పిఠాపురము శ్రీపాద వల్లభ దర్శనము.
మా ప్రయాణములో మేము రాజమండ్రి నుంచి బయలుదేరుతుంటే శ్రీవారు పిఠాపురము వెళ్ళదామన్నారు. ‘ఎందుకు?’ అని అడిగితే
‘దత్త దర్శనాని’కని సమాధానము. అసలు గుళ్ళు గోపురాలు అంటే పట్టని మానవుడు దత్త దర్శనానికి వెడదామంటే బలే సంతోషమేసింది.
నేను వెంటనే ‘సరే’ అని బయలుచేరాను.
అలా మేము మా రోడ్డు ట్రిప్పులో పిఠాపురములో కుక్కుటేశ్వరుడు, రాజరాజేశ్వరీ దేవి, పురుహూతికా దేవితో పాటు దత్త స్వామిని దర్శించి యధావిధిగా అర్చన, దానముతో పాటు, అక్కడ ప్రసాదము కూడా తిని వచ్చాము.
పిఠాపురము అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ‘పీఠాయాం పురుహూతికా’ అని మనము స్త్రోత్రం చేస్తాము కదా! అమ్మవారి పీఠభాగము పడినందున అది పిఠాపుర మైయ్యింది.
అంతే కాక ఆ పురము గయాసురుని వల్లకూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించింది. గయాసురుడనే రాక్షసుడు తప్పస్సుతో ఎంతో శక్తి సంపాదించి, ప్రపంచములో అతి పవిత్రమైన ప్రదేశము తన శరీరమగునట్లు వరము పొందాడు. ఆ వరముచే అష్టదిక్పాలకులను తన చేతులలో పెట్టుకు పాలించటము మొదలెట్టాడట. ఎంత వెతికినా గయాసురుడు చేసిన తప్పులేదు. అలా ఎంత జనరంజకముగా ధర్మాత్మకముగా పరిపాలిస్తున్నా, ఇంద్రుడు తన పదవి కొల్పోయినందున త్రిమూర్తుల వద్ద మొరపెట్టాడుట. వారు ఇంద్రపదవి తిరిగి ఇంద్రునికి ఇప్పించటానికి గయాసురుని వద్దకు వెళ్ళారు ఋషుల వేషములో.
గయాసురుడు వారికి స్వాగమని, సేవలు చేసి ఎం కావాలో కోరుకోమన్నారు. వారు ఒక యజ్ఞం తల పెట్టామని పవిత్రమైన ప్రదేశము కావాలని కోరారు. ఆయన ఏ ప్రదేశము కావాలో కోరుకోమంటాడు. వారు గయాసురుని శరీరమే అతి పవిత్రం కాబట్టి ఆయన మీదనే ఏడు దినములు యజ్ఞం చేస్తామని, మధ్యలో కదలకూడదని, కదిలితే వధిస్తామని చెబుతారు. గయాసురుడు వప్పుకుంటాడు. ఆరు రోజులవుతుంది. గయాసురుడు కదలడు. యజ్ణం సాగుతూనే వుంటుంది. ఏడవ రోజున శివుడు కోడి వేషములో వచ్చి సూర్యోదయమునకు ముందే కూస్తాడు. గయాసురుడు ఏడు దినములైనవని తలచి లేస్తాడు. మధ్యలో కదిలాడని ఆయనను వధిస్తారు త్రిమూర్తులు. గయాసురుడు తన పేరు నిలబడేలా వరం కోరుకుంటాడు విష్ణువును. అలాగే అని వరమిస్తాడు మురారి.
గయాసుర పేరున శిరో గయా( బీహారు) నాభి గయ (ఒరిస్సా) పాదగయలు పిఠాపురము ఏర్పడినాయి. పిఠాపురములో ఆ కత్రును (యజ్ఞము)
జరిగినదని, అక్కడ పిండప్రధానాది కార్యక్రమాలు చేస్తారు. గయలో కూడా విష్ణుపాదాల గుర్తులు గయాసుకుని మీద వున్నవని, ఆ భూమి అంతా గయాసురుడనే చెబుతారు.
ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరుడైనాడు. ఆయన స్వయంభూగా వెలిశాడు ఈ క్షేత్రములో.
