ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారి
జన్మదిన సందర్భంగా వారికి భక్తితో సమర్పించే చిరు పుష్పం…
విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన సాహిత్యాములో రామాయణ కల్పవృక్షము అతి విశిష్టమైనది. వారికి జ్ఞానపీఠము తెచ్చిపెట్టినది.
అందరూ అదే రామాయణము రాయటమేమిటా అని మనము అడగక ముందే, వారే చెప్పారు… ఇలా…
“తింటున్న అన్నమే రోజూ తింటున్నాము కదా యని…
మరల నిదేల రామాయణం బన్నచో,
నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న అన్నమే తిననచున్నదిన్నాళ్ళు,
తన రుచి బ్రదుకులు తనవి గాన
చేసిన సంసారమే చేయుచున్నది,
తలచిన రామునే తలచెద నేను
నా భక్తి రచనలు నావి గాన…” అని ప్రకటించారు.
విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రాయటమంటే కొండను కదపడము. నేనా చిన్న పిల్ల ఎలుకను. అయినా ధైర్యం చెయ్యటానికి కారణం ‘కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వగలమా? భక్తిగా ఒక పుష్పం సమర్పించగలము కాని… అన్న ధైర్యంతో మొదలెడుతున్నదీ చిరు పుష్పం.
వారి రచనలలో నవలలు, కథలు, కావ్యాలు, శతకాలు ఎన్నో ఉన్నాయి. వాటిని వేటిని అంటకుండా కేవలము వారు రచించిన రామాయణ రచన మీద భాష్యంగా రచించిన “నా రాముడు” గురించి రెండు ముక్కలు.
ఆయన రచించిన రామాయణ కల్పవృక్షం రకరకాల శిల్ప రహస్యాలతో ఉంది. దానిని అర్థం చేసుకోవటము అంత సులభము కాదు. పండితులకు మాత్రమే తెలుస్తాయేమో. మరి మన వంటిది పామరులకు, అందునా వారిని భక్తిగా కొలుచుకునే అభిమానులకు ఎలా అర్థం కావాలని వారి మిత్రులు అడిగినందుకు విశ్వనాథ వారే స్వయంగా ఆ రామాయణానికి భాష్యం వంటి చిరు కావ్యము వివరాలతో రచించారు. అదే “నా రాముడు”. ఆ కావ్యము రామాయణ భాష్యం వంటిది కాబట్టి వారు భాష్యాలు కూడా రచించారని చెప్పవచ్చు.
ఈ “నా రాముడు” చిన్న కావ్యమైనా అపూర్వమైనది. ఇది ఒక రకంగా స్వీయ చరిత్ర, ఒక తాత్త్విక కావ్యం, ఒక విచిత్రం.
దీనిలో విశ్వనాథ వారు పది భాగాలుగా విభజించి రాశారు. పది భాగాలు: ఆనందమయుడు, ఆనందమూర్తి, అవతారమూర్తి, బాలరాముడు, కోదండరాముడు, అయోధ్యారాముడు, దశరథరాముడు, జానకీరాముడు, రఘరాముడు, ఆత్మారాముడు.
మొదట ఆనందమయుడు అంటే ఆనందము కలవాడు. ఆనందము ఒక రసము. రసానందమే ఆనందము. రామాయణము వాల్మీకి రసం పుట్టించటానికి రాశాడు. ఆనందం గురించి తైతిరీయం చాలా వివరంగా చెబుతుంది. మానవ జీవితానికి ఆనందమే పరమ గమ్యము. అదే బ్రహ్మము. మానవుల ఆనందము, బ్రహ్మానందానికి తేడా అనంతం. మానవ ఆనందము కన్నా బ్రహ్మానందం కొన్ని కోట్లరెట్లు ఎక్కువగా ఉంటుంది. రసజ్ఞులైన వారు మంచి కావ్యాని చదివినప్పుడు కలిగే రసానందం కొద్దిగా బ్రహ్మానందాని రుచి చూపించి ఉండవచ్చు.
శ్రీరాముడు పరబ్రహ్మ. ఆనందమే రూపముగా కలవాడు. ఆయన తనను తలుచుకున్న వారికి ఆనందము ఇస్తాడు. మానవానందాన్ని పొందిన వారు రాముని సాధన చేస్తే బ్రహ్మానందము పొందగలరు. రామాయణము చదివితే రసానందము కలగుతుంది. ఆ రామాయణమును సాధనగా చేస్తూ రాముని ఆత్మ గా భావించగా బ్రహ్మానందం పొందవచ్చు ఎప్పటికైనా.
ఇదే మహాయోగులు పొందె స్థితి.
విశ్వనాథ వారికి ఇటు వంచి స్థితి రెండు సార్లు కలిగిందట. వారు ోగులని ఇది మనకు చెబుతుంది.
