#అమ్మఆలోచనలు
మంత్రము దీక్ష వంటివి గురువులు శిష్యులకు ఇవ్వటం లోకసామాన్యం కాని అమ్మ విషయంలో అలా కాదు.
ఎవరైనా వచ్చి మంత్ర దీక్ష ఇవ్వమంటే అమ్మను అడిగితే “మనస్సే మంత్రం. నాన్నా! ఏ మాటైనా మంత్రం మస్ససిద్ధి ఉంటే…” అనేది అమ్మ.
అమ్మ మాటే మంత్రం. మరో మంత్రం ఎందుకు? లలితా నామాలలో కూడా “శ్రీమాత” అన్నదే మోదటి నామము.
అలాంటి అమ్మ మంత్రదీక్ష లిచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఉపనయనమైనప్పుడు అమ్మ వటువుకు గాయత్రి దీక్ష నిచ్చింది. అలా ఉపనయనాలు చేసుకొని అమ్మ వద్ద గాయత్రి తీసుకున్నారు కొందరు అదృష్టవంతులు.
అమ్మ సామూహిక మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది.
అది ఒక పౌర్ణమి రోజు. అమ్మ ఆ రోజు మంత్రమిస్తుందని తెలుసుకొని జనాలు పోటెత్తారు.
అమ్మ నది వైపుకు బయలుదేరింది.
కొంత సేపు వుంటే బండి సిద్ధమవుతుందని నాన్నాగారు చెప్పారు.
“అంత సమయం లేదు…” అన్నది అమ్మ.
బండి వచ్చే సరికే అమ్మ నడచి వెళ్ళిపోయింది. అమ్మ వేగం అందుకోవటం యువకులకు కూడా కష్టమయింది.
అమ్మ నదిని చేరి నదిలో మునిగి లేచి వచ్చిన వారికి వారి కుల, మత, వర్ణ,లింగ బేధం లేకుండా అందరికీ మంత్ర దీక్షలిచ్చింది. దాదాపు ఆరు వందల మంది ఆ రోజు అమ్మ దగ్గర దీక్ష తీసుకున్నారు.
వసంధరక్కాయి అన్న భక్తురాలికి అమ్మ దగ్గర మంత్రం తీసుకోవాలని ఉంది. “చిన్న పిల్లవు, ఆడపిల్లవు నీకెందుకు?” అంటూ అందరూ ఆమెను నిరుత్సాహ పరిచారు. కానీ ఈ సామూహిక మంత్రదీక్షలో వెడితే ఆమేకు అమ్మ మంత్రదీక్షనిచ్చింది.
ఆ తేడాలు మనకు కాని అమ్మకు లేవని అమ్మ చూపింది.
అమ్మ అందరికీ, ప్రతి ఒక్కరికీ చెవిలో మంత్రం చెప్పింది. ఒక్కోక్కరికీ రెండు నిముషాలు వేసుకున్నా కనీసం రెండు మూడు గంటలు కావలసిన కార్యక్రమం అది. కానీ అమ్మకు కేవలం ఇరువై నిముషాల కాలం పట్టింది.
అదేలాగో ఎవ్వరికీ తెలియలేదు. ఆ కార్యక్రమం అంతా హడావిడిగా కూడా జరగలేదు. అమ్మ నింపాదిగా అందరికీ చెవిలో చెప్పింది.
అందరూ ఆశ్చర్యపోయారు. అంత మందికి చెప్పినా కేవలం ఇరువై నిముషాలే కావటం… అయ్యాక అమ్మ బండిలో వెనక్కి వెళ్ళిపోయింది.
కాలస్వరూపిణే అమ్మ. అలాంటి అమ్మకు కాలాన్ని ఆపి, అందరికీ కావలసినవి ఇవ్వటం ఒకలెక్కా?
అమ్మా! సృష్టి స్వరూపిణివి, కాలస్వరూపిణివి నీవై ఉండగా మాకు మరోకాలమేల? మా అంతఃకరణాల శుద్ధితో మేము మా నిజరూపుమలో నిన్ను చూసేలా నీవే అనుగ్రహించాలని అమ్మను ప్రార్థిద్ధాము.
జయహో మాతా!