ఆ ఊరు నన్ను పిలిచింది
ఆ వూరు గోదారి కాలువ ప్రక్కన పంటపొలాల మధ్య
విరిసిన ఆచిన్న పల్లెటూరు –
వూరు చేరే దారి పొడగునా
పరచిన పంటపొలాలు
పెరిగిన కొబ్బరిచెట్లు..
గొదారి కాలువ గట్లున పెరిగినచెట్ల సొగసు
వంగిన కొమ్మలోతో ఆ కాలువ గుసగుసలు
గువగువ పిట్టల…
రైలు పట్టాలు ఆ దిక్కు..
కాలువ ఈ దిక్కు ..నడిమిన పరచిన రోడ్డు..
విరిసిన పూల గుత్తులు,
ఎరుపును పులిమిన కెంజాయి సంజెల పొద్దులు..
నేను చేరానా చిన్న పల్లెకు..
దూడలు తల్లిని చేరిన వేళలు..
పరచిన అరుగులు ఇళ్ళు…
వూరి బావితో అనుబంధాలు…
మర్రి చెట్లు కూడలి..
ఎన్ని మంతనాలకు వేదికో
ఎన్ని ఘన రాజకీయాలపై చర్చలు చూసిందో..
ఆ వూరు ఒక వైపు నాగరికతను కౌగిలించే యత్నం
మరో వైపు పూర్వపు వాసనల జాడలు
ఈ పల్లె గోదారి జిల్ల నడిమిన వున్నది
ఆ పల్లె నన్ను కోడలుగా ఆహ్వానించినది..
ఆ రైతులు అప్యాయత ఎప్పుడూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది..
అసలు పల్లె ఇలా వుంటుందని నాతో ఎప్పుడూ చెబుతుంది..
మళ్ళీ వచ్చి చూసిపొమ్మని ఈ తెలంగాణా పట్నపుపిల్లకు చెవిలో గుసగుసగా చెబుతుంది….