నాన్నగారు వచ్చే ముందు గదిలోకి విభూతి సువాసనలు వస్తాయి . తరువాత ఆయన వస్తారు. ఆయన గురించి తలుచుకుంటే చాలా మిక్సడ్ ఫీలింగ్సు కలుగుతాయి.
ఆయన భోళా శంకరులు. అవి వీర భక్తులు. అగ్నిహోత్రానధానులకు అన్న వంటి వారు. హృదయము చూస్తే నవనీతము. అందరిని కలుపుకు పోయే తత్వం. ప్రతివారికి కాదనకుండా సాయము చేసే గుణం. బంధు ప్రీతి. వేదములంటే వీపరీతమైన భక్తి. ఉదయము పూజ కానీదే మంచినీరు కూడా తాకరు. అంత నిష్ఠ. అన్నింటికి మించి నిత్యసంతర్పణలు. మాస శివరాత్రులు, అభిషేకాలు. భాగవత సప్తాహాలు, సుందరాకాండ పారాయణాలు. వేద పండితులను సదా పూజించేవారు.
మమ్మల్ని ఉదయమే లేపి చదవమని కూర్చోబెట్టేవారు. క్రమశిక్షణ చాలా ముఖ్యం ఆయనకు. ఏనాడు స్కూలు కొచ్చి మేమెమి చదువుతున్నామో చూడలేదు. మమ్మలను తేడా లేకుండా సమానముగా చూచేవారు.
ఆయనంటే భయం తప్ప మరో భావన వుండేది కాదు చిన్నప్పుడు మాకు. చుట్టాలందరిలో చాలా మంచిపేరు వుండేది ఆయనకు. విపరీతమైన దానగుణం. కుటుంబానికి మిగిలినది హుళ్ళు లా చేశారు. ఏమీ సంపాదించి పిల్లలకు ఇవ్వాలని వుండేది కాదను కుంటా.
మా ఇంట్లో ఎప్పుడూ ఎదో ఒక సంతర్పణలే. ఈ హడావిడి, పూజలు, హారతులు మంత్రపుష్పాలు. మేము స్కూలు నించి ఇంటికి వచ్చేసరికే ఎవరు వుంటారో తెలియదు. అంత కంగారుగా వుండేది. అప్పుడు చిన్నతనము. పైపెచ్చు తినటము, ఆడటము, మధ్య మధ్యలో చదువుతో సాగే జీవితములో ఎప్పుడూ ఎదో ఒక పూజా, సంతర్పణ అంటే’ అబ్బా మళ్ళీ నా! ‘ అనిపించేది.
అమ్మను “ఎంటమ్మా ఎప్పుడూ ఇలా…” అంటే,
అమ్మ ‘మీకెందుకు నొప్పి, మీ తిండి మీరు తిని, మీ చదువు మీరు చదవండి’. అని కొప్పడేది.
మాకు అందరము కూర్చొని తినటము లాంటివి వుండేవి కావు. వారంతా మడిలో తినేవారు. నానమ్మ తోసహ. అమ్మ మాకు పెట్టి తను తినేది. మేము బలవంతం చేసేవారము మాతో తినమను.
ఇంట్లో హోమాలు కూడా చాలా చేసేవారు. ఒక సారి పది రోజులు యాగము చేశారు నాన్న. ఆ యాగానికి 20 మంది రుత్వికులు వచ్చారు. చుట్టాలు కూడా చాలా మంది. మేము రోజూ ఉదయమే గబగబా తయారయి, స్కూల్కి వెళ్ళి వచ్చే సరికే వీళ్ళందరూ కూర్చొని పురాణాల విషయమో మరోటో వాదనలు చేస్తూ వుండేవారు.
చాలా పేరున్న వేద పండితులు వచ్చారు ఆ యాగానికి. ఖండవల్లి నరసింహశాస్త్రి గారు, వట్టెము శాస్త్రి గారు, పెంట్లవల్లి ఆచార్యులు మొదలైనవారు.
వీరు ప్రతి రోజూ ఎదో హోమము చేసి సాయంత్రానికి మంత్రపుష్పం చదువుతూ వుండేవారు. ఆ పది రోజుల తరువాత నాకు తమ్ముడికి కూడా మంత్రపుష్పము, దుర్గా సూక్తం నోటికి వచ్చేసింది.
