శ్రీ పాకలపాటి గురువుగారు

యోగులు–  భూమిపై పరమాత్మ స్వరూపములు:  శ్రీ పాకలపాటి గురువుగారు

తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు. 
భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికీ ఇస్తున్నారు. 
కొందరు సిద్ధపురుషుల వివరాలు తెలుసుకునే కొద్ది విచిత్రంగా వుంటాయి. వారు మహిమలు చెయ్యరు. కాని వారిలోని గురుత్వమువస్త్రము వెనక నెగడు వలె ప్రకాశిస్తూ వుంటుంది. వారు మూర్తీభవించిన ప్రేమతో సర్వులనూ సమానముగా చూస్తారు. వారు ఆత్మదర్శులనటానికి అదే మనకు నిదర్శనము,వారికి అన్యమన్నది లేకపోవటము. 
శ్రీ పాకలపాటి గురువుగారిని గురించి మనకు తెలిసినప్పుడు విషయము పూర్తిగా అర్థమవుతుంది. 

శ్రీపాకలపాటి వారి గురించి శ్రీ భరద్వాజ మాష్టారు రచియించి ప్రపంచానికి పరిచయము చెయ్యకపోతే మనకు పరమేశ్వర స్వరూపమైన శ్రీ పాకలపాటి గురువుగారిని గురించి తెలిసేది కాదు.
వీరిని గురువుగారని, బాబుగారని పిలుస్తారు భక్తులు.  శ్రీ ఎక్కిరాల కృష్ణామాచార్యుల వద్దకు వైద్యం కోసము వస్తారు బాబుగారు. EK గారని భక్తులు పిలుచుకునే శ్రీ ఎక్కిరాల కృష్ణామాచార్యులు గారు cvv శిష్యులు. హోమియో వైద్యులు. వారు తన సోదరులైన భరద్వాజ మాష్టారికి బాబుగారి గురించి చెప్పి వారిని దర్శించమని తమ్ముని ప్రోత్సహిస్తారు. 
భరద్వాజ మష్టారు శిరిడి సాయి భక్తులకు కడు పరిచయము. వారుగురుచరిత్ర, సాయి నిత్యపారాయణ గ్రంధంతెలుగులో రచించారు. ఎందరికో సాయి తత్త్వం వివరించి భక్తులుగా మార్చారు. వివాహము వద్దనుకున్న భరద్వాజ మష్టారు గారిని వివాహానికి వప్పించినది శ్రీ బాబుగారే.
భరద్వాజ మష్టారు గురువుగారి వద్ద నాలుగు రోజులుండి తను చూచినది విన్నది కలపి మనకోసం రచించారు. 
శ్రీ బాబుగారు కోయలు, గిరిజనుల కోసం ఎంతో కృషిచేశారు. వైజాగు నుంచి విజయనగరము వైపుగా వున్న నర్సీపట్ట్న ప్రాంతములో అరణ్యాలలో వున్న పాకలపాటిలో వారు నివసించారు. కోయవారికి ఆయన ఆరాధ్యదైవము. వానరులకు శ్రీరామునిపై గల భక్తి ఎలాంటిదో కోయవారికి గురువుగారిపై అంతటి భక్తి.

