2.కొందరు పెద్దలు, వేదపండితులు కలసి జిలేళ్లమూడి వెళ్ళారు. వారిలో కొందరు భక్తులు. కొందరు అమ్మను పరిక్షించాలనుకున్నవారు. కొందరు అమ్మ వేదపరిజ్ఞానము చూడాలనుకున్నవారు.
అప్పటికి అమ్మ గుడిసెలోనే ఉండేది.
అమ్మ అందరికీ భోజనాలు కొసరి కొసరి
వడ్డించింది.
తిన్న తరువాత వారు అమ్మతో సంభాషణ మొదలెట్టారు. వేదాంతం మీద ప్రశ్నలేశారు. అమ్మ దేనికీ సమాధానమివ్వక వేరేది మాట్లాడుతోంది.
ఇంతలో ఒక భక్తుడు వచ్చి “అమ్మ! ఈ పుస్తకం అచ్చు వేశారు. ఇది చూసి నీవు సరేనంటే విడుదల చేస్తారు…” అన్నాడు.
అమ్మ అది తీసుకొని అటు ఇటు త్రిప్పి “నాకు సంస్కృతమేమొచ్చు నాన్నా?” అంటూ పుస్తకం తెరచి
ఎదురుగా కూర్చున్న అతనికి ఇచ్చి “ఇది చదువు నాన్నా!” అన్నది.
అది చదువితే, ఆ పండితుడు అడిగిన ప్రశ్నకు సమాధానమే ఆ పేజీలో ఉంది.
అమ్మకు సంస్కృతం రాదు. ఆ పుస్తకం వస్తుందనీ, వీరు వచ్చి ప్రశ్నిస్తే సమాధానము అందులో ఉందనీ ఎలా తెలుసు?
అమ్మను పరీక్షించగలవారమా?
అమ్మా జగదంబా! మాకెన్నో వచ్చన్న మా అహంకారం కూకటివేళ్ళతో తొలగించి స్వస్వరూపము చూస్తే అనుగ్రహం
ప్రసాదించు.
నీ పాదములే శరణు.