మాకు పెద్దగా తెలియదు. స్కూల్లో టీచరు మీ ఇంటికి చాలా పెద్ద పండితులు వచ్చరట కదా. మేము వచ్చి దర్శనము చేసుకుంటాము అని చెప్పే వరకూ…….మా పరిస్థితి అలా వుండేది…..
భక్తితో జీవితాన్ని పండించుకున్న నాన్న మాకు ఆదర్శప్రాయులు నేడు. ఆనాడు కాదు. ఆనాడు ఎప్పుడూ ఆటలు ముద్దు మచ్చట్లే కదా. మరో దృష్టి లేదు.
నాన్న శ్రీశైలము డ్యాము కట్టే సమయములో అక్కడ లైజన్ ఆఫీసరు. ఆ సందర్భములో ఆయన ఆ మల్లన్న సేవ చాలానే చేసుకున్నారు. ఒక చాతుర్మాసవేళ కంచి స్వామి జయేంద్రసరస్వతి స్వామి వారు ఉమామహేశ్వరము వచ్చారు. ఆయన ఆ నలభై రోజులూ ఆ క్షేత్రంలో వుండిపోయారు. నాన్నకు లైసన్ పని. ఇంక ఈయన పరవశించి నలభై రోజులూ సర్వం మరచి ఆ స్వామి సేవ చేసుకున్నారు. ఇల్లు పట్టించుకోలేదని, ఇలా స్వాముల వెంట తిరిగితున్నారని అమ్మమ్మ గొడవ చేసినా పట్టించు కోలేదు. అమ్మ మాత్రం నోరు తెరచి ఒక్కమాటా మట్లాడేది కాదు. అన్ని మాటలు అమ్మమ్మ, నానమ్మ చెప్పేవారు.
ఒకసారి హైద్రాబాదు శంకరమఠము కు భారతీ తీర్థస్యామి వచ్చారని ఆయనకు పాద పూజకు మమ్ములందరిని తీసుకుపోయారు. అమ్మ నాన్న ఆయన దగ్గరగా వెళ్ళి ఆయన పాదాలకు వాళ్ళిచ్చిన కాయిన్స్ వేసి నాన్న ప్రవర చెప్పుకు స్రాష్టాంగము చెయ్యటము నా కళ్ళ ముందు నుంచి నేటికి చెరగదు.
నాన్న ఆ పీఠాదిపతుల వద్ద వినమ్రంగా నోటి ముందు చెయ్యి పెట్టుకు మాట్లాడుతూ పరవశించి పోతూండేవారు. ఆయనకు అలంపూరు లో వున్నప్పుడు పెరియవా గా భక్తులు ప్రేమగా పిలిచుకునే సాక్షాత్ శంకర భగవత్పాదుల వారి అవతారమైన చంద్రశేఖర స్వామి యతివరేంద్రులు విడిదిచేశారు. అది శివరాత్రి. స్వామి వారు మౌనములో వున్నారట. నాన్నకు మమ్ములను తీసుకుపోయి ఆయన ఆసీసులు తీసుకోవాలని నిశ్చయం. మేము ఆ రష్ బస్సులలో కొట్టుకుంటూ కోల్లాపూరు నుంచి అలంపూర్ వెళ్ళాము. ఆ తొక్కిడికి నాకు జర్వం వాంతులు. నన్ను అంత జర్వములో కృష్ణలో ముంచారు నాన్న. ఆ తరువాత మేమంతా స్వామి దర్శనానికి వెళ్ళాము. ఎవ్వరిని వెళ్ళనివ్వటములేదు. నాన్న అక్కడి ఆఫీసరు కాబట్టి మేము లోనికి వెళ్ళాము. ఆయన గొంతుకు కూర్చొని వున్నారు. నాన్న అలవాటుగా బొక్కబొర్లా పడి మమ్ములని పడమని కళ్ళతో సైగ చేశారు. మేము అందరము వరసగా సాష్టాంగము చేశాము. ఆయన చెయ్యి ఎత్తి మమ్ములను ఆసీసులిచ్చారు. తరువాత ఆయన ఇంక ఎవ్వరిని చూడలేదు. లోపలికి వెళ్ళిపోయారు.
