టికెట్లు ఇక్కట్లు

టిక్కెట్లు – ఇక్కట్లు -2

రోడ్డు మీద టికెట్లు రావటానికి ‘స్టాప్ సైను’ కల్పతరువు కాపులకు(cops)కి, ఆ కౌంటికి. స్టాపు సైను వుంటే ఆగమని కదా. ఆగిన తరువాత మనము (తౌజెండు వన్, తౌజెండు టూ, తౌజెండు త్రీ) అంటూ మూడంకెలు లెక్కెట్టాలి. అంటే అంత సమయము ఆగాలన్నమాట. అందుకే కారు నేర్చుకునేటప్పుడు చెప్పారు మనసులో లెక్కెట్టుకోమని. కాబట్టి ప్రతి స్టాపు సైను వద్ద అలా అనుకోవటము అలవాటుగా మారింది నాకు.

మా ఇంటి వెనక వైపు రోడ్డులో వున్న ‘స్టాపు సైను’ ఆల్ స్టాపు. అంటే అన్ని వైపులా స్టాపు. ట్రాఫిక్ తక్కువ, అరగంటకొక కారు వస్తుంది. అందుకే అక్కడ స్టాపు సైన్ వద్ద దూకుడుగా వెళ్ళే కార్లకు కళ్ళెం వెయ్యటానికి, వారి కోశాగారం నింపటానికి కాపుండేవారు మా కౌంటి కాపులు ఎల్లవేళలా. అందునా నేను ఆ రోడ్డు ఎక్కువగా వాడతాను. నాకు తెలుసు వాళ్ళక్కడ వుంటారని.

ఈ సాఫ్టువేరులో ఉదయం స్టేటస్ కాలు వుంటుంది కదా ఒక గంట. ఆ గంట రోడ్డున పడి ట్రాఫిక్లో నెమ్మదిగా ఈదుతూ, కాల్‌ లో తేలుతూ వెడతాయి ఈ సాఫ్టువేరు పక్షులన్నీ. శ్రీవారు కాలో
జాయిన్ అయి, కారు కదిపి అలా అలా తేలుతూ వెడతాడు. కాని ఈయనో పెద్ద ఆబ్‌సెంటుమైండు వారు కాబట్టి, కారు ఎక్కగానే కాల్ లో జాయిన్ అయి, గాల్లో తేలుతూ అట్టా పోతా వుంటారు కాబట్టీ, ఈయనకు ఆ స్టాప్ సైన్ల వద్ద ప్రేమపత్రాలు, అవే టికెట్లు అందుతూ వుంటాయి అడపాదడపా. నేను ఇదేంటి అంటే ‘పోనిలేవోయి. వారు బ్రతకాలిగా’ అంటారు. అదే నాకైతే ‘ఇస్యూరెన్సూ నా శార్థం’ అన్నీ కనపడతాయి. మాములేగా మొగుళ్ళకున్న .

