సుందరకాండ -సాధన – అంతరార్థం
“మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం॥
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి॥”
సుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చి ఉంటుదన్న విషయం నిరుడు విచారం చేసుకున్నాము. సుందరకాండ కేవలం రామాయణంలో ఒక కాండ మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకున్న విజ్ఞానం. ఇది కేవలం బ్రహ్మ విద్యే. సుందరకాండను అనుసంధానం చేసుకొని తరించిన భక్తులున్నారు. వారు సుందరకాండ ఒక్కటే అనునిత్యం పారాయణం చేసుకుంటారుట. అందుకే రోజూ ఒకటో రెండో సర్గలన్నా చదువుకోమని పెద్దలు చెబుతారు.
ఇందులో మాములు అర్థ సౌంద్యం శబ్ధ, రస సౌందర్యములో నిలిచిపోతే కేవలం శ్రోతగా మిగులుతాము. కాని లోలోపలి అర్థాలకై విచారించి, అంతరార్థలను గమనించుకుంటే బ్రహ్మాన్ని పట్టుకోగలం. రాముడు పరబ్రహ్మం, సీత జీవాత్మగా చెబుతారు. హనుమ వాయునందనుడు. ఈయనే జీవాత్మను పరమాత్మను అనుసంధాన పరిచే ఆచార్యులు. ఇలా ఒక భావముతో సుందరకాండ చదువుతారు. అంతేనా అంటే కాదు సుందరకాండ కేవలం కుండలినీ యోగం అన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ విషయాలని సవివరంగా పరిశీలిద్దాం…
సుందరకాంత మొదటి శ్లోకం-
“తతో రావణనీతాయాః సీతాయా శ్శత్రుకర్శనః
ఇయేష పద మన్వేష్టుం చారణాచరితే పథి॥”
అర్థం: ‘తరువాత శత్రువులను కృషింపచేయగల హనుమ రావణునిచే తీసుకుపోబడిన సీత యొక్క స్థానం అన్వేషించుటకు చారుణులు సంచరించు ఆకాశమార్గంన వెళ్ళవలెనని సంకల్పించెను.’
ఈ శ్లోకము చదినంత మాత్రాన కోరిన కోరిక తీరుతుందిట. ‘ఉమా సంహిత’లో శివుడే స్వయంగా అమ్మవారికి చెబుతాడు. ఇందులో మొదట ప్రయోగించినబడిన శబ్ధం “తత్”. ‘బ్రహ్మ విద్య’ ఎలా మొదలవుతుందో అలా మొదలవుతోంది ఈ శ్లోకము. బ్రహ్మవిద్య “అథాతో బ్రహ్మ జిజ్నాసు” అని ఎలా మొదలవుతుందో అలా ‘అతః’ అన్నా ‘తతో’ అన్నాఅదే అర్థము. బ్రహ్మవిద్యకు సాధకుడు మొదట అర్హత సంపాదించుకోవాలి.
ఆ అర్హత ఏమిటి?
“శత్రు కర్శనః”. అంటే, శత్రువులను కృశింపచేయువాడు. ఎవరు ఇక్కడ? “హనుమ”.
కాని హనుమ అప్పటి వరకూ ఏ శత్రువును నశింపచేయలేదుగా? అని మనకు సందేహం కలుగుతుంది.
భగవద్గీతలో కృష్ణుడు అర్జుననుకు “జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్” “పట్టునకు దొరకని కామమనెడు శత్రువును చంపు!” అని ఉపదేశిస్తాడు.
భగవంతుని తెలుసుకోవటానికి ప్రతిబంధకమైన శత్రువు కాముము ఒక్కటే.
ఆ శత్రువును జయించిన తరువాతే గురువు కాగలడు. అతనే శత్రుకర్శనుడు. బ్రహ్మవిద్యకు అధికారమేమంటే “శత్రుకర్శన”!!
సాధకునికి శత్రువు ఇంద్రియములు. ఇంద్రియములను నిగ్రహించుకొని సాధకుడు సాగాలి. అలా విద్యను సంపాదించుకునేందుకు అధికారము పొందుతాడు.
“తతో” అటు పైన, ఆ అధికారము సంపాదించుకున్న తరువాత, బ్రహ్మం తెలుసుకోవాలనుకుంటాడు. బ్రహ్మం అంతటా ఉన్నదే. కాని తెలియకుండా పోయింది. హనుమ శత్రుకర్శనుడు. కాబట్టే ఆచార్యుడు కాగలడు.
అట్టి గురువు శిష్యుని కాపాడకలడు. ‘ఇయేష’ అంటే సంకల్పించటం. హనుమ, సీత ఉన్న చోటు తెలుసుకోవటానికి సంకల్పించాడు.
సీత అంటే జీవుడు ఇక్కడ. శరీరమనే కర్మక్షేత్రంలో ‘బుద్ది’ అన్న నాగలితో త్రవ్వితే దొరికే ఆత్మ ‘సీత’. ఆ సీత రావణునిచే తస్కరించబడింది.
“రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః” అన్న ఉత్పత్తి వల్ల “నేను, నాది” అని పలికించే వివేకంలేని మనస్సు రావణుడు. అనగా అహంకారమే రావణుడు.
ఆ అహంకారం ఆత్మను శరీరంలో బంధించింది. అంటే ఆ పరమాత్మ నుంచి కామమోహితమైన మనసు ఆత్మను శరీరంలో మరుగున పరిచింది.
ఇంద్రియాలను జయించిన గురువును శరుణు వేడితే ఆయన ఆ ఆత్మను వెతుకుతాడు.
