నా ఎదురుగా కుర్చీలో కూర్చొని అగుపించారు. ఆయన చేతిలో చేతి కర్ర. భుజము మీద అంగవస్త్రము. మూఖాన అగ్నిహోత్రములా నుదుటిన ఎర్రని కుంకుమ బొట్టు. కళ్ళజోడు. శిఖ తో , నీరుకావి కాటను లాల్చీ, పంచా కట్టుకొని కాలు ఒకటి కాస్త ముందుకు చాచి పెట్టుకు కూర్చున్నారు.
ఆశ్చర్యంగా అనిపించింది.
నేను ఆయన భక్తులలో లేను. కాని నాకు కనపడ్డారేమిటి??
సరే కనపడ్డారుగా… పెద్దవారు. పైపెచ్చు బాగా పేరున్నవారు. వాగ్దేవిని అలవోకగా అవుపోశన పట్టినవారు.
నాకు సహజముగా పెద్దలంటే వుండే భక్తితో వెళ్ళి పాదాలకు వందనములు అర్పించా.
తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. తల మీద ఆయన పెట్టిన చేతి స్పర్ష… మెత్తగా..
నా ఆశ్చర్య ము దాచుకోకుండా
“నేను మీ ఫ్యాను కాదు…మరి నాకు అగుపించారేమిటి?” ప్రశ్నించా…
చేతి కర్ర పైకెత్తి తిరుగుతున్న పంకా వంక చూపి….’నీవు అంటున్నది అదా? ఫ్యాను ఏమిటి?’ అన్నారు.
‘చెప్పకండి. మీకు ఆంగ్లం రాదంటే …. మీరు పట్టబద్రులు… భాషా సంకరజాతి నాది. ఏదీ సరిగ్గారాదు. ఏదో అమెరికాలో వుండబట్టి నాలుగు ఇంగ్లీషు ముక్కలు బడాబడా వాగుతానన కానీ…. నాకొచ్చినది శ్యూనమని తెలుసు…’ నిజాయితిగా వప్పుకున్నా….
‘అందరూ మీ శిష్యులమని చెప్పుకుంటారు…’ పొడగించా..
‘నీవుకాదా?’ ప్రశ్నించారు…
‘నేనెలా? మీరు రాసినవి ఏ నాలుగో చదివాను… అయినా మీకు మాత్రమే అర్థమయ్యేలా రాశారని మీరనంటే..’ అల్లరి నా గొంతులో…
‘అహా! అలాగే…మరి ఏవో సమీక్షించపోతివే…’ నవ్వారు ఆయన..
‘మానేశాగా.. మా గురువులు మీ వద్ద శిష్యులటగా’ తెలుసుకోవాలని ప్రయత్నం….
‘చాలా మంది నా శిష్యులంటారు.. రెండు చదివి మూడోది నేనే రాశామంటారు’ వివరించే ప్రయత్నం…
‘అంటే మా ‘ఆ’ గురువులు కాదా మీ శిష్యులు?’ ఆరా గా అడిగాను…
‘చూడమ్మాయి! నా తరగతి గదిలో విద్యార్థులందరూ నా శిష్యులే.. నా రచనలు చదివి, ప్రేరణ తో రాసేవారు శిష్యులే.. పద్యాలను సేకరించి పంచేవాలు శిష్యులే… ఆ శిష్యులుకు శిష్యులైన నీ లాంటి వారు కూడా…’ గంభీరంగా వివరించారు
‘నే కాదు..’ అడ్డు తగిలాను
‘కాదే..’ ఆయన కళ్ళతో కూడా నవ్వుతున్నారు
‘సత్యం.. గా కాదండి’ తల మీద చేయి వేసుకున్నా…
‘అయితే ఇది చెప్పు …. ఈ ఉదయము నీ ధ్యానము ఎవరి పైన? నీ ఆత్మను హారంగా చేసి మెడలో వేసుకోమంటివే… పంచేంద్రీయాలు పుష్పాలుగా మాల గుచ్చి అలంకరించానంటివిగా….ఎవరికి?’ ప్రశ్నించారు…
‘విశ్వనాథునికి’ ధీమాగా చెప్పాను. అవును మరి వారణాసి వచ్చినది మొదలు విశ్వనాథుని మదిలో తలచుకు మాలలలుతునే వున్నారు… ఈయనకేలా తెలుసబ్బా? అని ఆశ్చర్యపోయాను నిజంగా..
‘నా పేరేమింటివి?’ అన్నారు.. నవ్వు పెదాల మీదికి పాకుతోంది ఆయనకు.
ఈయన నవ్వుతాడా? ఎప్పుడూ సిరియస్ మొఖము ఫోటోలే చూసిన గుర్తు.
‘విశ్వనాథ స….’ నా మాట పూర్తి కావటము లేదు…
నేను షాకుగా చూస్తున్నా
ఆయన నవ్వు ఇప్పుడు బయటకే….
‘మరి అదే నేను…’ పెద్దగానే నవ్వారు…
బొమ్మ మాయమవుతుండగా
నేను నా జీవితములో పొందనంతగా షాకుగా
‘విశ్వనాథ సత్యనారాయణ’…. అంటూ పలుకుతూ పూర్తిగా మెలుకువలోకి వచ్చేశాను…..
!!మహాదేవ!!