జిల్లేళ్ళమూడి వెళ్ళిన వారికి అమ్మ భోజనం పెట్టడం అనుభవమే. నేటికీ ఆ అన్నదాన మహాయజ్ఞం సాగుతూనే ఉంది.
ఎవ్వరు వచ్చి అమ్మ ముందు భోజనం చెయ్యమని చెప్పేది.
అక్కడ లేని వారికీ, దూరాన ఉన్న పరమభాగవతోత్తములకూ కూడా అమ్మ అన్నం పెట్టేది. అది మనకు తెలియదు. అది విశ్వరహస్యం. అమ్మ మరి విశ్వజనని కాబట్టి, ఆమె తన బిడ్డలందరికీ భోజనం పెట్టేది.
అమ్మ లక్ష్మ మందికి ఒకే బంతిలో భోజనం చేస్తూంటే చూడాలని ఉంది అని కదూ అంది.
గోపి అన్న భక్తుడు “అమ్మా! ఇంటింటా నీవు కాదా అందరికీ అన్నపూర్ణవై అన్నం పెడుతున్నది. నీకు ఈ వింత కోరికేంటి?” అన్నాడు.
అమ్మ “నాన్నా! నేను పెడుతున్నానని నీకు తెలియటానికే” అన్నది.
అలా తెలిసేది కొద్దిగానే. తెలియక అమ్మ విశ్వాన్ని నడిపిస్తోంది కదా.
రాజు అన్న భక్తుడు తొలినాళ్ళ నుండి అమ్మ తో ఉండేవాడు. అతను మితం తినేవాడు.
అమ్మ ఆ రోజులలో ఒక్కోసారి అమ్మ మూడు నాలుగు కంచాల అన్నం సిద్ధం చేసుకొని, పెద్ద పెద్ద ముద్దలు కలిపి రాజు జుట్టు పట్టుకొని ముద్దలను నోట్లో కుక్కేది.
ఆ కుక్కటం రాజు మాటలలో “ దీపావళికి తయారు చేసే మతాబులలో మందు దట్టించినట్లుగా” అమ్మ నోట్లో కుక్కేది. అలా మూడు కంచాల అన్నం non-stop గా తినిపించేది. అప్పుడు అమ్మ దృష్టి అలౌకికంగా ఉండేది. ఎక్కడో చూపుండేది.
అలాంటి సమయాలలో “అమ్మా! నా ద్వారా ఎవరికో పంపుతున్నావు కదా” అని రాజు అంటే అమ్మ మాయ కప్పేది.
“నాన్నా! నీవు తింటున్నావు రా! తింటున్నది నీవు. ఎవరికో పంపటమేమిటి? పిచ్చి అభిప్రాయాలు పెటుకోకు. “ అనేసేది. అంత తిన్నా తిన్న తరువాత రాజుకు భుక్తాయసము ఉండేది కాదు.
విశ్వ రహస్యాలను నడిపి అమ్మకే అసలు విషయం తెలుసు. ఈ లీల కూడా మన భక్తి శుద్ధమై, మనము పరమ జనని పాదాలు విడవకుండా ఉండటానికే.
అమ్మా! నీవు తప్ప మా స్వాత్మను చూపగలరువారు ఎవరు? మా ఆకలి తీర్చగలవారేవరు?