‘చారణ చరితే’ అన్నాడు ముని. చారణులు చరించే మార్గంలో అని అర్థం. చారణులు అంటే పూర్వఋషులు. వారు చూపిన మార్గమే గురువు చూపుతాడు. కొత్త మార్గం కాదు. ఆ మార్గం అనాధి నుంచి ఉన్న మార్గమే.
గురువుల బోధించిన పద్దతిలో సాధకుడు సాగి ఆచరిస్తే, అజ్ఞానముచే కప్పబడిన బ్రహ్మవిద్య జాడ తెలుస్తుంది యని అర్థము.
అంతర్రిందియాలనూ, బహిర్రింద్రియాలనూ నిలవరించిన సాధకుడు బ్రహ్మవిద్యకు అధికారము సాధించి, అజ్ఞానముచే కప్పబడిన జ్ఞానమైన బ్రహ్మమును గురువుల సహాయముతో తెలుసుకుంటాడని ఈ శ్లోకానికి గూడార్థము.
హనుమ సాధకునిగా కూడా మనకు మార్గనిర్దేశ్యం చూపుతాడు. భరవంతుని చేరవలసిన సాధనాలను చూపుతాడు.
మొదటి శ్లోకంలో హనుమను గురువుగా, సాధకునిగా కూడా ముని ప్రతిపాదించాడు. సాధకుడు సదా ప్రతిశ్వాసలో మంత్రాన్ని అనుసంధాన పరచుకొని తాను మంత్రస్వరూపుడే కావాలి.
ఈ సర్గను పరిశీలిస్తే సాధన లేదా యోగం అవలంబించే మునుపు సాధకుల చెయ్యవలసినవి చూపుతాడు ముని. చేతులు కదలకుండా బిగించటము, నడుము సన్నం చెయ్యటము, పాదాలు వంచటము, మెడను కుంచించటము, ప్రాణాలు బిగపట్టుటం మొదలైనవి మనకు యోగం చెయ్యటానికి సిద్ధమవుతుండుగా సాధకుల అవస్థలవి.
హనుమ ఇలా శరీరాన్ని సన్నద్ధం చేసి “రామబాణంలా వాయువేగంతో రావణుడు పాలించే లంకకు పోతాను. అక్కడ సీత కనపడకపోతే స్వర్గానికి పోతాను” అంటాడు.
అంటే సాధకులు అనుకున్న పని (ఆత్మను దర్శించటము) అనేది లక్ష్యంగా సాగాలి. అదీ రామబాణంలా సాగాలి. రామబాణం ఎక్కుపెడితే ఆగదు. అలా సాధకులు ఉండాలి.
ఉపాసకుడు, ఆత్మ-శరీరం వేరన్న జ్ఞానం మొదట పొందాలి. ముందు శాస్త్ర రీతిన చెప్పిన విధులు అవీ నిర్వహించాలి. అన్నీ వదిలి(నిత్యకర్మలు వంటివి) సాధన కాదని చెప్పటానికే హనుమ ముందు సూర్య, వాయు, వరుణులకు వందనాలు అర్పించటము.
సాధకులకు యమనియమాలు ఉండటం గురించి సూచనే భుజాలు వంచుట, చెవులు నిటారుగా ఉంచుట ఇత్యాదివి. యోగాభ్యాసము గురించి హెచ్చరిక. ఈ యోగాభ్యాసనలో ప్రాణాయామము ముఖ్యం. భ్రూమధ్యంలో చూపు నిలపటం, కుంభకములో ప్రాణం నిలపటం, రేచకం మొదలైనవి. “రురోధ హృదయే ప్రాణాఊర్థ్లం ప్రణిహితేక్షణః”, “పద్భ్యాం దృఢ మవస్థానం కృత్వా” పాదాలతో గట్టిగా పట్టి ఆసనం మొదలైనవి. ఇలా యోగం ద్వారా లోనున్న రాజస, తామస స్వభావాలను తొలగించి మనసున సాత్త్విక భావన ఏర్పుచుకోవటం సాధకులకు అవసరం. ఇది శరీరం లోపల తాపం మొదలవటానికి సహాయపడుతుంది.
సముద్రలంఘనంలో హనుమకు విఘ్నపరంపరలు ఎదురవటం, జ్ఞానసాధకులకు పెక్కు ఆటంకాలు ఎదురుకావటం సహజం. సంసారమన్న సముద్రం దాటటానికి సాధకుడు వవ్యసాయాత్మకమైన బుద్ధి ఉండాలి. అంటే, అన్ని కర్మలు(పనులు) ఏకముఖం చేసి, ఆత్మజ్ఞానానికి భగవంతుని ప్రాప్తికి పూనుకోవాలి, అంటే సంకల్పించాలి.
అలా సంకల్పించి గట్టి పట్టుదలతో యమనియమాలతో సాగగా, సత్కారాలు దొరుకుతాయి. సాధకుడు ఆ సత్కారాలను పూజలను తిరస్కరించాలి. హనుమ సముద్రలంఘనములో తొలుత మైనాకుడు పర్వతమై నిలచి తన వద్ద విశ్రాంతి తీసుకు వెళ్ళమంటాడు. మైనాక అంటే నా స్వర్గం. సాధకులకు పురోగమించటకుండా అడ్డంకులు ఈ ప్రలోభరూపాలు. హనుమ వల్లదని సాగుతాడు. సాధకుడు కూడా తన లక్ష్యం వైపు సాగాలి. ఈ సత్కారాలకు ఆగితే సాధకుడు పడిపోతాడన్నది ