ఫణిగారితో పండుగ
మా చిన్నప్పుడు పండుగ అంటే పది రోజుల ముందుగానే హడావిడి మొదలయ్యేది. మా పిల్లలందరము బట్టల కోసం, కుట్టించుకోవటము లాంటి వాటితో హాడవిడి మొదలెట్టేవాళ్ళము. పండుగ రోజైతే ఉదయమే తల్లంట్లతో మొదలై, సాయంత్రము చుట్టాలు పక్కాలు, ముచ్చట్లతో పూర్తి కావలసినదే. అందునా వికాయకచవితి మాకు ఇష్టమైన పండుగలలో ఒకటి. చవితికి వినాయకుని ముందు చాలా కష్టమైన సబ్జెక్టు పుస్తకాలు వుంచి, వాటి మీద గంధంతో ‘ఓం’ రాయించుకొని, కష్టాలు గట్టెకుతాయనే నమ్మకముతో చదివేవాళ్ళము. అవి ఇండియాలో… చిన్నప్పుడు.
అమెరికా వచ్చాక మాకు ఏ పండుగైనా వారాంతరమే. వారము మధ్యలో పండుగ, పండుగే కాదు. కుదరదు. అంతే!!
అందుకే ఏదైనా వీకెండు లేదా ఇక్కడి సెలవులలో గనుక మన తెలుగు తిథి కలసి వచ్చి పండుగ వస్తే ఆ సంతోషమే వేరు. ఎంచక్కా మేమిద్దరమూ కలసి ఆ పండుగను ఆస్వాదిస్తాము. దానికి తోడుగా పిల్ల కూడా ఇంటికి వచ్చిందంటే అది ఆ పండుగ బోనస్. ఆ పండుగ మరింత హృద్యంగా మారుతుంది. దానిపైన మా ఫణిగారు అదేనండి , సరస్వతీ వర పుత్రుడు,
వీణాబ్రహ్మ, సుస్వర గాయకుడు శ్రీ వడలి ఫణినారాయణ గారు ఈ వినాయకచవతికి అట్లాంటా లోని మా నిజవాసములో మాతో పాటూ వుండడమే బంపర్ బోనస్,అతి పెద్ద పండుగ…
వారుంటే ఇంట్లో అలా శృతి వినిపిస్తూనే వుంటుంది. సరిగమలు గమకాల సొగసద్దుకొని, గాలిలో తేలియూడుతూ నృత్యము చేస్తుంటాయి. ఇంట్లో ఎటు చూసిన తల్లి వాగ్దేవి చిరు దరహాసము కనిపించి వినిపిస్తుంది. మధురవీణ అమృతపు తుంపరలు మన మీద చిలుకూ వుంటాయి. సంగీత సరస్వతిని అలా నాలుక మీద నిలిపి వీణ తంత్రులు గోరు చివర తగిలించి, ఆయన కదిలే సుస్వరాల విపంచికగా దర్శనముస్తూ వుంటే, అక్కడ పండుగే.
గత మూడు సంవత్సరాలుగా ఈ సమయములో నేను ఇండియాలోనే వుంటున్నాను. ఈ సారి అందరము కలసి ఇక్కడ ఇలా ఈ పండుగను వుండటము అద్బుతంగా వుంది. బియ్యం పిండితో నేను చేసుకున్న శ్రీ శ్వేతగణపతి ఆ ఉదయము విచ్చేశారు.
పత్రి, పువ్వులూ ముందు రోజు కొన్నా, మళ్ళీ ఆ ఉదయము ఇంట్లో వున్న చెట్లుకు ఆకులు, పువ్వులు తెచ్చుకున్నాము. గుమ్మాలకు బంతి మాలలు, మామిడాకులు కట్టుకున్నాము. మా దేవుని గదిలో గణపతికి మండపము పెట్టి, పాలవెల్లి కి పళ్ళు కూరలూ అలంకరించాము. బియ్యం మీద ఆకు పరచి గణపతిని నిలిపాము. గణపతికి పత్రి అలంకారము చేయ్యటము కూడా అయ్యింది. ఫణి గారు ఆ ఉదయము నుంచి పరమాత్మను తమ నాదముతో సేవిస్తూనే వున్నారు. నేను నా శక్తి కొలది నైవెద్యాలు చెయ్యటమూ అయ్యింది.
స్వామికి షోడశోపచారములు చేసి, చేసిన వుండ్రాళ్ళూ, పులిహోర, పాయసము, గారెలు, బూరెలతో నివేదించి – స్వామి ప్రసాదము స్వీకరించాము.
మాకు ఈ సంవత్సరము అలా బంపర్ గా పండగకు డబుల్ ఢమాకా. ఫణిగారి గానములో మునిగి తేలూతూ, వారి గానామృతముతో దేవుని మందిరము, గృహము, మా హృదయము తడిసి మద్దయైనాయి.
మేము పునీతులమైనాము. ఆ పండగే కాదు, వారున్న ఈ పది రోజులూ పండగగా గడిచింది. ఈ భాద్రపదము అలా మా మనసులను మురిపించి పండించింది.