శ్రావణ(పండగల) మాసానికి స్వాగతం2021
శ్రావణ మాసం వచ్చింది. ఇక మనకు చుట్టూ పండగలే. ప్రతిరోజు ఒక కొత్త విషయమే.
ఎండాకాలపు వేడికి అలసిన హృదయాలకు మిత్రుల, బంధువుల కలయికతో ఆనందము వర్షించే సమయము ఆసన్నమవటమే శ్రావణము.
హడావుడి జీవితాలలో ఒక్క క్షణం ఆగి ఆనందస్వరూపుడైన పరమాత్మను తలుచుకోవటానికి విశిష్టమైన కాలము శ్రావణము.
శివునికి, విష్ణవుకు ప్రియమైన కాలము శ్రావణము.
మంగళగౌరిగా, శ్రావణలక్ష్మిగా , అమ్మవారిని ఆరాధించేకాలము శ్రావణము.
మంచిరోజులుకు, పెళ్ళిళ్ళకు, పెళ్ళిమాటలకు శుభ సమయము శ్రావణము.
ఆషాడపు గడ్డుకాలము తీరి నవ దంపతులను కలిపే కాలము కూడా శ్రావణము.
మహావిష్ణువు జన్మనక్షత్రము శ్రావణము. కాబట్టి ఈ మాసాన్ని దామోదర మాసమంటారు విష్ణు భక్తులు ఇది దామోదురునికి ప్రియమైనది. అందుకే దామోదర పూజ చేసే కాలము ఈ శ్రావణము.
విష్ణువు హృదయములో శివుడు నివాసముంటాడు (శివశ్చ హృదయం విష్ణః విష్ణోశ్చ హృదయం శివః)
కాబట్టి, ఈ కాలములో శివపూజకు యోగ్యమైనది.
ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని రెట్లు అధిక ఫలితాన్నిస్తుంది. సోమవార వత్రం చేసేందుకు ఈ మాసము ఉత్కృష్టమైనది. సోమవారం శివారాధన, రుద్రాభిషేకాలు చేసుకొని ఈశ్వరుని మనసారా ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయి. సోమవారాలు ఉపవాసదీక్ష గాని, ఒక పూట అల్పాహార్నాని భుజించి గాని ఈ ఆరాధనలు చేసుకుంటారు శివభక్తులు.
మంగళవారాలు మంగళకరమైన మంగళగౌరి నోములు ఆరాధనలు ఈ మాసపు ప్రత్యేకతలు. వివాహమైన స్త్రీలు మంగళగౌరి నోమును చేసుకొని తోటి ముత్తైదువులకు వాయనము ఇచ్చుకుంటారు. ఇలా సర్వ సౌభాగ్యాల కోసము వివాహితులు నోచుకునే శ్రావణమాసము మంగళగౌరికి ప్రియమైన మాసము. ఈ నోములు అన్ని మంగళవారాలు, ఐదు సంవత్సరాల కాలము పడతారు.
శ్రావణమాసపు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం లక్ష్మీదేవి పూజ జరుపుకోవటము మనకు అనాదిగా ఉన్న సత్సాంప్రదాయం ఈ వరలక్ష్మి వ్రతము చిన్న పెద్ద తేడా లేక జాతి మత తేడా విడిచి అందరూ జరుపుకుంటారు. లక్ష్మిదేవి అందరికి కావలసిన తల్లి కదా మరి.
ఈ వత్రంలో చారుమతి దేవికి శ్రావణలక్ష్మి ప్రసన్నమటము మాత్రమే కాదు, తనకున్నది అందరికీ పంచుకోవాలన్న నీతి అంతర్లీనంగా కనపడుతుంది. ఉన్నది నలుగురికీ పంచుకోవటమన్నది సనాతన ధర్మంలో ముఖ్యమైనది.
శ్రావణ మాసములో వచ్చే శక్ద్వాదశి, దామోదర ద్వాదశి ముఖ్యమైనవి. ఈ మాసమంతా దామోదర పూజ చేసి ద్వాదశినాడు మహావిష్ణవును అంగరంగముగా పూజించి విష్ణులోకాలు పొందుతారు విష్ణుభక్తులు.
మా మిత్రులు కొందరు కృష్ణభక్తులు ఈ దామోదర మాసము కృష్ణహారతులు, భజనలు జరుపుతారు.
శ్రావణ శుక్ల పక్ష ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశులలో ఒకటి. ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసముండి మహావిష్ణువును పూజించి, జాగరముండి ద్వాదశి పారాయణం చేసినవారికి విష్ణు సాయుజ్యం కలుగుతుందని మార్కేండేయపురాణం చెబుతుంది . రేవా నది ఒడ్డున ఈ ఏకాదశి చేసే ఆచారము మెండని చెబుతారు పెద్దలు. కుదిరితే నది ఒడ్డున లేకపోతే ఉన్నచోటనే జరుపుకోవచ్చును.
ఈ మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత్య ముఖ్యమైన నాలుగు పౌర్ణమిలో ఒకటి.
దీనినే జంద్యాల పౌర్ణమి అనికూడా అంటారు.
ఈ పౌర్ణమి రోజు ద్విజులు తమ యజ్ఞోపవిత్రాలను (జంద్యాలను) మార్చుకుంటారు. వేదాద్యాయము మొదలెడతారు.
ఈ మాసములోనే జ్ఞానస్వరూపులైన హయగ్రీవుల వారి జయంతి. గురు రాఘవేంద్రస్వామి ఆరాధన కూడా ఈ మాసములోనే.
దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయ్యటానికి భువిన అవతరించి కృష్ణ భగవానుడు జన్మించిన కృష్ణాష్టమి ఈ మాసమే.
ఈ నెలలో వచ్చే పౌర్ణమి రాఖీపౌర్ణమి కూడా. ఆడపిల్లలు ప్రేమతో సోదరుని చేతికి తోరము కట్టి తమ భ్రాతృ ప్రేమను పంచుకునే కాలము.
ఇన్ని ముఖ్యమైన పండులు గుచ్చి నిలబెట్టిన అత్యంత పవిత్రమైన మాసము, వేడి తగ్గి వానల మధ్య ఆహ్లాదకరమైన కాలము శ్రావణమాసము.
పవిత్రమైన ఈ మాసము భగవద్భక్తులకు జగదంబ సర్వ శుభాలను చేకూర్చాలని మనఃపూర్వకంగా కోరుతున్నాను.
ఽఽస్వస్తిఽఽ