అవధూతలు ఈ ప్రపంచము నిర్ణయించిన పరిధిలో ఇమడరు. అందువల్ల, చాలా సార్లు ప్రజలు వారిని గుర్తించక పిచ్చివారని లెక్క కట్టుకుంటారు. మన స్వామి విషయములో అంతే జరిగింది. ఎప్పుడూ ఎవరినీ పట్టించుకొనక ‘చాకలి యోగం, మంగలి యోగం, డుబుడుక్.. డుబుడుక్..‘అంటూ తిరుగుతూ వుండే యువకుని ప్రజలు పిచ్చివారనుకున్నారు. అతని పిచ్చివాడు కాదని ‘మనస్సులోని కోరికలను శుభ్రం చేసుకోమని, చెడు తలపులను శుభ్రం చేసుకోమని’ చెప్పే భవరోగ వైద్యుడైన భగవంతుడు ఆ రూపములో వచ్చాడని తెలియటానికి కొంత సమయము పట్టింది. ఆయనే అవధూత శ్రీ వెంకయ్యస్వామి.
నెల్లూరులోని వెల్లటూరు గ్రామములో పెంచలయ్యనాయుడు, పిచ్చమ్మలకు 1887 లో వెంకయ్య స్వామి జన్మించారు. ఆయనకు ఒక సోదరుడు ఒక సోదరి వున్నారు. సోదరి మంగమ్మ అంటే ఆయనకు అభిమానము. ఆ ప్రేమతో తన వాటాగా వచ్చిన ఆస్తి చెల్లెలికి ఇచ్చేశారు.
వారిది సేద్యము చేసే కుటుంబము . ఆయన ఎక్కవగా చదువలేదు. కానీ జీవితానికి కావలసిన మర్మములు తెలుసు. తన 12 వ ఏట వ్యవసాయపు పనులన్నీ చేసేవారు. 16 నుంచి కుటుంబానికి కావలసినవి చూసేవారు. ఆయన 20 వ ఏట ఆయనకు పాము కరుస్తుంది. పామును కొట్టి చంపాలనుకొని, అనవసరమని ఇంటికి వచ్చేస్తారు. జర్వము వచ్చి మూడురోజులకు తగ్గుతుంది. ఆనాటి నుంచి మౌనముగా వుంటారు. ఏ పని పట్టించుకోరు. ఎవ్వరితో మాట్లాడక మూలన కూర్చొని మౌనముగా వుంటే
తల్లితండ్రలకు ఆందోళన కలిగించినది. పిచ్చివాడని ఆయనకు మందులు ఇప్పించటములాంటివి చేసినా ఫలితము లేదు. ఎంత ప్రయత్నించినా తగ్గని పిచ్చి అది, కారణం అది పిచ్చి కాదు కాబట్టి. ఆయన ఆ తరువాత ఇంట్లో వుండక ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇల్లు పట్టించుకొనక అడువుల వెంట తిరిగి, ఎవరు బువ్వ పెడితే అది తింటూ వుండేవారు. చిన్ననాట ఎవరో సాధువు వచ్చి నాలుక మీద బీజాక్షరాలు రాసారని అంటారు. ఆయన శ్రీ షిర్డి సాయి అని కూడా చెబుతారు.
పెంచలకోన అడవులలో తిరుగుతూ, యోగులను సేవిస్తూ వుండేవారు. అలా ఒక యోగి ఆయనను తీసుకు ఒక గుహకు వెడితే అక్కడ వున్న ఎందరో మహత్ములకు మూడు దినములు సేవలు చేశారని, తరువాత స్పృహ కలిగి చూస్తే మద్రాసు హైకోర్టు మెట్ల మీద వున్నామని ఆయన తన శిష్యునితో చెప్పారు.
ఏది ఏమైనా శ్రీ స్వామి మాత్రం ప్రజల భవరోగాలు కుదర్చటానికి వచ్చారన్నది నిజం. ఆయనలో పిచ్చి వాడి నుంచి మహాత్నుని లక్షణాలు కనబడటము చూశారు ప్రజలు. పిచ్చి వెంకయ్య వెంకయ్యస్వామిగా మారారు. ఆయన సోదరి కొడుకు జర్వంతో వుంటే సోదరి దుఖఃం చూచి స్వామి’బాధ పడకమ్మా, నాలుగు రోజులలో తగ్గుతుంది’ అని పిల్లవాడిని తాకుతారు. జ్వరం తగ్గుతుంది. అలా నెమ్మదిగా జబ్బులు వున్నవారు ఆయన వద్దకు వచ్చి జబ్బు తగ్గించుకున్న సంఘటనలు కోకొల్లలు.
