మేము అట్లాంటా రాక పూర్వం సైప్రస్ లో ఉండేవాళ్ళము. అదో చిన్న దీవి/దేశం.
అందమైన ఆ దీవిలో భారతీయ మిత్రులలో కొందరు నాతో చాలా ప్రేమగా ఉండేవారు. వారిలో దీపిక ఒకరు.
దీపికను మొదట నేను చూసినప్పుడు నన్ను ఆకర్షించినది ఆమె చెవుల నుంచి పొడుగ్గా వ్రేలాడుతున్న బంగారు గొలుసులు. ఎర్రటి యాపిల్ పండులా ఉండే ఆమె, ముద్దులొలికే వారి పాప మా అందరికీ చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె చెవి గొలుసులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు. నేను ఆమె ఫ్యాషన్ దృష్టికి ఆశ్చర్యపడి “చాలా బావున్నాయి నీ చెవి గొలుసులు” అని మెచ్చుకున్నాను.
“ఇవి మా వివాహం గుర్తులు. నాకు వివాహమైనదని ధరించాను. నీ మంగళసూత్రాలలా” అన్నదామె.
అలా మొదటిసారి నేను కాశ్మీరు దేశపు వివాహ చిహ్నాలను చూశాను. అలా మొదటిసారి ఎక్కడో దక్షిణభారతదేశపు నేను, కాశ్మీరు సంస్కృతిని తెలుసుకున్నాను.
దీపిక, రంజన్ టిక్కులు మాకు మంచి మిత్రులు.
మా నల్లటి జంట వారి ప్రక్కన మరింత నల్లగా కనపడేవారనుకుంటా. కాని వారికలాంటి తేడాలుండేవి కావు. చాలా మిత్రభావంతో మెలిగేవారు.
దీపిక తల్లి శ్యామాజీ కొంత కాలము వారితో వచ్చి ఉంది. ఆమె పరమ సౌజన్యముర్తి. ప్రేమమయి. సాయిబాబా భక్తురాలు.
నన్ను ఎంతగానో అభిమానించిన, ప్రేమించిన ఆమె హృదయం నాకు ఎల్లప్పుడూ గుర్తుకు వస్తుంది. ఆరోజులలో గురువారాలు ఆమె తప్పక నా దగ్గరకు వచ్చేది.
నేను చేసే భజన, సాయి పూజ ఇష్టంగా చూసేది. బాబా పాదాలు గల పోటో ఆమె పూజలో ఉండేది. అది నాకు బహుమతిగా ఇచ్చిందామె. నాకో చిన్న వెండిగిన్నె ఇచ్చి అందులో బాబాకు నైవేద్యం పెట్టమనేది. నేను పెట్టే ఇడ్లీలు, దోశలు వాళ్ళకెంతో ఇష్టం.
మంచి కాశ్మీరు భోజనం నేను వారింట్లోనే తిన్నాను. ఎన్నో కాశ్మీరు వంటకాలను కూడా నేను వాళ్ళ వద్ద నేర్చుకున్నాను.
శ్యామాజీ దగ్గరే నేను మొదటి సారి కాశ్మీరు పండితుల మీద దౌర్జన్యాలు గురించి విన్నాను. ఆమె ఒక రాత్రి తన పిల్లలతో కలిసి ఢిల్లీ కి వచ్చేయ్యటము, అక్కడ అప్పటికే బాగా సెటిల్ అయిన వారి బావగారి ఇంట నివసించటము కథలుగా చెప్పేది. అలా చెప్పేటప్పుడు ఆమె కన్నీరు పెట్టకోవటం కూడా కద్దు.
వీళ్ళు ఢిల్లీ వచ్చేశాక చాలా మంది ఊచకోత కొయ్యబడ్డారని, దాని విషయం ఎవ్వరూ మాట్లాడరని వాపోయేది ఆమె.
ఇవ్వన్నీ నిన్న కాశ్మీరు ఫైల్స్ సినిమా చూసిన తరువాత మళ్ళీ గుర్తుకు వచ్చాయి.
భారతదేశములో నానా విధాల వారు ఉన్నారు. ఎందుకో కొన్ని సంఘటనలకు వచ్చిన పాపులారిటి కొన్నింటికి రాదు. కాశ్మీరు హిందువులకు జరిగిన అన్యాయం గురించి ఎవ్వరూ నేటికీ పెదవి విప్పరో అర్థంకాదు. ఎంతో శాంతికామకులైన ఒక మతం వారిని హింసించటము, వారిని కొన్ని లక్షల మందిని చంపి నదిలో విసిరెయ్యటము, ఇలాంటి ఊచకోతను హేయం.
ఈ విషయం గురించి, ప్రభుత్వం, నాయకులనే వారు, రకరకాల వాదాలవారు, ముఖ్యంగా మానవహక్కుల కార్యకర్తలు నిమ్మకునీరెత్తినట్లుగా ఉండటం కన్నా నీచం, హేయం లేదు.
మతం ఎంత వ్యక్తిగతమైన వ్యవహారమైనా, దాని నడివీధులకు లాగిన వారిని ఇప్పటికీ న్యాయస్థానాలకు పట్టుకు రాకపోతే ప్రజాసామ్యానికే సిగ్గు.
కొందరు మేధావుల రంగు కడిగి అసలు రంగు చూపిన చిత్రమిది.
ఎన్నో వేల సంవత్సరాల ఒక జీవన విధానాన్ని ప్రపంచ పఠం నుంచి దూరం చెయ్యాలనే కొందరు కుహానా లౌకికవాదులు, స్వార్థరాజకీయనాయకుల కుళ్ళు ఇది.
ఈ సినిమా వల్ల కాశ్మీరు హిందువుల వైపుకు మనందరి దృష్టిని మళ్ళించిన దర్మకులకు జోహార్లు.
ఇప్పటికైనా మనం మేలుకొని న్యాయం కోసం సంఘటితం కాకపోతే మనకు మానవులుగా చెప్పుకునే హక్కు ఉందా?