మేము బయటకు వచ్చాము. నాకు మరురోజు జర్వం తగ్గింది. ఇంటికి వచ్చేశాము. అప్పుడు నేను ఎడవ తరగతిలో వున్నాను.
నాన్నకు బోలారములో ఒక గురువులు వుండేవారు. ఆయనకు తెలుగురాదు. డూబే గారు అని పిలిచేవారు. ఆయనతో హిందిలో మాట్లాడాలి. ఆయన వయస్సు నాకు తెలిసి 120 సంవత్సరాలు. హిమాలయాలలో తపస్సు చేసి వచ్చారని ఆయన గురించి నాన్న చెప్పేవారు. ఆయన చాలా ఎత్తుగా పలచగా, తెల్లగా వుండి తెల్లని గడ్డముతో మౌనముగా వుండేవారు. నాన్న ప్రార్థన మన్నించి ఇంటికి వచ్చారు ఒకసారి. అక్కయ్య పెళ్ళికి కూడా వచ్చివెళ్ళివెళ్ళారు. ఆయన ఆసీసులు మా అందరికి వుండాలనేవారు నాన్న.
ఎంతో భయపెట్టి పెంచినా నాన్న అంటే చాలా ఇష్టం వుండేది. ఒక సారు ఇండియా వెళ్ళి నప్పుడు, నాన్న తిరుగుతూ తిరుగుతూ హఠాత్తుగా మాయమయ్యారు.ఒక సెకనులో. తిరుగుతూ తిరుగుతూ. అనాయాసముగా. అలా కూడా పోవచ్చునని తెలియదు. ఎ.మ్.ఎస్ లో చూసి ఎవరన్నా మగాళ్ళని పిలవండి అన్నారు. చెప్పండి అంటే మిగల్లేదు అన్నారు.
అంతా ఎడ్చారు.
కానీ నాకు అంతా అఖండమైన మౌనముగా అనిపించింది.
నాకు కలిగిన లోపము నేటి వరకూ నేను ఎవ్వరితో పంచుకోలేదు!
నాన్న గారు నికార్సయిన వేదమాతను కొలచిన భక్తులు. మానువులు ఎలా జీవించాలో తను చూపించారు. సంప్రదాయాన్ని మన్నించారు. పాటించారు. సనాతనధర్మం కోసము తమ వంతు కృషి చేశారు.
ఆయన ముఖములో బ్రహ్మ తేజస్సు వుట్టిబడుతూ వుండేది. మా గురువుగారు( బ్రహ్మశ్రీ సామవేదం వారు) కూడా ఒకసారి ఇంటికొచ్చినప్పుడు నాన్నగారు ఫోటో చూసి ‘ఎవరమ్మా వీరు, వూర్ద్వపుండములతో బ్రహ్మ వర్చస్తు తో వున్నా”రని అడిగి మరీ తెలుసు కున్నారు.
వేద పండితులకు ఎప్పుడూ మా ఇంటి గుమ్మాలు స్వాగతిస్తూ వుండేవి. వారు ఏ సమయములో వచ్చినా భోజనాలతో పాటు కొంత వారికి సంభావన ఇచ్చి పంపేవారు. బీదలకు ఆయన చేసిన గుప్తదానాలు మాకు పూర్తిగా తెలియదు కూడా.
ఆయన పోయారంటే చూడటానికి 200 మంది వచ్చారు. మాకెవ్వరూ తెలియదు వారిలో. పదవరోజు 500 మంది స్వచ్చందముగా వచ్చారు. శ్రీశైలము మొదలు కాశీ, రామేశ్వరములో కూడా ఆయన పేరు చేబితే లేచి నమస్కరిస్తారు. వారలా చేయ్యటానికి ఆయన ఎం చేశాడో తెలియదు కాని ధర్మ పరిరక్షణ తన మతంగా, వేద విద్యార్థులను ఆదరిస్తూ, వేద పండితులను గౌరవిస్తూ వుండి తిరుగుతూ తిరుగుతూ ఈశ్వరునిలో కలిసిపోయారు. ఆయన మార్గం నాకు ఇప్పటికైనా అర్థమయ్యిందనుకుంటే అది నాకు గౌరవమే!!