అన్ని జీవులనూ సమానముగా చూచేవారు స్వామి. పశువులకు కలిగే బాధలు కూడా నివారించేవారు. సత్యవ్రతమును చిన్ననాటి నుంచే ఆచరించారు స్వామి. పరమ నిరాడంబరులు. కేవలము కౌపీనము, ఒక టవలుతో నాలుగు అల్యూమినియము గిన్నెలతో వుండేవారు.
కాళ్ళకు జోళ్ళు వేసుకునేవారు కారు. ఆయన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నా పట్టించుకునేవారు కారు. శిష్యులు ముళ్ళు తియ్యబోయి మరింతగా గాయం చేసేవారు. వారు రక్తం కారినా తుడుచుకునే వారు కారు. చేతులకు కాళ్ళకూ గాయాలయ్యేవి. ఎక్కడో భక్తులను రక్షించి వారి గాయాలు ఆయన తీసుకునేవారు. వాటికి కట్టుకట్టనిచ్చేవారు కారు.
బిక్షవుగా జీవించారు. అందరిని బిక్ష అడిగేవారు కారు. కొందరినే అడిగే వారు. ఒక ఇల్లాలు తినడానికేమి లేక పెట్టలేకపోతున్నానంటే కారంపోడి అడిగి అది తినేశారు. ఆయన ఆహారవిహారాదులలో నియముము లేదు. అలా కారం వుత్తి అన్నం తిన్నేవారు. లేదా వుత్తి వుల్లి, వుత్తి కారం తినేవారు.
సదా ధుని వెలిగించేవారు. ఎక్కడకి వెళ్ళినా అక్కడ ధుని వుండవలసినదే. ఆయన అలా చాలా మంది గుృహలలో కూడా ధుని వెలిగించారు. ధుని వెలిగించటము నాథ సాంప్రదాయము. ఇలా వారు సాయినాథుని శిష్యులని చెబుతున్నారని అనుకోవచ్చు. సాయినాథుని తమ అన్నగారుగా చెప్పేవారు. సాయినాథుడు కూడా వారి గురించి చెప్పేటప్పుడు తమ్ముడని చెప్పేవారు.
తరువాత ఆయన నడవటము మానివేశారు. ఆయనను చక్రాలతో వున్న చెక్క బండిలో తీసుకుపోయేవారు. ఒకసారి బండి చక్రం వరుసుకుపోయి దెబ్బ తగిలి రక్తం వచ్చినా స్వామి పట్టించుకోలేదు. భక్తులు చూసి భాదపడితే దేహ చింతన వలదనేవారు.
రామకృష్ణలకు ఒకసారి ధ్యానములో వుంటే వివేకానందుడు ఆయన తొడ మీద నిప్పు కణిక పెట్టారుట. రామకృష్ణులు ధ్యానము లోంచి కదలలేదు, నిప్పు కణిక కాలి గాయమైనా. దేహసృహ వుండదు యోగులకు.
ఆయన భక్తులకు ఆస్సీసులు చీటి మీద రాయించి ఇచ్చేవారు. బొటనవేలు ముద్ర వేసిన కాగితం ఇచ్చేవారు. ఒక తెల్ల దారం కట్టుకోమని ఇచ్చేవారు. అలా చేస్తే భక్తుల ఇబ్బందులు తొలిగిపోయేవి. ఆయన సమాధికి ముందు ‘సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురుసేవ’ అని కేకలు వేశారుట.
మానవాళికి ఆయన ఇచ్చిన చివరి సందేశం.
మానవులు మొదట దైవీసంపద సాధించాలి. అదే ’సంపన్నత్వం’. దైవీసంపదలంటే గీత ప్రకారము ‘నిర్భయము, సాత్విక చిత్తశుద్ధి, జ్ఞానయోగములో స్థిరత, దానము, ఇంద్రియ నిగ్రహము, ఆత్మవిచారము, తపస్సు, అహింస, క్రోధము లేకపోవటము, ఇంద్రియ విషయములపై వ్యామోహము లేకపోవటము, ‘మొదలైనవి.
ఇవి సాధించటము సాధకుల లక్ష్యం. లేకపోతే విఫలమొందుతారని భగవద్గీత హెచ్చరిస్తుంది.
