మనిషి.
చాలా హెవీ గా ఉంటూ, అమెరికన్ జార్జెట్ చీరలు కట్టుకొని వచ్చేది. పెద్ద కొప్పు. చీర ఒక వరసలో వేసుకొని వచ్చి చాలా ఫ్రీ గానే తిరిగేవారు ఆవిడ. మా అందరికి ఆవిడ డ్రెస్ స్టైల్ చాల కొత్త. పైపెచ్చు వింతగాఉండేది. ఆమె చాలా మాచింగ్ పిచ్చి లో కూడా ఉండేవారు.
తర్వాత తెలిసింది, ఆమె సెక్రటరీ లో వాణిశ్రీ అంటే ఇష్టమని, ఆ స్టైల్ ఫాలో అవుతూ ఉండేవారని.
ఆవిడ చాలా నవ్వు మొకం తో ఉండేది. అందరికి స్కూల్ లో చిన్న చిన్న పాటలు నేర్పించే ప్రయత్నం చేసేవారు.
ఇంటి దగ్గర అందరికి సంగీతం నేర్పలేదు. అమ్మ అంత ఇంటరెస్ట్ మరి మా వూరిలో ఎవ్వరికి లేకపోయిందేమో నాకు తెలియదు.
మేము ఆమె దగ్గర చేరాక, అక్కతో పాటు నాకు మళ్ళీ సరళీ స్వరాలతో మొదలైంది.
ఆవిడ శృతి చాలా హై శృతి. అమ్మది చాలా తక్కువ శృతి కాబట్టి కొద్దిగా తేడా.
ఈ అక్క పుణ్యన్న నేనూ చచ్చి చెడి ‘శ్రీగణనాథం’ గీతానికి వచ్చే సరికే ఆమెకు ట్రాన్సఫర్ వచ్చి ఆమె జంప్.
స్కూల్ మొత్తం అందరికి కలిపి ‘రార వేణు గోపబాల’ స్వరజతి నేర్పించారు.
ఆ పాటలు నేర్చుకోవటం ఒక పద్దతి , పాడటం ఇంకో గొడవ.
మా వూర్లోనే శాస్త్రీయ సంగీతము కొత్త.
టీచరుగారెమో తాళం వేసుకునే టప్పుడు మెల్లగా వెయ్యకూడదనేవారు. టపటపా తొడలు పగలకోటేసుకోవాలి. మా కందరికి తొడ మీద తాళం వేసుకోవటం చాలా సిగ్గుగా ఉండేది.
ఎందుకు అని అడగకండి. ఆలా ఉండేది అంతే.
అందుకని నోట్ బుక్స్ తీసుకొని, వాటి మీద తాళం వేసేవాళ్ళం.
ఆవిడా “అలా వద్దు,తొడ వాడండి, తొడ వాడండి ” అంటూ గట్టిగ చెప్పేవారు. మేము చేతులు అడ్డం పెట్టుకొని, కిస్సుకున నవ్వేసేవారం. తప్పితే మా తొడలు వాడే వారం కాదు.
అలా మేము స్కూల్ లో వేదిక ఎక్కి పాటలు కూడా పాడాము. ఆ రోజు పాడటానికి వెడుతుంటే మాకు ముందే టీచరుగారు చాలా స్టిక్టుగా చెప్పారు.
‘నోటు పుస్తకాలు వాడకండి. మీ తొడలు వాడండి’ అని.
మేము అందరమూ రహస్యంగా నోట్సు స్టేజీ మీదకు స్మగుల్ చేసి, అక్కడ కూర్చొని పుస్తకాలను బయటకు తీసాము.
ఈ లోపలే మరో టీచరు ‘నోట్సు తీసుకుపోరా తాళం వెసుకోవటానికి’ అన్నారు. వెంటనే సంగాతం టీచరు గారు గట్టిగా ‘వాళ్ళ తొడలు వున్నాయి. అవి వాడుతారు’ అన్నారు. ఆమెకు మైకు అక్కర్లేదు. అందరికి వినపడిందని మేము చూడాలి సిగ్గుతో చచ్చాము ఆ రోజు.
ఎక్కడ పాటకైనా ఆమె నన్ను అలర్ట్ చేసేవారు. చూడు, తాళం సరిగా పడుతోందా? శృతి సరిగా వచ్చిందా వాళ్లకు అంటూ. కేవలం నేను ఆమె దగ్గర నేర్చుకుంటునందుకేమో ఆ శ్రద్ద.
మొత్తానికి మేము ఒక పాట పూర్తిగా నేర్చుకొని పాడామోలేదో ఆమె ట్రాన్సఫర్ అయి వెళ్లిపోయారు.
నేను హైదరాబాదు లో ఇంటర్లో చేరాక, సంగీతం, వీణ క్లాసులలో చేరి సంగీత సాధన చేశాను. అది మళ్ళీ ఇంకో కథ అవుతుంది.
ఆంధ్రాలో ఉన్నట్లు తెలంగాణలో కూడా సంగీతం నేర్పే వారు లేనందున, తెలుగు రాష్ట్రాలు ఒక గొప్ప సంగీత విద్వాంసులను కొల్పోయారు. ఆ విద్వాంసులు నేనే!! 🙂