అమ్మఆలోచనలు
“నోటికి రెండు ధర్మాలున్నాయి ఒకటి తినటం. రెండు శబ్ధం చెయ్యటం” అన్నది అమ్మ.
మానవులమైన మనం నోటిని దేనికి వాడుతున్నాము?
ఆ శబ్దాలు ఎటు వంటి శబ్దాలు?
పరమాత్మను పంచేంద్రియాల ద్వారా కూడా సేవచెయ్యాలని గురువులు చెబుతారు. అదే భాగవతము కూడా చెబుతుంది.
మనందరము భగవంతునికి షోడష లేదా పంచ ఉపచారాలు చేస్తాము.
పుష్పం, పత్రం, దీపం, ధూపం, నైవెద్యం. ఇవే కదా.
ఇది మనకు తెలిసిన పూజ. కాని భాగవతము చెప్పే పూజ, అదే ప్రహ్లాదుుకు కూడా చెబుతున్నది-
అది చేతులతో పువ్వులు సమర్పిస్తాము (కమాలాక్షు నర్పించు కరములు కరములు)
కన్నులతో దేవదేవుని రూపాని చూస్తాము. లేదా చూసేదంతా ఆ పరమాత్మ వివిధ రూపాలన్న భావన చెయ్యటం. భగవంతుని నామాన్ని పలకటం లేదా పలికేది సర్వం ఆ స్వామి గురించే అన్న ఎరుక కలిగి ఉండటం. వాసన ద్వారా ఆ స్వామి పూలు విభూది ఇత్యాదివి తలవటం లేదా సర్వం ఆయన వాసనగా ఆఘ్రాణించటం.
ఇలా పంచ ఇంద్రియాలతో ఆ దేవదేవుని అర్పిస్తూ ఆ భావనలో బ్రతకటం సాధకులగా/ మానవులుగా మన ధర్మం.
ఇందులో ముఖ్యంగా నోరు. మాటలు, ఆలోచనలు మనము జాగరూకతో చూసుకోవాలి పరిశీలించుకోవాలి.
ఆలోచనలకు కూడా కర్మలుంటాయి అన్నది తెలిసిన విషయమే.
పరమాత్మను ఆలోచనలలో సదా ఉంచుకోవటమే సాధన. లేకపోతే భాగవతంలో చెప్పినట్లు “వైకుంఠుని పొగడని వక్రంబు వక్రమే డమఢమధ్వనితోడ ఢక్కగాక”
అమ్మ సదా భక్తులకు తన మాములు మాటలతో ఎంతో జ్ఞానము వేదాంతము చెప్పేది.
అమ్మ తన మాటలు పదాలకు కూడా తను తల్లినని చెప్పేది. స్వర్ణోత్సవ వేడుకలకు పుస్తకం తయారు చేస్తూ కొన్ని మాటలు తీసివెయ్యాలని భక్తులు అనుకున్నారు.
“ఎందుకు నాన్నా?” అని అడిగింది అమ్మ. భక్తులు మౌనం వహించారు. ఆ మాటలు అమ్మ ప్రతిష్ఠను తగ్గిస్తాయని వారనుకున్నారు. అమ్మ అప్పుడు వాళ్ళతో “తల్లికి నలుగురు కొడుకులు. ముగ్గులు బాగా వృద్ధిలోకి వచ్చారు. ఒక్కడు అంత గొప్పగా రాణించలేదు. మరి ఆ తల్లి ఆ నాలుగోవాడు తన కొడుకు కాదంటుందా?” అని అడిగింది.
తరువాత అమ్మ నెమ్మదిగా “ఆ మాటలు కూడా నా పిల్లలేగా…” అన్నది.
భక్తులు మౌనంగా ఉండిపోయారు. తరువాత వారు ఏ మాట వదలలేదు.
అమ్మ చాలా సార్లు “తోలునోరు కాదు తాలు మాట రాదు” అనేది.
అమ్మ నోటి వెంట మాట వస్తే, అది బ్రహ్మ రాత కన్నా కచ్చితమే. బ్రహ్మ రాత మారుతుంది కాని అమ్మ మాట మారదు. అమ్మే పరమేశ్వరి కాబట్టి.
ఒక చిన్న ఉదాహారణ: అమ్మను దర్శించిన ఒక భక్తుడు తన గ్రామానికి వెళ్ళాలనుకున్నాడు. అది జిల్లేళ్ళమూడికి ప్రక్కనే. వెళ్ళటానికి అరగంట కన్నా పట్టదు.
వెళ్ళే ముందు అమ్మ అనుమతి కోసం వచ్చాడు.
అమ్మ “ఈ రోజు వద్దు. రేపు వెళ్ళు. ఈ రోజు బయలుదేరితే గంటలు గంటలు పడుతుంది…” అన్నది.
అతను పట్టించుకోలేదు.
“లేదమ్మా ఈ రోజే వెళ్ళాలి. పని ఉంది…” అన్నాడు.
“ఈ రోజు పని మొదలవదు నాన్నా. రేపు ఉదయం బయలుదేరు…” అన్నా వినలేదు.
“సరే ! తిని వెళ్ళు నాన్నా!” అన్నది అమ్మ.
“ఇంటికి పోయి తింటాను!” అన్నాడు భక్తుడు.
అమ్మ “సరే. మజ్జిగన్నా తీసుకుపో!” అన్నది ఇక ఆ భక్తుడు కాదనలేక మజ్జిక తీసుకు బయలుదేరాడు. అతను బయలుదేరిన వెంటనే వాన విపరీతంగా పడి కాలువలు పొంగి అతను సాయంత్రానికి గాని చేరలేకపోయాడు. తీరా ఇల్లు చేరితే, ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంటి వారు బాపట్ల వెళ్ళారు. ఆ వరదలకు ఎవ్వరు బయటకు రాలేదు. తిండి కూడా లేకుండా వరండాలో అమ్మ ఇచ్చిన మజ్జిగ త్రాగి పడుకున్నాడు ఆ భక్తుడు. మరుసటి రోజు పని మొదలుపెట్టాడు.
అమ్మ అన్న “తోలినోరు కాదు తాలు మాట రావటానికి” అన్న మాట గుర్తు చేసుకున్నాడాయన.
మనది తోలు సంచి(శరీరం). దీనిని చూసి మనము సర్వం ఇదేనని నమ్మి నానా రకాల కర్మలూ చేస్తున్నాము. నలుగురము చేరి పరుల గురించి చెడ్డగా మాట్లాడటము, చెడు ఆలోచనలు చెయ్యటము అజ్ఞానానికి గుర్తు.
దీనికి విడుగుడు ఎలా అని ఆలోచిస్తే, భగవంతుని నామం పట్టుకోవటమే.
మన నోటి నుంచి వచ్చే మాట, చేసే చేత మనసులో ఆలోచన సైతం శుద్ధంగా ఉంచుకోవటం మన కనీస బాధ్యత. అందుకే భగవన్ నామ చింతన చేసి, నామ పారాయణం చేసి, నామాన్ని వింటూ నామం పట్టుకు తరిద్దాం.
“అమ్మా! మేము తోలు వాహనాన్ని చూసి మురిసే అజ్ఞానులము. నీ నామముతో మాకు జ్ఞానభిక్ష పెట్టి స్వస్వరూపాన్ని చూస్తే భాగ్యం మివ్వు” అని ప్రార్థిద్ధాము.
జయహో మాతా!