శ్రీ పాకలపాటి గురువుగారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి దగ్గరలో ముండూరు అగ్రహారములో జన్మించారు. దామరాజు గంగరాజు, వెంకమ్మ గార్ల ముగ్గురు కొడుకులలో మూడవ వారు. తల్లి బాబుగారు ఆరవ నెలలో వుండగా మరణించారు. తండ్రి బాబుగారి 9 ఏట మరణించారు. మేనత్త వారిని బడికి పంపి చదివించి పెంచి పెద్ద చేసింది. చిన్నతనము నుంచి ఆయన ముఖము బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ వుండేదిట. ఆయన అఖండ ప్రజ్ఞాశాలి. ఏకసంధాగ్రాహి. ఒకసారి చదివితే అంతా అప్ప చెప్పేవారట. తన 5 ఏటనే భాగవత, భారత , రామయణ గంథాలను వప్పచెప్పేవారట. ఆయనను పర్వతాలు, అరణ్యాలు చిన్నతనము నుంచే ఆకర్షించేవి. అన్నల చిన్నతనమునే  మరణిస్తారు. 
తనకు వచ్చిన రెండెకరాల భూమి అమ్మితే వచ్చిన డబ్బును మోసంతో దొంగలు తస్కరిస్తారు. బాబుగారి మిత్రులలో ఒకరైన కాపు పుల్లయ్య బాబుగారిని చేరదీస్తారు. కొద్దికాలము పుల్లయ్యవద్ద వుంటారు బాబుగారు. 
ఒక రాత్రి విలపిస్తూ కనపడుతారు. ఎందుకని ప్రశ్నించిన పుల్లయ్యకుతనకు ఎవ్వరూ లేరనిదుఖిస్తారు బాబుగారు. పుల్లయ్య ఆయనను చూసుకుంటానన్న మాట ఇస్తారు. ఉదయం లేచే సరికే బాబుగారు వుండరు. ఆయన రైలు స్టేషనుకొచ్చి తనకు దొరికిన రైలు ఎక్కి వెళ్ళిపోతారు. టీసి రైలు దింపేస్తాడు డబ్బులేదని. కాలి నడకను తిరుగుతూ కలువరాయి అన్న పల్లెలో మహాపండితుడూ, మంత్రవేత్త, తపస్వీ శ్రీ కావ్యకంఠ గణపతి మునిని కలుసుకుంటారు. గణపతిముని వద్ద మంత్రదీక్ష పొందుతారు బాబుగారు. ఆయన కలువరాయిలో వున్నప్పుడే ఆయన ప్రతిభ కనపడుతూ వుండేదిట. గణపతి ముని బాబుగారిని ఏమీ అననిచ్చేవారు కారట. అలా తిరుగుతూ బాబుగారు శ్రీ రమణ మహర్షిని కూడా సందర్శిస్తారు. ఆయన ప్రయాణము ఎక్కడెక్కడ సాగిందో, ఎక్కడ తిరిగారో పూర్తిగా తెలియదు. 
సాధకునిగా తాను తిరగని చోటు లేదని వారు తరచూ చెబుతూ వుండేవారు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు టిబెట్‌, శ్రీలంక, బర్మా వరకూ తిరగానని స్వయంగా భరద్వాజ మాష్టారుకు చెప్పారు. ఆయన బొబ్బిలి సమీపములో పిరిడి అన్న గ్రామములో కొంతకాలము న్నారు. అక్కడ యువకులను చేరదీసి రామ భజనలు నేర్పించారు. తరువాత ఆయన విశాఖపట్నంలో వున్నారు. పాలకుర్తి కృష్ణమూర్తి అన్న శ్రీమంతుని భవనానికి శంకుస్థాపన చేశారు. శ్రీమంతుడు బాబుగారి కోసము భవనము కట్టి అందు పదివేలు పుస్తకాలు అమర్చారు. అయినా బాబుగారు అక్కడా వుండలేదు. మాడుగుల సంస్థానము అడవులలో తిరుగుతూ వుండేవారు. ఏజన్సీ అడవులలో ఆటవికులకు పారమార్థిక జ్ఞానము ప్రబోధిస్తూ పెక్కు ఆశ్రమాలు స్థాపించారు. ఆయన అడవులలో తిరిగే సమాయానికి పాకలపాడులో భాగవత ప్రవచనము సాగుతున్నది. చింకిగుడ్డలతో వున్న బాబుగారు అక్కడచేరి ఒక శ్లోకానికి తాత్పర్యం అనర్గళంగా మనోహరంగా వ్యాఖ్యానించారు. ప్రవచనము చెబుతున్నవారు బాబుగారు తపఃసంపన్నులని గుర్తించి గౌరవించారు. అలా పాకలపాటి ఆశ్రమములో స్థిరపడినారు. 
ఆయన అక్కడే నిరాహారిగా గాయత్రి మంత్రజపము ముద్రలతో యదావిధిగా చేసేవారు. అటవికులకు రామభజనలు నేర్పేవారు. ఆయన అడవిలో తపస్సు చేసుకుంటూ వుంటే రెండు పులులు ఆయన ప్రక్కన కూర్చొని ఆయన మీద ఎండ పడకుండా తమ తలను నీడగా పెట్టెవట. విషయము విజయవాడ భక్తుడొకడు చూసి గ్రంధస్తము చేశాడుట. ఆయన అడవిలో కొండలలో ఎక్కుతూ తిరుగుతూ తపస్సులో వుంటే
దూరం నుంచి చీకట్లో సైతం ఆయన దేహం మెరుస్తూ కనపడేదని అటవికులు అనకునేవారు. 
బాబుగారు జైపూరు మహారాజు ఆహ్వానము పై కొప్పరపు కవులతో వెళ్ళి అవధానము చేస్తారు. అదే సమయములో విశాఖలో సముద్ర స్నానానికి వస్తారు. ఒకే చోట వివిధ ప్రదేశాలలో వుండగలరు బాబుగారు అని ఆనాడు జైపూరు రాజావారు పేర్కోన్నారు. 
అటవికులు పులి పశువులను చంపుతున్నదని వస్తే అటుగా చూచి గాలిలో ఎదో విసిరేవారు. అటవికులతోఇక రాదు పొండిఅని దీవించేవారు.
బాబుగారు మంత్రసిద్దులు యోగసిద్దులు. మూగ పిల్లవానికి తేనెతో నాలుక మీద గాయత్రి రాయగా వానికి మాట్లాడుట వచ్చేసింది. వారి ఆశ్రమానికి వచ్చేవారికి భోజనము పెట్టి పంపేవారు. ఒకసారి కరువులో ఆయన హోమము తలపెట్టారు. అన్న ధాన్యాలు వారి ఆశ్రమానికి రాకుండా ఆపివేశారు బ్రిటీష్ వారు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆఫీసరు వచ్చి చూస్తే చాలా తక్కువ బియ్యం వుంటాయి. అందరికీ అదే సరిపొతుంది. విచిత్రం అర్థం కాదు. 
ఆఫీసరు బాబుగారి మహిమ చూసి ఆయన భక్తుడవుతాడు. భక్తులకు ఆపద సమయములో ఆయన కనపడి ఆదుకునేవారు. బాబుగారు అటవికులను ఋషి వారసులనేవారు. వారి కోసము దాదాపు 900 పల్లెలు నిర్మించారు ఆయన. వారికి వ్యవసాయ వంతమైన భూమి చూపి పండించుకో మన్నారు. 
ప్రతి వూరులో ఒక మేకు నాటి అక్కడ ఒక దీపం వెలిగించేవారు. వారి కష్టాలను దీపానికి చెప్పమనేవారు. వారు చెప్పుకుంటే కష్టాలు తీరిపోయేవి. ఆయన అడవులలో తాంత్రికము మాన్పించారు. నర మాంసభక్ష చేసే కొంత మంది ఆటవికులను అలవాటు నుంచి మార్చారు. ఆయన మీద ఎలాంటి తాంత్రికము పని చేసేదికాదు. 