‘సాధారణత్వం’ అంటే దేవీ సంపద సాధించిన తరువాత సాధకులకు గర్వం వుండకూడదు. సాధించినవి అతనికి సాధారణమవ్వాలి. నేర్చినది హృదయములో ధారణ చేస్తూ వుండాలి. ఇవి ‘సద్గురు సేవ’ వల్ల మాత్రమే సాధ్యమవుతాయి.
అందుకే సాయిబాబా ‘మహారాజైనా పేదవానిలా జీవించాలి’ అని చెప్పేవారు.
ఆయన శిష్యులు ఏమైనా బోధించమని అడిగితే ‘బోధించేదేముందయ్యా? నన్ను చూసి నేర్చుకోవటమే’ అన్నారు.
శ్రీ వెంకయ్యస్వామి ఉన్మత్తావస్థలో బావి మీద చెట్ల కొమ్మకు తలక్రిందులుగా వేలాడేవారు. పట్టు తప్పి పడితే లేచి మళ్ళీ అలానే చేసేవారు. రెండెడ్ల బండి వెనుక అలానే చెసేవారుట. ఎవరన్నా చూస్తే వెంటనే లేచి కూర్చునేవారట.
స్వామి ఎన్నో చోట్ల తిరిగి నెల్లూరు వద్ద గొలగమూడిలో స్థిరపడ్డారు. ఆయనను ప్రశ్నలు అడగటానికి ఎందరో వచ్చేవారు. ఆయన శిష్యులగా కొందరు కూడా వుండి సేవించారు. వారిలో తులసవ్వ ముఖ్యమైనవారు. ఆమెకు మరు జన్మలేదని స్వామి చెప్పారు.
సాయి భక్తులను వెంకయ్యస్వామి ఎన్నో సార్లు తమకు సాయికి భేదం లేదని చూపారు. అటువంటి అనుభవాలు ఎన్నో వున్నాయి. ఒక భక్తుడు వెంకయ్యస్వామి తమ ఇంటికి వచ్చి తమను ఆశీర్వదించాలని కోరి సాయి సచ్ఛరిత 13 సార్లు పారాయణ చేస్తే, ఒక గురు పూర్ణిమ రోజున స్వామి వారింటికి వెళ్ళి ఆశీర్వదించి ధుని కూడా వెలిగించి వచ్చారు. సాయిని ప్రార్థించి వెంకయ్య స్వామిని దర్శనంకోరిన భక్తులకు ఎందరికో ఆయన దర్శనం లభించేది.
ఆయన సమాధికి ఒక సంవత్సరము ముందు ‘చెప్పులయ్యా చెప్పులు’ అని కేకలు పెట్టారు. భక్తులు ఎన్ని చెప్పులు తెచ్చినా తీసుకోలేదు. ఒక భక్తుడు పావుకోళ్ళు చేయ్యించి తెచ్చి ఇస్తే వాటిని పట్టుకు చాలాసేపు తిరిగి ఇవ్వలేదు. పావుకోళ్ళు పాదుకలు దత్త సాంప్రదాయంలో ఎంతో ప్రముఖమైనవి. అవే ఆయన సమాధి మందిరములో వుంచబడ్డాయి. ఆయన 1982 న సమాధి చెందారు.
ఎల్లప్పుడూ తంబూరా మీటుతూ ‘ఓం నారాయణా, ఆది నారాయణ’ అంటూ మధురముగా పాడుతుండేవారు.
భక్తులు తమ సమస్యలను తీర్చుకోవటానికి, ఆరోగ్యానికి గొలనమూడి వెళ్ళి ఒక రాత్రి నిద్రచేసి కోరిన కోరికలు తీర్చుకొని వస్తారు, నేటికి. ఆయన సమాధి మందిరము నేడు శక్తి కేంద్రముగా విరసిల్లుతోంది. నెల్లూరు నుంచి ఆటోలో అక్కడికి చేరవచ్చు. ఆయన బోధలు చాలా సులువైన భాషలో వున్నా లోతైన తత్త్వాన్ని వివరిస్తాయి.
ప్రచారములో వున్న బోధలు కొన్ని:
1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.
2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.
3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.
4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.
5) ఒకరిని పొమ్మనేదాని కంటే మనమే పోవటం మంచిదయ్యా.
6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.
7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.
8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేదే గదయ్యా.
9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.
10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.
11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీకేముందో అదే నీకు మిగులు కదయ్యా.
12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.
13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.
15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.
16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.
17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.
18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.
19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.
20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.
ప్రణాములతో
సంధ్యాయల్లాప్రగడ