ఆషాఢ పౌర్ణమి – వ్యాస పౌర్ణమి – గురుపౌర్ణమి
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ॥
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః।
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥
మానవ జన్మల పరంపరలను విచ్ఛేదించు విచ్చు కత్తి గురువుల ఆశీర్వచనము. గురువు మనకు అందించే బోధను త్రికరణశుద్ధితో నమ్మి, ఆచరించిన వారికి ఈ జన్మ పరంపర ఇబ్బంది పెట్టదు. గురువును నమ్మిన వారికి ఈ సంసారమన్న నౌక దాటటం సులభము.
‘మానవ రూపములో ఉన్న వ్యక్తిని గురువుగా ఎలా నమ్మాలి?’ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానము, ఉదాహరణకి నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించటానికి వడ్డున ఉన్న మరో వ్యక్తి నదిలోకి ఉరికి ఆ కొట్టుకుపోతున్న వ్యక్తిని ఒడ్డుకు లాగుతున్నారు. ఆ ప్రవాహములో ఏకకాలములో కొట్టుకుపోతున్నవాడు, రక్షించువారు కూడా ఉంటారు. అయినా, ఆ ప్రవాహపు వేగములో కొట్టుకుపోతున్నవారికి కలిగే భయము రక్షించేవారిని ఉండదు. కారణము రక్షించేవారికి ఆ ప్రవాహము ఎలా దాటాలో తెలియటం వలన. అలాగే ఈ ప్రపంచమన్న ప్రవాహము ఎలా దాటాలో గురువుకు తెలుసు. వారు ఈ ప్రపంచమన్న ప్రవాహమును దాటగలరు, మరొకరిని దాటించనూగలరు.
కాబట్టే గురువు ఉన్న సాధకునికి ఈ జీవిత ప్రవాహపు జన్మ పరంపర భయపెట్టదు.
మానవ జన్మ లభించటమన్నది చాలా కష్టమైనది. మరి అలాంటి ఉత్తమోత్తమ జన్మ లభించిన తరువాత కూడా మనము అశాశ్వతమైన విషయవాసనల వెంట పడటమన్నది ఎంత హేయమైనదో ఆలోచించుకోవాలి. మనిషికి ఆలోచన అన్న ఒక మహా గుణము పరమాత్మ ఇచ్చింది అందుకే కదా!
మానవజన్మకు ముక్తి పొందటమే పరమావధి అన్న సత్యం ఆలోచనతో అవగతమౌతుంది. ఆ విషయమే సనాతన ధర్మం కూడా సూచిస్తుంది.
మానవుడు ఇలాంటి విషయ-జ్ఞానం ఎలా సంపాదిస్తాడు? శాస్త్రాలు చదవటం వలన ఆ విషయ పరిజ్ఞానం వస్తుందా?
శాస్త్రాలలో అనేక కర్మలు చెప్పబడ్డాయి. వాటిని ఆచరించి మానవులు జన్మ సాఫల్యం పొందవచ్చా?
సత్కర్మలు చెయ్యటం వలన ముక్తి లభిస్తుందా?
శాస్త్రాలు చదివితే సత్కర్మల యొక్క జ్ఞానం తెలియవచ్చు. కాని గ్రంథాలు చదవటం వలన జ్ఞానం ఎంత వస్తుంది అంటే, సందేహమే. అంతే కాదు, కర్మల వలన, జ్ఞానం వలన మానవులకు ముక్తి లేదా ఆత్మాజ్ఞానం (absolute truth) తెలియదు.
మరి గతి ఏమిటి?
సమాధానమే సద్గురువును ఆశ్రయించటము!!
అంతర్ముఖమయి ఆత్మ జ్ఞానం పొందటానికి ప్రతి వారు తప్పక ఒక ‘గురువు’ ను ఆశ్రయించాలి. గురువు ద్వారానే ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆత్మజ్ఞానము కావాలనుకునే మానవులు సాధన చెయ్యాలి. వారిని సాధకులు(Seekers) అంటారు. ఈ సాధకులు ఒక జ్ఞాని అయిన గురువు వద్దకు వెళ్ళి జ్ఞానం కోసం అర్థించాలి.
గురువు అంటే ఎవరు?
ఎక్కడ ఉంటారు?
ఎలా ఉంటారు?
ఎవరిని గురువుగా ఎన్నుకోవాలన్న ఎన్నో ప్రశ్నలొస్తాయి సాధకులకు.
‘గు’ అంటే గతి ప్రదాత. ‘ర’ అంటే సిద్ధి ప్రదాత ‘ఉ’ అంటే అన్నీ చెయ్యగలవాడని ఒక అర్థం.
మనకు గతిని, సిద్ధిని ఇవ్వగలవాడు ఒక్క పరమాత్మనే. కాబట్టి, మనకు మరో గురువు దొరకరు ఈ అర్థంలో చూసుకుంటే.
