కృష్ణస్తు భగవాన్ స్వయమ్’… కృష్ణుడే పరమతత్త్వం… చరమ లక్ష్యం..
ఏ పరతత్త్వమును వివరించటానికి భాష చాలదో… సర్వ భాషలకు అందని మౌనములో తప్ప అర్థం మనకు తెలియదో…కేవలం ప్రేమ ద్వారా మాత్రమే అందుకోగలరో ఆ పరతత్త్వమే శ్రీకృష్ణ తత్త్వము. కృష్ణుడు ఒక యుగానికి చెందినవాడనో, లేక,చరిత్రలోనో, పురాణాలలోనో, కావ్యాలలోనో చదివే నాయకుడనుకోవటం అజ్ఞానానికి గుర్తు. శ్రీ కృష్ణుడు సర్వత్రా వ్యాపించిన పరతత్వమే.
మనము ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతూ, ఇంకా తెలుసుకోవలసినది ఎంతో మిగిలి ఉండటమే కృష్ణతత్త్వము.
బాలకృష్ణుడి చేష్ఠలను, భాగవతాన్ని ఎందరో ఆస్వాధిస్తారు. కొందరు ఆయనలోని భగవద్తత్త్వాన్ని ఆరాధిస్తారు కొందరు ద్రౌపది, కుంతి, విధుర భక్తివలె ధ్యానిస్తారు. మరెందరో ఆయనను ఒక వ్యక్తిత్వ వికాస నాయకుడంటారు. ఇంకొందరు గీతాచార్యుడుగా కొలుస్తారు. చాలా మంది ఆయనను పరిపూర్ణ జ్ఞనమని సేవిస్తారు. ఇంత చేసినా ఆయన పూర్తి తత్త్వము తెలసినవారెందరు?
గృహస్తువులకు బాలచేష్ఠలతో మురిపించినా, గోపికలకు వేణునాధంలో మైమరపించినా, పాండవులకు సఖ్యుడై సలహాలిచ్చినా, గీతాచార్యుడై ప్రపంచానికి బోధచేసినా, భక్తులకు దైవమై రక్షించినా… కృష్ణతత్త్వం ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది.
నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’ అన్నాడు అక్రూరుడన్నా…
‘అటువైపు కృష్ణుడున్నాడు… ఇటువైపు ఎవరున్నారు’ అని సంజయుడు హెచ్చరించినా… అవన్నీ పరమాత్మ విరాట్‌రూపాన్ని విశదీకరించే ఉదాహరణలే…
క్రియ, బోధ కలగలిసిన అద్భుత తత్త్వం ఆయనది.
సమస్త భువనాలను తనలోచూపు తన నిజతత్త్వం ఆనాడే చూపాడు స్వామి.
“ఆ లలితాంగి గనుంగొనె
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్ (భాగవతము 10.1.340)”
ఆయన గోపికలతో చేసినది లీల. గోపికలది నిష్కామభక్తి. వారంతా జీవాత్మలు. శ్రీకృష్ణుడు పరమాత్మ. జీవాత్మ, పరమాత్మతో ఏకీభావానికై తపిస్తుంది.
ఇవ్వన్నీ ఒక ఎత్తైతే సాధకులకు శ్రీకృష్ణ తత్త్వం ఏమి ఉపదేశిస్తున్నది? అని ప్రశ్నించుకుంటే…సమాధానము పరమ సులభం. జీవికి కావలసిన తుట్టతుద సాధనే కృష్ణతత్త్వం.
సాధకులకు ఉపాసనలో ఎంతో ఉత్కృష్టమైనది కృష్ణసాధన.
అందునా రాధారాణితో కూడిన కృష్ణుడు యుగళ సాధన అత్యంత్య అపూర్వమైనది.
రాధా అంటే ధార.అది రసధార.
మానవుని జీవిత సాపల్యం ఆనందమని తైతిరీయం చెబుతుంది. అందులో అత్యంత ఉన్నతమైనది బ్రహ్మానందము. అదే ఆత్మానందం. అదే ముక్తి. ఆ ముక్తి రాధాకృష్ణుల సాధనలో సాధకుడు పొందగలడు.
సాధకుని చిత్తములోని ముడులను(బ్రహ్మ గ్రంధి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథు) విడదీసి, హృదయంలోని రసగంగనే ప్రేమనుపెంచి, మూలాధారంలో ఉన్న కుండలినితో కలవటమే రాధారాణి తో కూడిన కృష్ణ సాధన.
అదే కాళీయమర్ధనగా చెబుతారు.
కాళీయుడు మూలాధారంలో నున్న కుండలినే. కృష్ణుడు చెట్టు పై నుంచి జలంలోకి దుమకడం అన్నది కృష్ణసాధనలో కృష్ణుడు సహస్రారం నుంచి ప్రవేశించి మూలాధారంలోని కుండలిని పై అడుగుపెట్టటం. అలా కుండలిని జాగృతి అయిన సాధకునికి జగమంతా ప్రేమమయం. అందరూ కృష్ణాంశతో కనపడతారు. వారి అనాహతం వ్యాపించి సర్వులలోని పరమాత్మను శుద్ధ చైతన్యంలా చూడగలరు. వారికి అటువంటి స్థితిలో వేణునాధం వినపడుతుంది. అదే జీవనాధం
ఆ జీవనాధం వినటమే ముక్తి. అంది విన్నవారికి కృష్ణసాన్నిధ్యం అనగా ఈ జననమరణ చట్రం నుంచి విడుదల లభిస్తుంది.
