“నాకు శిష్యులు లేరు శిశువులే” అన్న అమ్మ అమృతమూర్తి. అమ్మ చాలా సార్లు “భర్త అంటే భావన” అని చెప్పేది. ఆ భర్త భావన మనస్సులో ఉన్నంత కాలము భర్త భౌతికంగా లేకపోయినా స్త్రీని వికృతరూపిణిగా చెయ్యకూడదని అమ్మ చెప్పేది.
అమ్మ ఒక సందర్భంలో “బిడ్డ పుట్టిన 11 వ రోజు పేరు పెడతాము. గాజులు కాటుక పూలు ఇవ్వన్నీ పెళ్ళికి ముందు ఉన్నవే. అసలు వాటిని ఎందుకు తీసెయ్యాలి? మంగళసూత్రాలు తీసేసినంత మాత్రాన కుటుంబంతో పోదు కదా. అలాగే మంగళకరమైన చిహ్నాలు తీసెయ్యనక్కల్లేదు” అని.
అమ్మ భక్తురాలు బాల అమ్మ చిన్ననాటి స్నేహితురాలు కూడా. అమ్మతో కలసి ఆడుకున్నది. తరువాత అమ్మ పాదాలు చేరి భక్తురాలిలా సేవించినది.
ఆమెకు చిన్నతనమునే వివాహం, భక్తి, నోములు. ఎన్ని నోచినా ఆమె తన భర్తును కూడా పూజించేది.
ఆమెకు స్త్రీలకు మాంగల్యము ఎంతో పవిత్రమైనదన్న బలమైన నమ్మకం.
ఆమెకు తన డెభై రెండవ ఏట భర్త వియోగం కలిగింది. ఆమె భర్త ప్రకృతిలో కలిసే రోజునే అమ్మ వద్దనుంచి ఆమెకు కుంకుమ అందింది కూడా.
ఆమెకు అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి కాని భయపడి ఏమీ చెప్పలేదు, చెయ్యలేదు.
కాని ఆరు నెలల తరువాత ఆమెకు కలలో అమ్మ కనపడింది.
సింహాసనారూఢ అయి, సువాసినులు సేవిస్తుండగా దర్శనమిచ్చింది.
భక్తురాలైన బాల వద్దకు వచ్చి కుంకుమ ఇచ్చి “ఇది పెట్టుకొని, మాకు పెట్టు” అన్నది.
“అమ్మా నాకార్హతలేదు “ అన్నది భయపడుతూ బాల.
“నీకు కుంకుమ పంపాను. ఎందుకు పెట్టుకోలేదు. పితృదేవతలకు ఒక రోజు మానవులకు ఒక సంవత్సరం. నీకు ఆరు నెలలు అక్కడ సగం రోజేలే. అన్నీ పెట్టుకో…” అన్నది అమ్మ.
అమ్మ ఇచ్చిన మనోధైర్యంలో ఆమె అమ్మ చెప్పినట్లుగా నడుచుకుంది.
అమ్మ ఆజ్ఞ కాదనగలవారు లేరు. అదీ కాక అమ్మ చెప్పినదే అసలైన వేదం. అమ్మ పలుకులు వేదం కదా. వేదం గానం చేసేదంతా ఆ జగదంబ గురించి. మధ్య లో వచ్చిన ఆచారాలలో లోపాలు సరిచెయ్యగలవారెవ్వరు అమ్మ తప్ప?
“జగదంబా! నీవు సర్వానుల్లంఘశాసనవి.
నీ పదములనాశ్రయించిన వారికి దారి చూపే చుక్కానివి.” అని అమ్మను శరణువేడటం మన కర్తవ్యం.
జయహో మాతా!!