మానవులుగా జన్మించిన వారు తప్పక ఐదు ప్రశ్నలు వేసుకోవాట…
నేను ఎవరు? నేను ఏమి పొందవలెను? నేను ఎట్లు పొందవలెను? పొందుటకు ఆటకంమేమిటి? పొందన ఫలమేమిటి?
జీవితంలో ప్రతి దానికీ ఇలా ఆలోచించుకోమని రామాయణాది నేర్పుతాయి.
భగవానులు కూడా ఎప్పుడూ నేనెవరు అన్నదే తెలుసుకోమంటారు.
ఆ విచార మార్గం అంత సులభం కాదు. దానికి భగవానులే ఒక సారి ఇలా చెబుతారు
” నేనెవరు?”* అది కనుగొనే దెలాగ?
నీవు ప్రశ్నించుకో. అన్నమయ కోశమనే ఈ దేహమూ, దాని ధర్మాలూ “నేను” కాదు.
మరొక మెట్టులో, మనోమయ కోశమనే మనస్సు, దాని వృత్తులూ “నేను” కాదు.
ఆ తర్వాత మెట్టు ఈ ప్రశ్న: “ఈ తలపు లెక్కడ పుడుతున్నవి?” ఆ తలపులు యాదృచ్ఛంగానో, నామరూపాదులను బట్టియో, తర్కమూలంగానో జనిస్తాయి. ఎవ్వనికీ తెలియకనే తలపులు పుట్టునా? తలపుల ఉనికి, వాని స్పష్ట రూపమూ, వాని వ్యాపారాలు ఏదో వ్యక్తికి విశదాలై ఉంటాయి. పిండితార్ధమేమంటే, వ్యక్తిత్వం ప్రకటమైనవాడు, తలపుల ఉనికినీ, వాని అనుపూర్వాలనూ ఎఱిగినవాడుగా గోచరిస్తాడు.
ఆ వ్యక్తియే “అహం”- జీవాత్మ. దానినే జనులు సామాన్యంగా “నే”నని పలుకుతారు. ” నేను ” అనగా విజ్ఞాన మయకోశము, ‘నేను ‘కు తొడుగే కాని, అసలు ‘ నేను ‘ కాదు.
ఇంకా కొనసాగిస్తే, మరొక ప్రశ్న ఎదురౌతుంది. *” ఈ నేనెవరు? ఎచ్చటనుండి ఈ భావన? అది నిద్రలో లేదే?” అది తోచినదే తడవుగా నిద్ర, కలగానో, మెలకువగానో మారిపోతుంది. కల మాట అటువుంచుదాం. మెలకువలోని ఈ ” నేను ” ఎవరు? నిద్రలో అది జనించి ఉంటే, దాన్ని అవిద్య కప్పి ఉంటుంది. అట్టి అప్రాజ్ఞమగు ” నేను “ను వేదాలూ, విజ్ఞులూ ప్రస్తుతించరు. వారి ” నేను ” నిద్రకునూ ఆవలిది. నిద్రలోనూ, కలలోనూ, ఆ అవస్థా లక్షణాలు లేకనే, ఉంటూ ఉన్న ” నేను” ఇప్పుడూ, ఇక్కడే ఉండవలెను. ఈ మూడవస్థలకు ఆవలి ఆశ్రయంగా, ఆనందమయ కోశాన్నీ దాటి ఈ “నేను ” ఉండనేవలె.
సారమేమంటే, ఈ ” నేను ” పంచకోశాలకునూ ఆవలిది. అనాత్మ వస్తువును సర్వమునూ పరిహరింపగా, మిగిలిన వెలిగే ” నేనే ” సచ్చిదానందము. అని భగవాను వివరించారి. (శ్రీ రమణభాషణములు)
జగదంభా మా కోశములు మేము దాటలేము. నీవు మమ్ము చెయ్యి పట్టి మమ్మల్ని దాటించి ఆ ఆత్మతత్త్వమైన నేను ను చూపు అని ప్రార్థిస్తే నిజస్వరూపం తెలుస్తుంది.