నేను తామా అన్న స్థానిక సంస్థలో వాలంటీరుగా వున్నప్పుడు, అంటే నాలుగేళ్ళనాటి సంగతి, మాకు ఏవైనా కార్యక్రమాలుంటే అవి పూర్తి అవటానికి అర్థరాత్రి అయ్యేది. అప్పుడు ఈసురోమని కొంపకు చేరేదాన్ని. అందునా నేను ప్రెసిడెంటుగా వున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ అయితే, మొదటి దాన్ని, చివరగా బయటకు వచ్చేదాన్ని, నేనే అయ్యేదాన్ని. అలా ఒకనాటి కార్యక్రమం అయ్యాక వస్తున్నాను. అప్పుడు సమయము రాత్రి 12 దాటి దాదాపు ముప్పావు గంట అయ్యింది. చిమ్మచీకటి…రోడ్డు మీద పిట్ట పురుగూ కూడా లేవు. సన్నగా అష్టమి వెన్నెల పరుచుకొని వుంది. మాములుగానే ఖాళీ రోడ్లు అవి. మరింత ఖాళీగా వున్నాయి ఆ రాత్రి. నాకు మనస్సులో జంకుగా వుంది, చాలా లేట్ అయ్యింది అని. మా ఇంట్లో వాళ్ళు నా మీద కారాలు మిరియాలు నూరూతూ వుంటారని కొద్దిగా శంకగా వుంది. ప్రోగ్రాముకు తను వచ్చాడు కాని వెళ్ళిపోయాడు మధ్యలో, హనీ ఇంట్లో వుందని. ఆ సమయములో నేను స్పీడు లిమిట్ దాటే వెడుతున్నా. కాని నాకలవాటుగా ఎక్కడ చీకటి వీరులు(cops) వుండొచ్చో తెలుసు కాబ్బట్టి ఆ జ్ఞానముతోనే నడుపుతున్నా కారును.
ఈ స్టాపుసైను వచ్చింది. స్లో చేశాను. గబగబా దౌజెండు వన్‌, టూ అంటూ లెక్కెట్టి బరున్న తిప్పాను. వెంటనే నా వెనకే లైట్లు కనపడ్డాయి, కాప్‌వి. ముందుకు వెళ్ళి కాస్త విశాలమైన స్థలము చూసుకు రోడ్డు ప్రక్క కారును తీసి ఆపాను.
వచ్చాడు ఆ వీరుడు. అర్ధరాత్రి కూడా డ్యూటీలో తగ్గనన్న ఫోజుతో ఒక చెయ్యి గన్ పై వేసుకు మరో చెయ్యి బెల్టు మీద వేసుకు. లోపల వున్నదెవరో తెలియదుగా. వాళ్ళ జాగ్రత్త కోసము అలా వస్తారు మన వద్దకు.
నేను గ్లాసు దింపాను. దగ్గరగా వచ్చి నన్ను చూసి కొద్దిగా వింతగా ( నేను అర్థరాత్రి పట్టుచీర, నగలతో బంగారు గాజుల గలగలతో కారులో షికారు మరి) “ఎక్కడ్నుంచి వస్తున్నావ్ మెమ్” అన్నాడు
నేను మా తెలుగు అసోసియేషన్ గురించి ఆనాటి పోగ్రాము గురించి చెప్పాను.
‘మీరు స్టాపు సైను స్కిప్పు చేశారు’ అన్నాడు.
నేను ‘లేదే. ఆగి లెక్కెట్టుకున్నా కూడా’ అన్నా అమాయకంగా. వీడికెమ్మన్నా రేచీకటా అని కొద్దిగా డౌటు కుడాను కలిగింది. అయినా అంత రాత్రి ఈ పంచనామా అవసరమా వెధవ డ్యూటీ వీడునూ. నేనెమన్నా తాగి నడుపుతున్నానా లేక డాకూలా వున్నానా.
అతను ‘కాదు మీ కారు వెనక చక్రాలు తిరుగుతునే వున్నాయి. ముందువే ఆగాయి. రెండు వైపులా ఆగాలి’ అన్నాడు.
నేను అవాకైయి ’సిరియస్స్ లీ’ అన్నా.
వీడికి ఎదో పిచ్చి అని నమ్మకముగా అనిపిస్తుండగా.
అతను ‘అవును’ అన్నాడు.
నేను ఏద చెప్పబోతే ‘నాతో వాదనలు వద్దు’ అన్నాడు.
డ్యూటిలో వున్న ఆఫీసరు తో వాదిస్తే మనకే నష్టం.
నాకు మనసులో చివ్వున వాడి మీద చిరాకు వచ్చింది. ఎంత వితండవాదము. వొట్టి మూర్ఖుడు.