విశ్వనాథ వారికి ఒకనాడు ధ్యానములో ఉంటే ఆయనకు భుజములకు కోదండం, ప్రక్కనే సీతాదేవి, పాదముల వద్ద హనుమంతుల వారితో రామ దర్శనం కలిగింది. ఆయనకు ఇలా హనుమంతుల వారి దర్శనం చాలా సార్లు కలిగింది. హనుమంతుల వారు పువ్వుల మాలను ధరించి ఉండేవారుట. ఆ పూల మాల ధరించిన హనుమంతులవారు, ఆ పూలను చూస్తే శివునికి వేసినదిగా అనిపించేదట. వారికి శివ విష్ణువుల అభేదం. వారికి విష్ణువుకు రామునికి కూడా భేదం లేదు. అందుకే వారి రామాయణ కల్పవృక్షం వారు విశ్వేశ్వరునికి అంకితమిచ్చారు.
సృష్టి స్థితి లయలకు త్రిమూర్తులు కారణమైనా వారంతా ఒక్క బ్రహ్మ రూపమే. త్రిమూర్తులకు వారి పని కి శక్తినిచ్చే “శక్తి” వెనక ఒక్కటే. ఆశక్తే వారిని శక్తిమంతులుగా చేస్తోంది. రామునికి శక్తి సీతామహాదేవి. ఆమె రావణ సంహారము చేయించింది. ఆ శక్తికి లొంగి రాముడు పనిచేస్తాడు. ఆ శక్తి ఆదేశించకపోతే విష్ణువు విష్ణువు కాదు. శంకరులు వారు సౌందర్య లహరిలో చెప్పినట్లుగా “ శివశ్శక్త్యాయుక్తః యది భవతి శక్తః ప్రభవితుమ్…” శివుడైనా, విష్ణువైనా శక్తి లేకపోతే కదలలేరు.
సీత వేదతత్త్వం మూర్తిభవించినది. ఆమె శక్తి రాముని నడిపించింది.
ఇక కోదండరాముడని రామునెందుకు అన్నారు? ప్రపంచములో ఎందరో ధనుష్కులున్నారు. ఎవ్వరిని కోదండములో కలిపి పిలువరు. కాని రాముని మాత్రము కోదండరామా అంటారు. కారణము ఆయనకు ఆ కోదండము మీద ఉన్న అధికారము. ఆ బాణాలు పోయే పద్ధతిలోని విలక్షణత్వము. ఆయన బాణానికి ఉన్న శక్తి. అసలు కోదండము ఆయనను అంటి పెట్టుకొని పుణ్యం చేసింది. ఆయన కోరుకుంటే గడ్డిపోచ బ్రహ్మస్త్రము కాగలదని కాకాసుర వృత్తాంతము చెబుతుంది. అందుకే కోదండము ఆయన భుజాలకు ఉండి ప్రాముఖ్యత సంతరించుకున్నది. కోదండరాముని మంత్రములో కోదండానికి ప్రాధాన్యత ఉంది.
అయోధ్య వాసులు రాముని అవతారం కోసం ఎదురు చూశారు. రాముని పట్టాభిషేకము ఉదయమంటే ఎవ్వరూ ఆ రాత్రి నిద్రపోలేదు. పట్టభంగమై రాముడు అడవికి వెడుతుంటే ప్రజలూ ఆయన వెంట కదిలారు. వారు రాముని మహాభక్తులు. రాముడు వారికి తనని దహరాకాశంలో (మనస్సులో) నిలుపుకోమని చెప్పి వెననకు పంపాడు. అయోధ్య ప్రజల హృదయాలలో కొలువైన వాడు అయోధ్యరాముడు.
తండ్రి పేరుతో పిలవటము లేదు ఆ కాలములో. తల్లి పేరుతో పిలిచేవారు. కానీ రాముని దశరథరాముడంటారు. దశరథుడు తన సర్వమూ రాముడే అనుకున్నాడు. దేవుని మీద చింత, తపన ఉంటే తప్ప మోక్షానికి అర్హులు కారు. రాముని చింతిస్తూ దశరథుడు మరణించాడు. ఆయనకు పూర్వమున్న ముని శాపం అలా తీరింది. రాముని చింతిస్తూ మరణించాడు కాబట్టి మోక్షము పొందాడు.
శంకరభగవత్పాదులవారు అమ్మవారి గురించి చెబూతూ త్రిమూర్తులు “ తవాజ్ఞామూలంబ్యక్షణ చలితయోః భ్రూలతికయోః” అన్నారు. అంటే, అమ్మవారి కనుసైగలను ఆజ్ఞాగా భావించి త్రిమూర్తులు సృష్టిస్థితిలయలనే కార్యాలు చేస్తారు. అలాగే రాముడు ‘ఆయమ కంటి యానబడి యాచరణం’ చేస్తుంటాడు.
కారణం సీత మహాశక్తి. వేదతత్త్వం. రాముని చే కర్తవ్యం చేయించటానికే సీత వచ్చింది. సీతా శక్తిని చూపించేది కాబట్టి వాల్మీకి రామాణాన్ని “సీతాయాశ్చరితం” అనే నామాంతరము ఉంది.
