గణపతి ముని

యోగులు- భూమిపై పరమాత్మ స్వరూపములు: నాయన కావ్యకంఠ గణపతి ముని

తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు.

వారు ఏ శరీరమునాశ్రయించినా పరిపూర్ణ పరమాత్మ ను ఆవిష్కరిస్తారు.

భారతదేశ ఆధునిక చరిత్రలో ఇటు వంటి మహానుభావుడు,మహాముని , తపోనిరతుడు కనపడరు. ఆయన మహాతపస్వి. భారతమాత దాస్య శృంకలాలు తెగటానికి తపస్సు చేశారు. తన తపఃశక్తితో మౌన స్వామి అని పేరు పొందిన బ్రాహ్మణస్వామికి భగవాను రమణ మహర్షి అని నామకరణము చేసి,వారి చేత మౌనము మాన్పించారు. అంతటి మహాతపస్వి, కావ్యకంఠ బిరుదాకింతులు, శ్రీ వాసిష్ఠ గణపతి ముని.

ఆయన చరిత్ర చదువుతూ వుంటే మనము మరోలోకాలకు పయనిస్తాము. పూర్వ వ్యాస వాల్మీకిల కాలము గుర్తుకు వస్తుంది. కాని వారు మనమున్న ఈ కాలములో వున్నారంటే అది పరమాత్మే కరుణతో మన మధ్య నడయాడారన్న ధృడ నమ్మకము కలుగుతుంది.

అసాధారణ ధారణ, వ్యక్తిత్వమున్న శ్రీ గణపతి ముని 1878 న కలువరాయి గ్రామములో అయ్యలసోమయాజుల భీమశాస్త్రీ, నరసమ్మలకు జన్మించారు. జన్మనామము సూర్యగణపతి శాస్త్రి. తల్లి అరసవెల్లి సూర్యారాధకురాలు. తండ్రీ గణపతి ఉపాసకులు. తల్లితండ్రులు నిష్ఠాగరిష్ఠులు.

బాలగణపతి ఏకసంధాగ్రాహి. చిన్నప్పుడు మట్లాడటము లేదని తండ్రి పసుపుకొమ్ము కాల్చి నరముపై పెడతాడు. నాటి నుంచి గణపతికి వాక్కవిత ఉప్పొంగినవి.

చిన్ననాటి నుంచి గణపతికి తపస్సు మీద మక్కువ ఎక్కువ. తన 13వ యేట తండ్రి నుంచి 12 మహా మంత్రాలను సాధన చేశాడు. గణపతికి 10వ ఏట తల్లి వియోగము కలిగుతుంది. నాటి నుంచి ఆయన తపస్సు పై దృష్ఠి పెడతాడు. 18 వ ఏట వివాహము నిశ్చయిస్తే, తపస్సుకు అడ్డు రాదనే షరతు పై వివాహము చేసుకుంటాడు. విశాలమ్మ ఆయన భార్య. ఆమెకు శ్రీ విద్య దీక్షా ఇస్తారు గణపతి.

ఆయన కాశీలో తపస్సు చేసుకొనుచూ తన పాండిత్యముచే అక్కడి పండితులను మెప్పిస్తూ వుండేవారు. అలాంటి సందర్భములో శివకుమార పండితుడు గణపతిని నవద్వీపములో జరిగే విద్వత్పరీక్షకు పొమ్మని కార్యదర్శి కి పరిచయ కాగితము రాసి ఇస్తాడు.

గణపతి నాసిక్ వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటూ మొదటిసారి అష్టావధానము చేస్తాడు. తరువాత భువనేశ్వరి పోయి 9 దినాలు ఘోర తపస్సు చేస్తాడు. ఆయనకు భువనేశ్వరీ దేవి సాక్షాత్కారము కలుగుతుంది. ఆమె మధురముగా చిరునగవులు నవ్వుతూ తేనె త్రాగిస్తుంది. ఆనాటి నుంచి ఆయనకు బుద్ది సూక్ష్మత కవితా మాధుర్యం ఇనుమడిస్తాయి. ఆయనకు ఆమె నవ్వు మరుపుకురాదు. అందుకే ఆయన తన ఉమా సహస్రం లో నవ్వు గురించి మధురమైన కవిత్వం చెబుతారు.