మరో అర్థంలో ‘గు’ అంటే జ్ఞానం, ‘రు’ అంటే ప్రసాదించువాడు అని మరో అర్థం.
అంటే మనలోని అజ్ఞానాన్ని రూపుమాపి, ఆత్మ జ్ఞానం ఇచ్చువాడు గురువు అని అర్థం.
అలాంటి ఆత్మ జ్ఞానం మనకు ఇవ్వాలంటే ముందు ఆయన ‘ఆత్మజ్ఞాని’ అయి ఉండాలి. మనం అలాంటి ఆత్మజ్ఞానిని గురువుగా గ్రహించాలి.
మనకు తల్లి మొదటి గురువు. తల్లికి ప్రతి మనిషి తన జీవితమంతా ముందుగా నమస్కారం చేసుకోవాలి.
మనకు చిన్న నాటి నుంచి చదువు చెప్పిన గురువును- గురువనవచ్చా? మన జీవితంలో వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులు ఆత్మోన్నతికి సహాయపడుతూ ఉంటారు. వారు సూచకగురువులు. మన కుల గురువులు, ఆచార్యులు, చెయ్యవలసిన విధుల గురించి చెప్పేవారు వాచక గురువులు. మంత్రాలను ఉపదేశించే గురువులు బోధక గురువులు. మన మంత్ర గురువులే మన పరమ గురువు అయి ఉండనక్కర్లేదు.
తత్త్వ జ్ఞానోపదేశం చేసి జీవుని మార్గాన్ని సుగమనం చేసే వారిని దీక్షా గురువు అంటారు. మాయాజాల స్వరూపమైన ఈ బ్రహ్మాండంలో పరమాణువు నుండి అనంతమైన విశ్వం వరకు గల అంతరంగ బహిరంగ విషయాల తత్త్వాన్ని బోధించేవారిని శిక్షా గురువు అంటారు. గురువు అన్నవారు చాలా ముఖ్యులు మానవ జీవితంలో. ఆత్మదర్శి అయిన గురువు లభించిన వారి జన్మ ధన్యం. అలాంటి గురువు నేటి మన జీవిత విధానంలో దొరకటం పరమ కష్టం.
ముముక్షువులైన, ఆత్మదర్శిని ఎలా కనుక్కోవాలి? కలిసినప్పుడు ఎలా వారి అనుగ్రహానికి నోచుకోవాలి అన్నది ప్రశ్న.
గురువు కోసం సాధకుడు తపించాలి. తప్పిపోయిన దూడ,తల్లి ఆవు కోసం తపించినట్లుగా, సంతలో తప్పిపోయిన పిల్లవాని కోసం తపించే తల్లిలా తపించాలి.
సాధకునికి ఉండవలసిన ముఖ్య లక్షణం తపన.
సద్గురువు కోసం తపించిన శిష్యుణ్ని గురువు తప్పక వెత్తుకుంటూ వస్తాడు. భగవత్గీతలో కూడా భగవానుడు గురువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాడు.
గురువును గుర్తించటం అన్నది అసలు సమస్య.
‘సాయిలీలామృతం’ లో సాయినాథుడు చెప్పనది బట్టి, “ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో, ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో, ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో, ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో… ఆ మహనీయుడే నీకు గురువు”.
గురువు ఆహారం, ఆహార్యం వంటి వాటిని శిష్యులు పట్టించుకోకూడదు. ఇలాంటి గురువు దొరికాక, శిష్యుడు ఇక సర్వం గురువుగా భావించి సేవ చేసి సంశయ నాశనం పొంది, యథార్థ జ్ఞానం పొందుతాడు. అప్పటి స్థితి నుంచి ఆత్మజ్ఞానం, పరదేవతా దర్శనం లభిస్తుంది ఆ అదృష్టవంతునికి.
గురువు త్రిమూర్తులకన్నా శక్తిమంతుడు. (గురుః బ్రహ్మా, గురుః విష్ణువు, గురుఃదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరంబ్రహ్మః తస్మై శ్రీగురవే నమః’). ఆయన కృప కలిగితే సర్వ దేవతా అనుగ్రహం , ఆత్మదర్శనం, బ్రహ్మానందం కలుగుతాయి.
ఆయన ఆగ్రహిస్తే శిష్యుని రక్షించువారు ఉండరు.
గురువు అన్నవారు జగత్తు కన్నా ఉన్నతమైనవారు. వారు ఈ లోకం గురించి ఆలోచించకపోవచ్చు, ఈ లోకం యొక్క సిద్ధాంతాలకు, కట్టుబడులకు గురువు దూరంగా ఉండవచ్చు, మాయలు చెయ్యకపోవచ్చు, కానీ ఆయన సర్వ శక్తివంతుడు. అందుకే తమ గురువును శిష్యులు పరమాత్మ యొక్క మానవరూపంగా కొలవాలి. గురునింద ఎప్పటికీ చెయ్యకూడదు. భక్తిగా, శ్రద్ధాళువై ఉన్న శిష్యుణి, గురువు అనుగ్రహం సదా కాపాడుతుంది.
