నా కరవాచౌత్
కరువాచౌదు మాములుగా ఉత్తర భారతములో ప్రసిద్ధి. నేను చిన్నప్పుడు చూసిన హిందీ సినిమాలలో ‘ఈ కరవాచౌదుని, స్త్రీలందరూ మూకుమ్మడిగా జెల్లెడ లోంచి భర్త ను చూసి తరువాత భోం చెయ్యటము గుర్తు. హిరోయిన్ కూడా పెళ్ళి కాకుండా హీరో కోసం ఇలా చెయ్యటము, ఎవ్వరూ చూడకుండా జెల్లడలోంచి ఈ హిరోని వెత్తుకోవటము ….గట్రా లు చెయ్యటము కూడా ఎదో సినిమాలో చూడటము గుర్తు. అది చిన్నప్పుడు.
మళ్ళీ మొన్నీమధ్య వరకూ ఆ వూసే లేదు. ఇప్పుడు ఎవరో అడిగితే ఇవ్వన్నీ గుర్తుకు వచ్చాయి. నా జీవితములో అలా శ్రద్ధగా చేసిన ఆ కర్వౌ చౌదు ఒకే ఒక్కసారి. అప్పుడు నేను గుడిలో వాలంటీరు పని చేస్తున్నాను. కొందరు ఉత్తర భారతీయ భక్తులు ఆ పండుగ చేసుకుందామని ఆహ్వానించారు. అందుకని, చేసేది శ్రద్ధ చెయ్యాలన్న నా నియమము బట్టి కూడా నేను ఆసారి చెద్దామనే ఆలోచన చేశాను. నాకు ఉపవాసము చెయ్యటానికి సమస్యలేదు కాని చిన్నప్పటి నుంచి ఉపవాసాలతో కడుపులో అల్సరు మొదలై ఇంక సమయానికి కొంత పడేసే పరిస్థితి వచ్చింది. కాని ఈ సారికి ఎలానైనా చేద్దామని, నాకు నేను ధైర్యం చెప్పుకొని వాళ్ళతో సరేనన్నాను.
అలా రెండేళ్ళ క్రితము నేను కరౌచౌదు చెయ్యటము జరిగింది. పళ్ళము దీపము, చెంబు లాంటి సామను గుడిలో అమర్చుకున్నాము. ఆ రోజు సాయంత్రము దాదాపు 4 గంటలకు గుడిలో సమావేశం. గుండ్రముగా నేల మీద కూర్చున్నాము మొత్తం 20 మందిమి. వారిలో కొద్దిగా పెద్దావిడ ఆ విధివిధానము చెబుతూ మాచే పూజ చెయ్యించింది. హరతీ పాట పాడి, హరతీ కూడా ఇచ్చాము. కథ వుంటుంది. చాలా నోములకు వున్నట్లుగానే.
ఈ కథలో వివేకి(పేరు మరోటో) అన్న యువతి, ఎడుగురు అన్నల గారాల చెల్లి. ఆమెకు రాజు గారితో పెళ్ళి అవుతుంది. పెళ్ళి తరువాత వచ్చిన ఈ పండుగకు (పౌర్ణమి తరువాత వచ్చే నాలుగో రోజు) ఈ ఉత్సవము. అందుకు చేతులకు గోరంటాకు, కొత్త బట్టలు, సౌభాగ్యం గుర్తుగా ఎరుపు రంగువి, అన్నీ సిద్దం. అసలు రోజున అమ్మవారి పూజు చేస్తుంది వివేకి.
పూజ ముగిసిన తరువాత చంద్ర దర్శనము చేసి నీరు త్రాగి ఉపవాస దీక్ష విడవాలి. ఆ ఉదయము నుంచి భోజనము చెయ్యకూడదు కదా మరి. సరే మన వివేకి పూజ చేసి చంద్ర దర్శనము కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ఆకలికి తట్టుకోలేక పోతూ కూడా వుంటుంది.
అన్నలు తన చిన్నారి చెల్లి పడే కష్టం చూసి చలించి, ఆలోచన చేసి దర్పణము సాయంతో చంద్రబింబము సృష్ఠిస్తారు. అది చూచి నిజమైన చంద్రునిగా తలచి వివేకి ఉపవాసము వీడుతుంది. వెంటనే ఆమెకు భర్త మరణించాడన్న వార్త తెలిస్తుంది. తెగ కుమిలిపోతూ పార్వతీ మాతను వేడుకుంటుంది ఆమె. వివేకి కి పొరపాటు చెప్పి అమ్మవారు ఆమె మరణించిన భర్తను బ్రతికిస్తుంది.
ఇలా ఈ కథను తలచుకొని బయటకు వెళ్ళి మేము చంద్రునికి అర్ఘ్యమిచ్చి లోనికి వచ్చాము. ఎందుకో జల్లెడలో చూడలేదు. నా దగ్గర అప్పుడు జల్లెడ కూడా లేదు. నేను ఆ ఉదయము నుంచి ఏమీ తిననందుకు మా శ్రీవారు కూడా తినకుండా ఆఫీసు కు వెళ్ళారు. ఈ పూజ అయ్యే సమయానికి తను ఆఫీసు నుంచి గుడికి వచ్చేశారు. తనే నాకు నా పల్లెం నుంచి ప్రసాదం తీసి తినిపించి ఉపవాస విరమణ చేయ్యించారు. ఏ నోము అయినా అందరూ సుఖసంతోషాలే కోరుతుంది. కాబట్టి ఎవరికి కుదిరినవి వారు చెయ్యవచ్చునన్న నా భావన. అందుకే ఆసారి అలా ఆ మిత్రలతో కలసి నే కరవాచౌద్ చేసుకన్నా.ఈ రోజే కరవాచౌదు. అన్నీ గుర్తుకువచ్చాయి అలా.. ఈ ఫోటో ఆనాడు గుడిలో మిత్రులు తీసి మాకు బహుమతిగా ఇచ్చారు.
ఈ సంవత్సరము చేసుకుంటున్న మిత్రులకు శుభాకాంక్షలు.