అమ్మఆలోచనలు
సంసారము లంపటమని అంటారు పెద్దలు. సుఖభోగాల పై ఆసక్తి, పేరు ప్రతిష్టలపై మక్కువ, తమతర బేధాలు సంసారులకు సామాన్య లక్షణాలు.
ఆధ్యాత్మిక సాధనకు ఇవి అడ్డంకులని, సంసారము వదిలి పోవాలని లేకపోతే సాధన మృగ్యమని మనకో నమ్మకము కూడా ఉంది.
అంటే సంసారులకు, గృహస్తుకు తరించే మార్గమే లేదా?
గృహస్తు సమాజానికి ముఖ్యమైన వారు కదా. వారే సమాజానికి వెన్నెముక, ముఖ్యాధారం. వారు సర్వసంగ పరిత్యాగం చెయ్యటము సులభం కాదు. మరి తరించటానికి సంసారులకు అడ్డంకులుంటే మార్గమేమిటన్న ప్రశ్న అనాధిగా ఉన్నది. కలవరపరుస్తుంది కూడా.
దానికి సమాధాన సులభంగా అత్యంత అద్భుతంగా చెప్పారు శ్రీ రామకృష్ణ పరమహంస.
“పడవ నీళ్లలో ఉండవచ్చు కాని పడవలో నీరు ప్రవేశించరాదు. సాధకులు సంసారంలో ఉండవచ్చు కాని అతనిలో సంసార లక్షణాలు నెలకొన రాదు” అని చెప్పేవారు గురుదేవులు.
మళ్ళీ వారే ఇలా చెబుతారు “కర్తవ్యాలను నిర్వహించు. కాని మనస్సు మాత్రం భగవంతుని మీద నిలుపు. భార్య పిల్లలతో ఆత్మీయుడవై ఉండు. మనస్సులో మాత్రం నీవారు ఎవరూ కారని ఎరిగి ఉండు. భగవంతునిపై భక్తి కలిగి ఉండు. లేకపోతే బంధాల్లో ఇరుక్కుపోతావు.” అంటూ ప్రబోధించేవారు గురుదేవులు.
ఇందుకు ఉదాహరణగా మహేంద్రనాథ్ గుప్తా జీవితాని చూపేవారు. మా అని పిలవబడే వీరు ప్రసిద్ధ “గాస్పెల్స్ ఆఫ్ రామకృష్ణా” పుస్తక రచయిత. వీరే రామకృష్ణ జీవుతచరిత్ర వ్రాసినవారు.
మనస్సులో సంసారం తొలగించి భగవత్ చింతనలో గడపటం వీరికి బాగా తెలుసు. గురుదేవులు చెప్పినది యధాతదంగా రాసుకొని, తదనంతరం చదువుకొని మననం చేసే వారు.
ఇదే శ్రవణ మనన నిధిదాస్యం. ఇది వేదాంతములో చెప్పబడిందే.
మరింత సులభంగా మనకు వివరించిన వారు అమ్మ.
జిల్లేళ్ళమూడిలో వెలసిన అమ్మ కూడా ఇదే చెప్పేది.
చేసేది అంతా ఆ భగవంతుని పని యని చేస్తే అంతా సుగతే అన్నది అమ్మ. ఇంటి పనులు, పిల్లల పెంపకం, వంట సర్వంలో భగవంతుని సేవగా తలిస్తే చేసేది అంతా పరమాత్మ సేవే.
జీవితమే ప్రసాదమవుతుంది.
చేసే పని పరమాత్మదని మనము కేవలము ఆయన సేవకులమన్న ఎరుక కలిగి ఉండటమే. ఇదే గీతలో భగవానుడు చెప్పినది కూడా.
ఆ భావన తెచ్చుకోవాలి గాని సర్వం త్యదించాలనుకోవటం గృహస్తు ధర్మం కాదని మనకు గురువులు బోధించారు.
ఈ మార్గం అనుసరించి మనమూ ఆ జగన్మాత చరణాలను పట్టుకొని గృహస్తులుగా ముక్తి పొందుదాం. దానికి తగ్గ మనఃస్థితి కూడా ఆ తల్లే ఇవ్వాలి. ఆమెను అ స్థితికై ప్రార్థిస్తూ
జయహో మాతా!!
(Photo:వాత్సల్యాలయంలో అమ్మ)