కృష్ణునికై తపించే అంతరంగము శుద్ధి చెందుతుంది. శుద్ధమైన అంతఃకరణానికి మాత్రమే రాధాకృష్ణ తత్త్వమర్థమవుతుంది. అది పరిపూర్ణతత్త్వం. బృందావనముకు అధికారిణి రాధారాణి. ఆమే పూర్ణ శక్తి స్వరూపిణి.
భూలోకంలోని రాసమండలంలో ఉద్భవించినది. రాసమండలమంటే శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించిన వర్తులాకార స్థలము. దీని అంతరార్థము రాధాకృష్ణులు కేవలము రసమయ స్వరూపులు. వారి రస తత్త్వము అనురాగ జన్యమైన ఆనందము. భూమిపై అవతరించిన శ్రీకృష్ణుడు రాధయందు గోపికల యందు మానవాతీతమైన అనురాగమును కలిగించినాడు. రాధారాణి రస భూమిక బృందావనం.
బృందావనాన్ని ఆశ్రయించి, ఆ రసాన్ని గ్రోలేవారు రస యోగులు. రసమంటే బ్రహ్మానందం. కృష్ణ సహిత రాధారాణి ఉపాసన వలన కలిగేది బ్రహ్మానందం. తాద్యాత్మకత కలిగించే అనుభూతి రసం. బ్రహ్మాన్ని చూపించే రసమే నిజమైన రసం. నిజమైన సాధన. బ్రహ్మం మంటే పరమాత్మనే.
శ్రీకృష్ణరాధల యుగళం సాధన అంటే, ఇది శక్తి సహితంగా పరమాత్మను ఆరాధించటము.
రాధారాణి-కృష్ణస్వామి కేవలం ఆనందం స్వరూపము. సాకార నిరాకార రూపమే రాధారాణి కృష్ణస్వామి.
సాధకుడు సిద్ధి పొందినప్పుడు కలిగే సంతోషమే రాధారాణి కృష్ణులు.
చంద్రుడికి వెన్నెలలా రాధకు కృష్ణుడు ఉంటారు. వారిరువురిని విడదియ్యలేము.
మరో మాటగా చెప్పాలంటే శ్రీ కృష్ణుని అనుగ్రహమ స్వరూపమే రాధారాణి. పరమాత్మపై తపన కలిగిన సాధుకునికి ఆయన అనుగ్రహం దక్కుతుంది. ఆ అనుగ్రహమే ఆయన ప్రేమ. ఆ ప్రేమే రాధారాణి స్వరూపము.
ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము.
ఇక్కడ భక్తి ప్రేమలను భగవత్పరము చేయడమే ముక్తి మార్గము. గోపికలు ఆతని వంశీగానము విని ఆత్మానంద భరితులై ఆ కృష్ణ తత్త్వంలో మునకలు వేశారు.అమాయకులైన గోపాలకులు ఆయన స్నేహములో మోహావిష్టులై తరించారు. నేటి కాలానికి కావలసినది కూడా ఇదే పరతత్త్వము.
కృష్ణుడు జన్మించినప్పుడే యోగమాయ కూడా జన్మించింది. అందుకే కృష్ణుని నమ్మి కొలిచిన వారికి ఈ జీవితంలో ఉన్న మాయ నుండి విడుదల లభ్యమగుట తధ్యం.
జీవితం అసలు సత్యాలు తెలుసుకోవటానికి, పారమార్థ రహస్యాలు అర్థమైయి జీవితాన్ని అర్థం అవగాహన కలగాలంటే మహామాయ తొలగించబడాలి.
మన చుట్టూ ఆవరించిన మాయను తొలగించుకున్ననాడు, సర్వత్రా ఉన్న పరమేశ్వర తత్త్వం అవగతమవుతుంది. అంతటా పరమేశ్వరుడే ఉన్నాడని, వేరైనది లేదని తెలిసిన నాడు మనకు బేధభావము తొలిగి, పృధ్విపై శాంతం వెల్లవిరిస్తుంది.
కాబట్టి కృష్ణ ఆరాధనతో మహామాయను జయించి పరమపురుషుడైన ఆ స్వామి చరణాలలో ఐఖ్యమవ్వచ్చు. ఆ పనికి ఈ శ్రావణబహుళ అష్టమికి మించి మంచి ముహుర్తమేముంది ?
శ్రీకృష్ణశరణం మమ!!
సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ
తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు॥
మనందరికీ కూడా….
జన్మాష్టమి శుభాకాంక్షలతో💐🙏🏽🙏🏽