విశ్వమాతః
లలితా నామాలలో అమ్మవారి ఒక నామము ‘విశ్వమాతః’.
ఈ విశ్వానికంతటికీ తల్లి అయిన జగత్జనని మానవ రూపము ధరిస్తే అది జిలేళ్లమూడి అమ్మ.
దివ్యమాతృత్వం రూపము ధరిస్తే అమ్మ.
తమ, తర బేధాలే కాదు, మానవ, పశు, జంతు, క్రిమి, కీటకాలతో పాటూ చెట్టూ పుట్టలకు తను తల్లినని అమ్మ చూపటము, భక్తులకు ఎన్నోసార్లు అనుభవమే.
ఒకసారి ఒక భక్తుడు అమ్మ కునివేదించటానికి మధుర పదార్ధం తెచ్చిపెడితే పిల్లి వచ్చి తింది. ఆ భక్తుడు పిల్లిని కొట్టబోతే, “పిల్లి కాదు నాన్నా పిల్ల” అంటూ అమ్మ వారించింది.
గోపాలకృష్ణమూర్తి అమ్మ భక్తుడు.
అప్పటికి అమ్మ ఇంకా చిన్న గుడిసెలో ఉండేది. అమ్మ వారితో ఎన్నో కబుర్ల చెప్పేది. అలా చెప్పిన సంగతులలో ఒక విషయం దొర్లింది. అది: అమ్మ అమృతత్వం గురించి ఇంకా బయటకు తెలియని రోజులలో ఊరిలో రెండు వర్గాలు ఉండేవట. ఆ వర్గాలు ఎప్పుడూ ఒకరినొకరు దెబ్బతీసే యత్నంలో ఉండేవారు.
అందరి నాన్నగారు అయిన కరుణం గారు ఒక రోజు ఊరికి వెడుతూ అమ్మకు తోడుండమని ఒకరిని ఉంచి వెళ్ళారు. ఎండా కాలము రాత్రి. అమ్మ ఆరుబయట మంచం వేసుకు పడుకుంది. తోడున్న వ్యక్తి వ్యతిరేకవర్గం వాళ్ళలో ఒకరు ఆ రాత్రి వచ్చి అమ్మను ఇబ్బంది పెట్టపోయారు. అమ్మ తోడున్న అతనిని లేపింది. అతను లేచి వచ్చే సరికే ఈ అఘాయిత్యం చేయటానికి వచ్చిన వాడు పారిపోయాడట.
అమ్మ ఆ విషయం చెప్పింది గోపాలకృష్ణతో.
మరుసటి రోజు అమ్మ గోపాలకృష్ణకు పళ్ళు తినిపిస్తూ కిటికీ లో నుంచి చూసి, “నాన్నా వాడేరా” అందిట
“ఎవరమ్మా?” అడిగాడు గోపాలకృష్ణ
“వాడేరా గొడవచెయ్యబోయాడంటినే…” అన్నది అమ్మ.
గోపాలకృష్ణకు కోపం ఆగలేదు.
పరుగున వెళ్ళి వాడిని పట్టుకు తన్నాలనుకున్నాడు. అప్రయత్నంగా నోటి నుంచి “లంజాకొడకా..” అన్న మాట వచ్చింది.
అమ్మ నెమ్మదిగా “మరి నీవో…” అన్నది.
గోపాలకృష్ణ మాన్పడిపోయాడు.
అమ్మ ఈ సర్వ ప్రపంచానికీ అమ్మే!
వారు గుణాలకు, మతాలకు అతీతంగా అమ్మే. ఆమె పరిపూర్ణంగా జగదంబే.
ఆ పూర్ణ మాతృత్వానికి తప్ప మానవమాత్రులకు ఇది అసాధ్యము కదా.
జగదంబా మా క్లేశాలు త్రుంచి మమ్ము ఆనందమయమైన ఆత్మతత్త్వంలో ఉంచు అని ప్రార్థించటము తప్ప చెయ్యగలిగినదేముంది?
జయహో మాతా!!