ఇంట్లో బొమ్మలు పెట్టటానికి మెట్లువుండేవి కావు. అమ్మ, నాన్నగారు కలసి టేబులు, చెక్క పెట్టెల వంటివి కలపి ఒక 5 మెట్లు చేసేవారు. అమ్మ వాటి మీద దుప్పటి పరచి, అందంగా వుండటానికితన చీరతో కప్పేసేది. దీనికే చాలా టైంపట్టేసేది. దాదాపు ఒక రోజంతా అన్నమాట.
ఇక అసలు సరదా బొమ్మలు అమర్చటం అని మా అక్క అభిప్రాయం. మా ఇంట్లో రామ పరివారము, శివుడూ–పార్వతి,
దుర్గాదేవి ఇలాంటి బొమ్మలు పెట్టెలలోవుండేవి. అవి తీసి జాగ్రత్తగా తుడిచిఅక్క ఆ మెట్లమీద సర్దేది. అవన్నీ మట్టిబొమ్మలు. అందుకని మమ్ములను తాకనిచ్చేవారు కారు. చెయ్యిజార్చి పగల కొడతామని. కొన్ని కొండపల్లి బొమ్మలు కూడా వుండేవి. తలవూపుతూ వుండే అమ్మాయి బొమ్మ బలేసరదాగా వుండేది.
ఇవ్వన్నీ అక్కయ్య, అమ్మ కలసి సర్దుతూవుంటే మేము దూరంగా కూర్చొని చూసేవాళ్ళం.
నాకు మంచి ఫన్ మాత్రం తమ్ముడుతో కలసి మా వూరును రిప్లికా చెయ్యటం . అమ్మ, అక్కయ్య బొమ్మలు పెట్టాక, మేము ఆ వూరు చెయ్యటానికి బయటనుంచి ఇసుక తోడి తెచ్చేవాళ్ళం. రెండు మూడు తట్టలు తెస్తే సరిపోయేది. మా సరదా చూసి పక్కింటి రమా, సూరి కూడా మాతో పాటుతిరిగేవారు మాకు హెల్ప్ చేస్తామంటూ.
ఆ ఇసుకంతా పరచి, మా వూరు లోవున్న గుట్టమీద వెంకటేశ్వర స్వామి గుడిని తీసుకొచ్చేవాళ్ళం. మా దగ్గర జంతువుల బొమ్మలు చిన్నవి వుండేవి. అందుకని వూరులో లేని ‘జూ’ ని ఇటు పట్టుకొచ్చి పెట్టేవాళ్ళం. మరి స్కూలు తప్పని సరి. ఆసుపత్రి, పోస్టాఫీసు సరేసరి. ఇలా చిన్న చిన్న బోర్డులు చేసి ఇళ్ళ బొమ్మలకు అగ్గిపుల్లతో కాంపౌండు పెట్టి ఈ బోర్డు తగిలించేవాళ్ళం. మా వూరిలో రాజవీధి చాలా విశాలంగా వుండేది. ఆ వీధిని తెచ్చేవాళ్ళం. కానీ రాజకోటకు కావలసిన కోట బొమ్మ లేదు. కాబట్టి దాన్ని వదిలేసేసి వున్నవాటితో అడ్జస్టు చేసిసర్దేవాళ్ళం. సంతను కూడా అమర్చేవాళ్ళము.
ఆకుపచ్చరంగుతో వూరు చుట్టూ హరితం అద్దితే అమ్మ నాలుగు రోజుల ముందు మెంతులు చల్లి మొలకెత్తిన మెంతి మడి ఇచ్చేది. ఆ మెంతి మడిని మేము ఒకసారి అడవిగా, ఒక సారివూర్లో అక్కడక్కడా చెట్లగానో ఏర్పాటుచేసేవాళ్ళం. ఒకసారి తమ్ముడు క్రికెట్టుగ్రౌండు పెట్టాడు. అది పెట్టటం కోసం వాడు ఒక సంవత్సరమంతా కష్టపడి ఆచిన్న బొమ్మలు సమకూర్చుకున్నాడు.
చివరకు వాటికి దీపాల తోరణంఅమర్చేవారు నాన్న. అమ్మ భోగిరోజు ఉదయం బొమ్మలకొలువుకు దీపారాధన చేసి పాయసం నైవేధ్యంగా పెట్టాక, అప్పుడు బయట వారు చూసేందుకు అనుమతి లభించేది.
ఆ పేరంటము, కుంకుమ, చందనము అద్దటము,పసుపు రాయటం, సెనగలతో వున్న తాంబూలము ఇవ్వటం చేసేవాళ్ళం. మొత్తం 10 రోజులు వుంచేవాళ్ళం. వూర్లో చాలా మంది వచ్చి అడిగి చూసి వెళ్ళేవారు. పిలచినా పిలవకపోయినా వచ్చేసే వారు బొమ్మలకొలువుకు.
సంక్రాంతి హడావిడి మేము హైద్రాబాదు వచ్చేశాక కూడా సాగింది. ఈ హడావిడికి తోడు జనవరి 12 న మేము దోమలగూడ లోని రామకృష్ణ మఠానికి వెళ్ళేవారము. వివేకానందుని పుట్టిన రోజు వేడుకలకు.
భోగి నాడు తమ్ముడితో కలసి పతంగులు ఎగరెయ్యటమూ, మంజా దాచుకోవటమూ, హడావిడి. వాడికి హెల్పులా దారము వదలటము, ఒకళ్ళ పతంగు ఒకళ్ళు కట్ చేసుకోవటమూ, యుద్దాలు హోరాహోరిగా సాగేవి.
సంక్రాంతి పండగ కోసము అమ్మ అరిసెలూ, జంతికలూ చేసేది. కనుము నాడు గారెలు, బయట రథం ముగ్గు తప్పని సరి అయ్యేవి. ఆ రోజులలో తిన్నంత తిండిగా వుండేది. ఇప్పుడు వండటము మనమే, తిండి మనమే అయ్యేసరికే దేని మీద శ్రద్ధ లేకుండా పోయింది.
మా పెళ్ళి అయిన వెంటనే, పాప. అదీ జనవరి 12 న పుట్టడముతో, మేము దాని పుట్టినరోజు వేడుకలలో మునిగిపోయే వారము. దాంతో మళ్ళీ పండుగ చేసే వోపిక వుండేది కాదు. దాంతో నా సంక్రాంతి పండగ పేరంటాలకూ, బొమ్మలకొలువులు చూడటము వరకే సాగింది.
ఇప్పుడు సోషల్ మీడియాకే పండుగ పరిమితమై పోయింది. ఒకళ్ళకు ఒకరు కేవలము గ్రీటింగ్సు చెప్పుకోవటమే పండుగలా వుంది సుమండీ!! అయినా ఎంతో కొంత నూతనత్వము జీవితములో ఈ పండుగ సంబరాలు తేవాలని కోరుకుందాము.