1900వ సంవత్సరము లకు ఆయన నవద్వీపము వెడతాడు. ఆయన తన గురించి “గణపతిరితి కవికులపతి రతి దక్షో దాక్షిణాత్యో ఽ హమ్” అని ప్రకటించుకున్నారు. అంటే అంబికకు స్వయంగా పుత్రుడను అని. పండిత పరిషత్తును మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదు పొందారు. ఆనాటి వరకూ దక్షిణ దేశపు వారికి అంత గౌరవము కలగలేదు.

వైద్యనాథములో కొన్ని దినములుండి తప్పసు చేసుకొని తారా మంత్రము పొందుతారు. దక్షిణాదిన ‘తారా’ మంత్రము వీరి వల్లనే వ్యప్తి చెందింది.

తరువాత సోదరునితో కలసి కంచి యాత్ర చేస్తాడు. అక్కడ దొరికిన సలహా పై అరుణాచలము పయనమవుతారు సోదరులు. వీరు అరుణాచలము చేరిన సమయము సాయంత్రము. ఆ పొద్దు ఏకాదశి. వారికి ఎవ్వరూ భోజనము కలిపించరు. సోదరులు ఆకలితో ఒక అరుగుమీదకు చేరి నీరసముగా విశ్రమిస్తారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు పరుగున వచ్చి తన భార్య వ్రత పారణ భోజనానికి ఇరువురు బ్రాహ్మలు కావలెనని, రమ్మని తీసుకుపోతాడు. వారు భోజనము చేశాక, వీది అరుగున తాంబులము సేవించి, పడుకుంటారు. మరునాడు ఉదయము లేచి చూస్తే గణపతి గుడి మండపములో వుంటారు. ముందు రోజు వచ్చినది ‘గణపతి’ అని అర్థమవుతుంది సోదరులికువురికి.

గణపతికి లోకులను యాచించటము బదులు పరమేశ్వరుని అర్ధించటము ఉత్తమమని అనిపిస్తుంది.

ఆనాటి నుంచి అరుణాచలేశ్వరుణ్ణి, ఆపీతకుచాంబికను ప్రార్ధిస్తూ వెయ్యి శ్లోకాల ‘హరస్తుతి’ రచిస్తూ ప్రతి రోజూ దేవాలయములో శ్లోకాలను శివునకు వినిపిస్తూ వుండేవాడు. చివరి రోజు ఆ వూరి వారు ఆయనను సంస్కృతం చెప్పమని ఆ వూరి బడిలో వుండమని కోరుతారు. ఎందరో ఆయన పాడిన శ్లోకాలు వింటారు. వారిలో మౌన బ్రాహ్మణ స్వామి కూడా వున్నారు.

ఆయన కీర్తి తమిళ దేశములో వ్యాపించినది. ఆయన చెన్నయి వెళ్ళి చేసిన ఉపన్యాసాలకు ఎందరో ఆయనకు శిష్యులవుతారు. ఆయన అడిగిన వారికి మంత్రోపదేశము చేశారు. వేలూరు క్రైస్తవ కళాశాలకు రమ్మనమని పిలుస్తారు. ఆయన అక్కడ వారి గౌరవము పొందుతారు. ఆయన వేదములే మూలమని విద్యార్థులలో జ్ఞానము పెంపొందించేందుకు కృషి

చేశారు. ఎందరికో మంత్రోపదేశము లిచ్చినారు.