ఎప్పుడూ నలగని తెల్లని బట్టలలో వుండేవారు. చేతికి వాచి, కాళ్ళకు జోడుతో చూడటానికి చక్కగా వుండేవారు. నిద్రపోయేవారు కారు. 
ఆటవికులు, అడవులలో వున్న గిరిజనులు అను నిత్యము బాబుగారిని పూలతో నమస్కరించుకునేందుకు పోటి పడేవారు. ఆయన కొందరిని కోప్పడి, కొందరిచే పని చేయించి వారి పూర్వ కర్మలను కాల్చేవారు. గిరిజనులు భక్తితో రామభజనలు పాడుతూ బాబుగారి ముందు నృత్యం చేసేవారు. 
బాబుగారు పెట్టిన భోజనము తింటే తీరని రోగాలు తగ్గిపోయేవి. 
ఆయన ఇచ్చిన విభూది వంటికి రాసుకొని, బొట్టుపెట్టుకొని,మంచినీటితో త్రాగితే గ్రహపీడలూ రోగాలు పోయేవి.
వారు డైరి రాసేవారు. ఏరోజు ఎక్కడ వున్నమో ఎవరిని కలిశామో రాసేవారు. వారికి రామాయణము అభిమాన గ్రంధం. తాము చెప్పిన దాని తాము
ఆచరించటము ఆయన ఉపదేశము.
మనకు చేతనైనంత గా ఎలాంటి ఆర్బాటము లేకుండా చెయ్యాలని వారి భోద. అడిగినవారికి లేదన వద్దని చెప్పేవారు. అది సామాన్యముగా చెయ్యాలని ఆర్భాటాలు వద్దని చెప్పేవారు. ప్రకృతి, వృక్షాలు, పైర్లు, పశువుల అలాగే  సేవ చేస్తున్నాయని
బాబుగారు చెప్పేవారు. 
శ్రీపాకలపాటి గురువుగారు 1970 శివరాత్రినాడు శివైక్యం చెందినా, తరువాత కూడా భక్తులకు గిరిజనులకు కనపడి రక్షిస్తూవున్నారు. వారి ఆశ్రమము నేటికి విశాఖ దగ్గర లంబసింగిలో వున్నది. అక్కడ శివరాత్రి నాడు మహా ఉత్సవము జరుగుతుంది. 

ప్రణాములతో
సంధ్యాయల్లాప్రగడ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s