రావణుడు శివ భక్తుడు. శాక్తేయుడు. వేదము తెలిసినవాడు. అతనిని చంపటానికి వేదాలతో కూడిన శక్తిమంతుడు కావాలి, కాబట్టి రాముడుతో సీత వెన్నంటి ఉంది. అసలు రామాయణాన్ని నడిపించిన శక్తులు మంధర, కైక, శూరిపణఖ, సీత. వీరందరూ శక్తికి సంకేతాలు. వీరి మీద ఆధారపడే కథాంతా నడిచింది.
సీత వెన్నంటి ఉన్నందున రాముడు జానకిరాముడయ్యాడు.
సీత రామునికి ఆయన చేసిన పనులను బట్టి ఫలితాలనిచ్చింది.
ఆత్మారాముడన్న విభాగములో విశ్వనాథవారు స్వీయ చరిత్రను రాసుకున్నారు. ఆయన తండ్రిగారు కాశీ నుంచి శివలింగం తెచ్చి ప్రతిష్ఠ చేసి శివాలయము కట్టించారు వారి గ్రామమైన నందమూరులో. ఆ శివుడు ఆయన భ్రూమధ్యములో ఆడేవాడుట. ఆయన ఇష్టపడిన దేవుడు వేణుగోపాల స్వామి. కాని ఆయన హృదయములో మాత్రము రాముడు కొలువైనాడని చెబుతారు వారు.
రామాయణము రాయమని ఆ రాముడే చెప్పాడని చెబుతారు విశ్వనాథవారు. ఆయన ఎన్నో నవలలు ఎంతో తక్కువ కాలములో రాసేవారు. కొన్ని పదిరోజులలో రాసేశారు. వేయిపడగలు నెలరోజులలో రాసేశారు. కానీ రామాయణము రాయటానికి వారికి ముపై సంవత్సరాలు పట్టింది. కారణము ఆయన హృదయ పీఠములో రాముడు వచ్చి కొలువైనప్పుడే వారు రామాయణము రాయగలిగారు. కాబట్టి ఇది ఆ ఆత్మారాముడే రాసుకున్నది.
వారికి “రామాయణం మొదలుపెట్టు” అని మాట వినబడినదిట. అప్పుడు రాయటం మొదలెట్టారు.
ఇలా రాస్తూ ఉంటే చివరన ఒక పద్యములో చివరి చరణానికి వచ్చి ఆగిపోయారు.
అది రాముడు లంక నుంచి అయోధ్యకు వెడుతున్న సందర్భములో హనుమంతుల వారిని తమ రాక తెలియపర్చమని పంపుతారు. భరతుడు అగ్నిలోకి దూకటానికి సిద్ధంగా ఉంటాడు. హనుమంతుడు దూరం నుంచి రాముని గురించి గానము చేస్తూ వస్తాడు. ఆ సంగీతము విని రససిద్ధి లో ఉన్న భరతుడు వార్తలను వింటాడు. అతనికి కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది. అతని కంఠము నుంచి ఒక స్వరం వస్తుంది… అంతవరకూ రాసి ‘ఆ స్వరము ఎలా ఉండునో’ అని అనుకుంటూ ఆయన రాయటం ఆపేశారట. ఎంత ఆలోచించానా తట్టలేదు. ఇక లాభం లేదని లేచి స్నానాదులు కావించి ధ్యానములో కూర్చొన్నారట. ఆ ధ్యానములో వారికి తట్టింది. భరతుని నోటి వెంట వెలుపడిన శబ్ధం శ్రీరాముడు జైత్రయాత్రకు వెడుతున్నప్పుడు నోటి వాయువుతో శంకం పూరించగా వెలువడిన ధ్వని వలె ఉంది యని. “జైత్రయాత్రాంచచ్ఛ్రీ మధుసూదనాస్య పవమానాపూర్ణమైనట్టులన్…”
రామాయణము మీది వారిచ్చిన వివరములు చూస్తే వారు పరమ భాగవతోత్తములుగా, యోగిగా మనకు కనిపిస్తారు.
కవిసామ్రాట్ గా ప్రజల హృదయాలను దోచుకున్న వారి హృదయపీథములో ఉన్న రాముని, ఆత్మారాముని ఆవిష్కరిస్తూ …
“ఇది యాత్మారాముని దౌ
సదమల రూపంబు సర్వసంపత్కంబై
మది నమ్ముము కడు మంచిది
మది నమ్మకు మంతకంటే మంచిదిపోనీ” అంటూ ముక్తాయించారు.
ఇదే కదా విశ్వనాథ వారంటే మరి.🙏🏽🙏🏽
తుది మెరుపు: మా గురువుగారు పూజ్యదేవీదాసుగారు విశ్వనాథ వారి శిష్యులు. అలా నేను ప్రశిష్య పత్రం పొందాను. అదో తృప్తి అన్నమాట-