‘ఉమాం వందే మాతరమ్‌’ అన్న మంత్రము తో ‘ఇంద్రసేన’ ను తయారు చేశారు. రేణుకాదేవి మీద తపస్సు చెయ్యవలెనని ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి, తిరిగి తిరువణ్ణామలై చేరుతారు. ఆయన అరుణాచలములో మరకతశ్యామాంబ దేవాలయములో కొంత కాలము, నైరుతి లింగము వద్ద కొంత కాలము తపస్సు చేస్తారు. అంతలో కార్తీకమాస రధోత్సవము వస్తుంది. రథము కొంత దూరమొచ్చి ఆగిపోతుంది. ఎవ్వరు ఎంత ప్రయత్నించినా కదలదు. రాత్రి అవడముతో అంతా రథాన్నీ అలా వదిలి వెళ్ళిపోతారు. గణపతి మునికి అదే సమయములో శివుడు కలలో వచ్చి రథము కదిలించమని చెబుతాడు. ఆయన మెలుకవ వచ్చి చూస్తే రథము ఆగి వుంటుంది. మరుసటి ఉదయము అందరి ముందర, అందరితో కలసి లాగితే రథము కదులుతుంది. గణపతికి మాత్రము హృదయములో వేడి తగ్గదు. ఆయన అలా నడుస్తూ కొండ ఎక్కి, గుహలో వున్న బ్రాహ్మాణ స్వామి పాదాల మీద పడతాడు. ‘తపస్సు ఫలితముగా శాంతి కలగటము లేదని’ కన్నీట చెబుతాడు గణపతి. మౌనస్వామి ‘తపస్సుకు మూలమైనది ఎక్కడవుందో చూడు’ అని పలుకుతాడు.

గణపతి మునితో అలా మాట్లాడి మౌనము వదులుతారాయన. ఆయనకు భగవాను రమణ మహర్షి అని నామకరణము చేస్తాడు గణపతి. తన బొధతో శిష్యులను ఆదుకోమని కోరుకుంటాడు గణపతి. ‘అలాగే నాయనా’ అని రమణులు పలుకుతారు. అలా గణపతి ముని ‘నాయన’ గా పేరు పొందారు.

అలా రమణుల చెంత చేరాక చాలా సంవత్సరాలు చూత గుహలో భగవాను సన్నిధిలో గడుపుతాడు నాయన. రమణులను చూడ వచ్చిన వారు నాయనను కూడా చూసి దర్శించి వెడుతూ వుండేవారు.

నాయనకు తెల్లని దుస్తులతో పారిజాత మాల ధరించిన అమ్మవారి దర్శనము కలుగుతుంది. ఆ తల్లి కోసము ‘ఉమాసహ్రసం’ ఇరువది రోజులలో రాయ సంకల్పించుకుంటాడు నాయన. పది రోజుల తరువాత చేతి మీద వ్రణం లేస్తుంది. 20వ రోజు ఇంకా 300 శ్లోకాలు వుంటాయి. లేఖకులను రమ్మని సాయంత్రము మొదలు పెడతాడు నాయన. రమణులు వచ్చి కూర్చుంటారు. భగవాను పాదాల వద్ద కూర్చొని ఏకధాటిగా 300 శ్లోకాలు నాలుగు గంటల పాటు చెబుతాడు. అన్నీ చెప్పిన తరువాత మౌనం ఏర్పడుతుంది. ఐదు నిముషముల తరువాత రమణులు కళ్ళు తెరచి ‘చెప్పినదంతా రాసుకున్నారా’ అని అడుగుతారు.

నాయన కళ్ళువిప్పి ‘ అంతా జాగ్రత్తగా రాసాము భగవాన్’ అంటారు.

అది రమణుల హృదయములో జనించి, నాయన నోటి వెంట వెలుబడిన మహత్యము. గురుశిష్యుల ఏకహృదికి గుర్తు.

చోత గుహలో నాయన వున్న రోజులలో ఒక నాడు ఆయనకు వెన్ను నొప్పి తల నొప్పి కలిగి కపాలము పగిలి శక్తి వెలుపలకు వస్తుంది. కపాలభేదం జరిగి అమృతప్రాప్తి కలుగుతుంది. రమణులు వచ్చి లోహము వాడవద్దని చెబుతారు. ఆనాటి నుంచి నాయన కు అపూర్వ సిద్ధులెన్నో కలుగుతాయి. అవి చెప్పటానికి కూడా నాయన వప్పుకునే వారు కారు.

నాయనకు రేణుకా దేవి అనుగ్రహము కలుగుతుంది. ఆయన ఇంద్రాణి సప్తశతీ రాస్తారు. రమణగీత కూడా నాయన రాసినదే.నిర్వాణ షట్కం, ప్రచండ చెండీ, ఇంద్ర వింశతి, నరసింహ పంచరత్నం, రామ సృత్తి, రామగీత, శ్రీకృష్ణ అక్షరమాల, శివగీతం ఎన్నో తత్త్వ గ్రంథాలు రాశారు. సద్దర్శనం భగవాను రాసిన తమిళ తత్త్వానికి సంస్కృత తర్జుమా రాశారు. సూత్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు ఎన్నో రాశారు. అవన్నీ సంస్కృతమున వుండటము వలన తెలుగువారికి తెలియలేదు.

