భూమి గుండ్రముగా వుంటుంది అంటారు కదా. మనము చిన్నప్పుడు సైన్సు లో చదువుకున్నాముగా ఆ విషయము. అప్పుడంటే
ఏమో ప్రయోగాలు చేయ్యించేవారు కూడానూ తరగతి గదిలో.
నేడు అలా కాకుండా ప్రతి పది సంవత్సరాలకూ మారుతున్న జాకెట్ల చేతుల కొలత, మెడ వంపులతో కూడా మనకు గుండ్రముగా వుంటుదని, మొదలయ్యిన చోటే చేరుతుందని తెలుస్తుంది. నిర్ధారణకు మనకు బోలెడు ఉదాహరణలు వున్నాయి మన చుట్టూ కూడా.
అయితే ఈ మధ్య ఆ విషయము మరల మరల నా చిన్న మెదడులోకి ఎక్కిన సంఘటనలు చెప్పాలి.
దానికి కారణము రోలు.
అవును.
అచ్చంగా రుబ్బు రోలే.
ఫ్టాష్‌బ్లాకులోకి వెడితే…….
మేము నాలుగవ చరగతిలో వుండగా మా వంట గది గృహప్రవేశము చేసింది తెలుపు ఎరుపు రంగులతో వుండే సుమిత్ మిక్సీ.
మా వూరు మొత్తములో మిక్సీ వున్న నాలుగు కుంటుబాలలో మేము కూడా వున్నందుకు కదూ మరీ అంత అతిశయము మాకు.
అమ్మ పప్పు రుబ్బుకొని:
‘ప్రాణాలకు హాయిగా వుందే బాబు ఇప్పుడు’అని మురిసినన్ని దినాలలోనే దాని రబ్బరు గాయబ్.
అందులో నూరే పచ్చళ్ళూ పప్పు ఆగిపోతే నాన్న హైద్రాబాదు పరుగున వెళ్ళి బాగుచెయ్యించారు కదూ.
మళ్ళీ పోగానే ఇలా కాదని దాని స్పేరు పార్టులు తెచ్చుకొని ఇంట్లో వుంచు
కున్నారు. అమ్మో నాన్నా అది ఆగిపోతే స్కూడ్రైవరుతో తిప్పి ఆడించేవారు. తెల్లటి మల్లెపువ్వు లాంటిది వాడుకలో పచ్చబడింది. కొద్దిగా పాతబడింది. దానితో అమ్మకు చనువు పెరిగి మూత పెట్టడం మానేసి ఎదో ఒక స్టీలు మూత పడేసి పచ్చడి కొట్టేసేది.
ఆ మిక్సీ అన్నది తరువాత ఎంత మాములు విషయమయ్యిందంటే, పూర్వము అన్నీ రోట్లోనే దంచుకునే వారమన్న విషయము మరిచిపోయారు కదా!
తరాలు మారాయి.
ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా రోలు గారు మళ్ళీ వంటగదిలోకి వచ్చారు.
ఇక్కడ మెక్సికన్లు ఆవకాడో వేసి నూరుతునే డిప్ కోసము వాడే రోలును ‘కాస్టోకో’ లో 15 డాలర్లకే అమ్మతున్నా రంటే మేమంతా ఎగబడి కొని, ఒక్కరోజులో షాపులో వున్న స్టాకును కాళీ చేసేషాము కదటండీ.
మరి అలా అలంకార ప్రాయంగా వుంటే బావోలేదని నేను మాత్రం అందులో అల్లం ఇలాచి కలిపి కొట్టి టీ లో వేసుకునే దాని.
కానీ మా మిత్రబృంధం ఆవేశంగా దాంట్లో పచ్చడి గట్రా నూరేసారు. అంతటితో ఆగారా?..
ఊహూ….
“మా వారు లోట్టలు, మా నెత్తిన పూల తట్టలు.. సంతోషము బుట్టలు”అంటూ పాడుకుంటున్నారు.
‘మెత్తగా నూరావా? ఇంత చిన్న రాయి పొత్రంతో’ అని నే నడిగితే,
‘కచ్చా పచ్చా గా వుండాలే రోటి పచ్చడంటే. మరీ కాటుకలా నూరితే రుచీ పచ్చీ వుండదు’ అంటుంది నాగేశ్వరీ.
బావుంది వరస
‘మొగుడుగారు తింటారా ఇలా వుంటే‘ అని సందేహాప్రాణిని కదూ అడిగాను. ‘ఎందుకు తినరు? రేపు చేసి చూడు. మిగలకుండా నాకకపోతే నన్ను అడుగు ‘ అంటూ
బస్తీ మే సవాల్ అంది నేస్తం!
‘సరే కానీయి. విధి బలీయము.’ అని మొన్న కొబ్బకి కోరి (కోరేది ఇండియా నుంచి దిగుమతి చెయ్యబడింది ఈ మధ్యే) పచ్చడి కొద్దిగా కచ్చా పచ్చాగా నూరి మొగుడుగారికి నివేదించాను.
ఓరి ఈయన అసాధ్యము.
మా ప్రెండు చెప్పినట్లే మొత్తం వూడ్చేశాడు.
మళ్ళీ దానిపై కామెంటోకటీ
“రోట్లో కాకుండా మిక్సీలో నూరితో అందులో పోషకవిలునలు చస్తాయి. అందుకే రోలు వాడు ఇక ముందు “ అని ముక్తాయింపు.
అదే మరి. భూమి గుండ్రముగా వుండదూ……