సాధకుడు పరమ గురువును చేరేవరకు సహాయం చేసే గురు -పరంపరను అను నిత్యం నమస్కరించుకుని, తన గురువు అనుగ్రహము కోసం ప్రార్థన చెయ్యాలి. మంచి గురువు దొరికాక సాధకులు, తనకు తోచినప్పుడు కాకుండా, ఉన్నదే గురు సేవ కోసం అని నమ్మి సేవిస్తే, ఆ తత్త్వదర్శి, శిష్యునకు సర్వం అనుగ్రహిస్తాడు.
కాబట్టి మానవ జన్మ నెత్తిన ప్రతివారు, ఒక గురువును చూసుకొని సాధన ద్వారా ఆత్మ దర్శనం చేసి బ్రహ్మానందం పొందటమే జీవన్ముక్తి అని సనాతన ధర్మం చెబుతున్నది. గురువు గురించి గురు చరిత్ర వివరంగా వివరిస్తుంది.
కర్మభూమి అయిన భారతావనిలో ఎందరో దత్తస్వరూపులైన గురువులు జన్మించారు. జన్మిస్తున్నారు. మానవులకు జ్ఞానసముపార్జన చెయ్యటము, జన్మ పరంపరలను దాటటము సాధ్యమేనని చూపుతున్నారు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి. ఆనాడు గురు వందనము చెయ్యటము ఆచారముగా వస్తోంది. సాయినాథుడు కూడా తన భక్తులకు ఈ పౌర్ణమి నాడు గురువును సేవించుకోమన్న సూచన చేశారు.
ఇంతటి పుణ్యతిథినాడు మన గురువును తలచుకు చేసే ధ్యానం, దానం త్వరితగతిన ఫలించి, గురువుకు పాత్రలై జీవన్ముక్తులవగలరు.
ఈ పుణ్య తిథి ఎల్లరు దివ్వమైన అనుభూతులు సొంతం చేసుకోవాలని శ్రీగురుణ్ని ప్రార్థిస్తూ- ఽఽస్వస్తిఽఽ
గురువు గురించి నేను రాసుకున్న కందమాల:
(శంకరభగవత్పాదుల గురు అష్టకం ప్రేరణగా)
- మాటను కాదనని పతిన్
తోటల కూడిన భవనము, దొంతరల ధనం।
తేటగు యశమును యున్నను,
చేటగు, సద్గురు పదముల జేరని మనమున్॥
2.
పతియు సుతులు పుత్రికలును
సతియూ హిత, బంధుకీర్తి శతమున్న మనః।
మతి గురువుల పాదములు ప్ర
ణతి సేయని మనుజుని జననము వ్యర్థమిలన్॥
3.
విద్యలు పలు రకములరయ
పద్యము గద్యము పరిపరి పాడగనేమిన్?
హృద్యముగా నామనుజుడు
సద్యత వ్యర్థము, గురువుల సన్నతి లేకన్॥
పొగడిన పరదేశములో
పొగడిన తమదేశమందు భోగముబెంచన్।
పొగడిరి జనులును, మనమున
పొగడ గురు పదములు లేని పురుషుడు వ్యర్థమ్॥
5,
రాజులు కావచ్చును రా
రాజులు మరినేమి జగతి రాజ్యము కానీ
మోజుగ జీవించగనే
పూజలు గురువుకు మరచిన పుట్టుక వ్యర్థమ్।।
- కరుణ కలిగి నేమిన్? కని
కరమున సంపద వితరణ కావించగనే?
ధరణిన కైవల్యముకై
గురువును మనమున తలువని కులజుడు వ్యర్థమ్॥
7.
భోగపు ధనమున మోహము,
రాగము నొందక, విడిచి విరాగము పొందీ।
యోగముతో కూడి గురువు
నేగముగ శరణము పొందని జననమేలా?l
8.
అడలందు తిరుగుతున్నా
సదనము నున్నా, మనుగడ సమముగ నుంచేl
మదిన సదా సద్గురువుల
పదములు వదలక తలచుట పరమపదమిలన్ ll
9.
పిలచిన పలికెడు పటలము
కలనైన వదలని భార్య; గంపల కొలదిన్|
వెలగల మణులున్న నరుడు
తలపక గురు పదములను బ్రతకనేల నిలన్||
10.
గురువుల పదములు నిత్యము
మరిమరి మనమున తలచెడు మనుజునికిలలో।
పరిజుడు, గృహస్తుడైనను
పరతత్వ బ్రహ్మం లభించు పరమేశు కృపన్।। —