నాయన కంచి పెరియవా శ్రీ చంద్రశేఖర యతివరేణ్యులను దర్శించటానికి వెడితే, పైన చోక్కా వున్నందున రానియ్యరు అనుయాయులు. నాయన కపాలభేదనము తరువాత అవ్వన్నీ పట్టించుకోవటము మానివేసి వుంటారు. కాని పెరియవా నాయన రాక గమనించి బయటకు వచ్చి తన శాలువా కప్పి కూడా వుండి

తీసుకుపోయి సన్మానిస్తారు.

నాయన ఎటు వెడితే అక్కడ ఆ క్షేత్ర దేవతల దర్శనము జరిగేది. ఆయన బయటకు రాగానే పూలవాన కురిసేది. ప్రమాదవశాతూ లోహం తగిలితే అది బంగారముగా మారేది.

ఆయన శిష్యులు ఎందరో ప్రముఖులున్నారు. నాయన శిష్యులలో లక్ష్మీ కాంతం నాయన చరిత్రను రాశారు. ఎందరికో మంత్రోపదేశము చేసి, ఎందరికో రమణుల గురించి పరిచయము చేసిన ఘనత నాయనదే. భారత దేశ స్వాతంత్ర్యం కోసము చేసిన తపస్సు ధార పోశారు.

కాంగ్రెసు లో రాజకీయాలు పడక దూరంగా వచ్చిన దేశభక్తులు నాయన.

వేద సంస్కృతికి మరల ఉత్తేజం కలిగించిన ఋషి నాయన. 1936 న శిష్యలతో హోమము చేయించి

అనాయాసంగా శరీరమును వదిలేశారు నాయన. కుమారునికి తుది సందేశముగా ‘జపధ్యనాధికం దైవతారాధనం మహా మనీః”(జపధ్యానాదులు దేవతా రాధనము బహుదొడ్డవి నిత్యం చెయ్యదగినవి) అని చెబుతారు.

అరుణాచలనాకి తంతి పంపితే రమణులు ‘నాయన పోయారా’ అని అటు తిరిగి కన్నీరు తుడుచు కుంటారు.

‘అతను నడుస్తూ వుంటే దేవతలు బారులు తీరి కవిత్వగానం విని ఆనందిస్తూ వుంటారు’ అని అనే వారు భగవాన్. అంతటి వాచస్పతి నాయన. ఆది శంకరులు తరువాత అంతటి కళా చాతుర్యాన్నీ మనము కేవలము నాయన లోనే చూడగలము. కపాలభేదము తరువాత కూడా 13 సంవత్సరములు జీవించిసాధకులకు ఆదర్శప్రాయుడు అయినారు నాయన. ఆయన రాసిన గంధ్రాలు జ్ఞాన దీపికలు. ఉపాసనా సంహితలు.

“శ్రీమత్‌ సర్వజ్ఞ కల్పః సకల గుణ నిధిః పూజనీయః పరమాత్మా।

సాక్షాత్ విద్యేశ వాచస్పతిరివ సకల శ్రౌత తత్వార్థ వేత్తా।

అంతేవాసీ మహర్షేః రమణ భగవతో రాజయోగీ తపస్వీ ।

వాసిష్ఠః శ్రీ మునీంద్రః జయతి గణపతి కావ్యకంఠః కవీంద్రః।।”

తా।। సర్వజ్ఞ కల్పుడు అన్ని గుణములకు నిధి, పూజనీయుడైన పరమాత్మ, సాక్షాత్తు వాచస్పతి, అన్ని శృతుల తత్వార్థమును తెలిసినవాడు, భగవాన్‌ శ్రీ రమణ మహర్షి అంతేవాసి, రాజయోగి, తపస్వీ, కవీంద్రుడు అయిన కావ్యకంఠ గణపతి మునీంద్రులకు జయమగు గాక।।

Ref: మహ తపస్వి ( మైత్రావరుణ)

నాయన (గుంటూరులక్ష్మీకాంతం)

ప్రణాములతో

సంధ్యాయల్లాప్రగడ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s