మేము అమ్మవారి అర్చన చేసుకొని, కుక్కుటేశ్వర స్వామిని రుద్ర నమకాలతో అర్పించి, దత్తుని కొలచాము. ఆ దేవాలయములో సుబ్రమణ్యుడు కూడా వున్నాడు. కుజదోష నివారణకు అక్కడ పూజలు చేస్తారుట.
ఇక్కడ శ్రీపాద శ్రీ వలభుని పీఠమున్నది. దత్తస్వామి విగ్రహరూపములో దర్శనమిస్తాడు. మిగిలిన దత్త క్షేత్రాల లో మనకు కేవలము పాదుకలనే పూజిస్తాము. ఇక్కడ మాత్రము దత్తస్వామి విగ్రహమున్నది.
ఈ దేవాలయములో నిత్య అన్నదానము జరుగుతున్నది.
మాకు పూజాది క్రతువులలో సహయము చేసిన అర్చకస్వామి, అక్కడ ప్రసాదము తీసుకోమ్మని సలహా ఇచ్చారు. అలా దత్త ప్రసాదము కూడా మాకు లభించింది.
పిఠాపురము శ్రీపాద శ్రీ వలభుని జన్మస్థానము. గురుచరిత్ర పారాయణము చేసే భక్తులకు విధితమే ఈ చరిత్రము. దత్తస్వామి స్వయంగా వచ్చి సుమతీ రాజశర్మల గృహములో జన్మించి, తొమ్మిదవ ఏట సన్యాసము స్వీకరించి భక్తులను బ్రోచిన క్షేత్రమీ పురము. అలా గణ్గాపురములా
పరమ శక్తివంతమైన క్షేత్రము ఈ పిఠాపురము. మైసూర దత్తపీఠము వారు నిర్మించిన శ్రీవలభుని పీఠము కూడా పిఠాపురములో వుంది. ఇంతటి పుణ్యస్థలము మనకు ఇంత దగ్గరలో వుందా అని ఆశ్చర్యము కలిగింది. మన ఆంధ్రదేశములో వున్న అపూర్వ క్షేత్రాలలో ఈ పురము ప్రత్యేకమైనది. పురాణాలలో కూడా దీని ప్రసక్తి వుంది. స్కాంద పురాణములో పిఠాపుర ప్రసక్తి వుంది. వ్యాసుల వారు యాత్రలు చేస్తూ ఆంధ్రదేశములోని పవిత్ర క్షేత్రాల గురించి వివరిస్తారు. అందులో ఈ పురము గురించి –
“అథ వింధ్యాచలోపాన్తే త్రిలింగోత్కలదే శయోః
సంధౌసమీపే శ్రీ భీమండలస్య పురోత్తమమ్।
నవఖణ్డాన్వితా ఖండల క్షోణీ మండలమండలమ్
నానా సమృద్ధి సమ్పన్నం విఖ్యాతం క్షేత్రముత్తమమ్।।
కేదార కుంభకోణాది పుణ్యక్షేత్ర సమం మహత్।
పిఠాపురం మునివరో నిజ శిష్యైస్సహావిశత్।।” అంటూ పొగుతాడు.
అంటే త్రిలింగ దేశములో వున్న పిఠాపురము నవ ఖండా ఖండలముగు భూమండలమునకు మకుటాయమానమై ఉత్తర దేశములో కేదారములా, దక్షిణ దేశములో కుంభకోణములతో. సమానమగునది ఈ పిఠాపురము ‘ అని వ్యాసుల వారు స్వయంగా రాశారు.
భీమఖండములో శ్రీనాథుడు ఈ పురము గురించి వర్ణిస్తాడు. కుక్కుటేశ్వరుడు మోక్షధాము అని. మేము అలా ఈ క్షేత్రాని దర్శించటము చాలా సౌభాగ్యముగా అనుకున్నాము.
అలా మా హృదయము నిండుగా దత్తునికి అర్చించి, కడుపులో ప్రసాదమేసుకొని మా ప్రయాణము సాగించాము. కుదిరితే ఒక నెల రోజులు ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరగాలి. స్వామి ఎప్పుడు పిలుస్తాడో అనుకున్నాము.
హైవేలు బావున్నాయి. రోడ్డు ప్రక్క అక్కడక్కడా టీ కొట్లు వంటివి, కొద్దిగా రెస్టురూముల వంటివి వుంటే ప్రయాణము మరింత సౌకర్యవంతముగా వుంటుంది.