‘రిడిక్యులస్’ అన్నాను ఏమీ అనలేక.
వీడో మూర్కు డు. టికెట్టు ఇస్తాడు గాబోలు, ఏదో ఫ్రస్టేషన్లో వున్నాడు వెధవ., నా మీద చూపిస్తున్నాడు అనుకున్నా. అప్పటికే నగలు అవీ పెట్టుకు తిరగవద్దని, భారతీయులంటే చాలా అక్కస్సుతో వున్నారని పుకార్లు వస్చున్నాయి. నేను ఒక గొలుసు వేసుకున్నా మావారి చూపుకు మాడిపోవలసినదే. కొరకొర చుసి ‘ఆ ప్రదర్శన అవసరమా?’ అంటూ చిరాకుపడతాడు. వున్నది జన్మానికో శివరాత్రిలా ఎప్పుడో కాని పెట్టుకోవడం కుదరదు. అదీ నేను ఎక్కువగా ప్రదర్శించను కూడా. సగము నాకు నగలు ఇష్టం కాని ధరించటము కాదు. పైపెచ్చు ఈయన సుత్తి భరించలేమని.
కాని ఇప్పటి పరిస్థితి వేరే. నేను నిర్వహించే ఈవెంటూ. పైపెచ్చూ ఆ రోజు నా గాజులు పట్టుకొని ఇండియా నుంచి వచ్చిన సెలబ్రెటీ సింగరు పాటలు కూడా పాడాడు….
సరే ఈ టిక్కెటు విషయానికొస్తే, ఇప్పుడు కాప్ టికెటు ఇస్తే, మా ఇంటి పిల్లి ముసుగులో తిరిగే సింహం, అదే మా ఇంటాయన పెట్టే డ్రైవింగు లెక్చరు ఎలా భరించటము?
వీడా వదలడు. వాడా(మావారు) వూరుకోడు. ఏంటో! నా బ్రతుకు అర్ధరాత్రి శాండ్ విచ్చ్ లా వుందే…
సరే కాగలకర్మను తప్పించటము ఆ ముక్కంటికన్నా కుదురుతుందా?
ఆ టికెట్టు ఎదో కట్టి పడేస్తే వదులుతుంది పీడా పోతుంది. ప్రస్తుతం వీడితో గొడవ దండగ అని నా మనస్సులో గొణుక్కుంటూ లైసన్స్ ఇచ్చి ఆకాశం వంక చూస్తూ చుక్కలు లెక్కపెట్టటము మొదలెట్టా.

కొద్ది సేపటికి వచ్చాడు.

‘ యు నో వాట్‌. యు గాట్ లక్కి. నా మిషిన్ పని చెయ్యటము లేదు. నీకు టికెట్టు ఇద్దామంటే. సో నీవు వెళ్ళు’ అన్నాడు.

నాకు అర్థమయ్యాక టక్కని నవ్వు వచ్చింది. ఎదో ముసిముసిగా కాదు, పక్కున గట్టిగా నవ్వేశాను.
ఎంత గట్టిగా నవ్యానంటే ఆకాశములో మెరుపులు వురుముల ఎఫెక్టు వచ్చి వుంటుంది ఆ రాత్రి ఆ కాప్ కు:)

అలా నవ్వుతూ ‘గాడ్ ఈజ్‌ గ్రేటు’ అని కూడా అన్నాను.

కాపు ఆఫెండు అయ్యాడు.
“నన్ను చూసి నవ్వుతావా, అదీ సర్‌క్యాస్టిక్…చూడు ఏం చేస్తానో. మిషను పని చెయ్యకపోతే ఏంటి? నేను చేతితో రాసి నీకు టికెటు ఇస్తాను’ అన్నాడు ఆవేశంగా.

నేను ‘సారీ. మీ గురించి కాదు’ అన్నాను.
కాని నవ్వు ఆగటము లేదు.
అసలు నే తప్పు చెయ్యలేదు. మావారా ఇనుస్యూరెన్య్ తలచి వగస్తూ వుంటారు.
చిన్న పెన్సిల్ లో నాకు నా కారు హెడ్ లైట్లలో టికెట్లు ఇచ్చి కసి తీర్చుకున్నాడు ఆ డ్యూటీ వీరుడు.
నేను ఇంక ఏమీ మట్లాడలేదు.
ఇంటికి వచ్చాక ఈ విషయము చెబితే తను ‘బుద్దిలేదూ అలా ఎలా నవ్వుతావు’ అన్ని కయ్య…కయ్యమంటుంటే కూడా నవ్వే వచ్చింది.
టికెట్ ఆయనకిచ్చి కట్టుకోమన్నాను తిక్కెక్కి.
మరి ఆ కాపు తిక్కకో దేనికో నాకు మాత్రం టికెటు ప్రాప్తించింది ఆ రాత్రి.
లేకపోతే అర్ధరాత్రి వెనక చక్రాలు తిరగటం లేదని ఎవరన్నా టికెటు తెచ్చుకున్నారా ఎప్పుడైనా? మనకు రాసి వుంది అలా!!
ఒక్కోసారు ఇలా మనము నవ్వినా టికెట్లు వస్తాయి యూఎస్ లో.

ప్రాప్తం కదండి!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s