1.మున్నెమ్మ అంధురాలు. వృద్ధురాలు. ఆమె తిరువన్నాపురములో ఉండేది. ప్రతిరోజు కష్టం మీద చేతి కర్ర సాయంతో కొండ ఎక్కి వచ్చి భగవాను రమణుల దర్శనము చేసుకునేది.
విరూపాక్షగుహలో ఉండేవారు భగవాను అప్పుడు.
ఆమె నెమ్మదిగా వచ్చి అక్కడి వారిని అడిగేది “భగవాను చూశారా నన్ను?”
“చూశారమ్మా!”
అలా చెప్పాక భగవానుకు నమస్కారాలు తెలిపి వెళ్ళిపోయేది. ఎప్పుడూ ఏమీ అడిగేది కాదు.
ఒకరోజు ఆమె వచ్చినప్పుడు భగవాను ఆమెను తన వద్దకు తీసుకురమ్మనారు.
ఆమె ను భక్తులు భగవాను వద్దకు తీసుకువచ్చారు.
ఆమెతో భగవాను “అమ్మా నీవు అంధురాలివి. పైగా వృద్ధురాలివి. ఇంత శ్రమకోర్చి రోజు వస్తున్నావు ఈ కొండ పైకి. నీవు చూడనుకూడా చూడలేవు నన్ను…” అన్నారు జాలితో కూడిన ప్రేమతో.
ఆమె భగవానుకు నమస్కరించి “భగవాను! నేను చూడలేను. నిజమే. కానీ నీవు చూడగలవు కదా నన్ను రోజు. అది చాలు నాకు. నీవు నన్ను చూసిన ఉత్తరక్షణము నుంచి నాకు ఇక కష్టమే లేదు…” అన్నది.
ఎంత లోతైన భావన. ఎంత ధృడమైన భక్తి.
అది కదా పరాభక్తి. ‘జగదంబా నా కోశాల మలినము నేను శుభ్రపరచలేను. హృదయ ధౌర్భల్యము తీసెయ్యలేను. కాని నాకు తెలుసు సర్వత్రా సర్వము నీవున్నావని. నన్ను కాచుకుంటున్నావని’ అని మనము మననము చేసుకోవాలి
మనందరికీ ఆ భావము స్థిరపడాలి తరువాతే కదా ఆత్మదర్శనము కలిగేది.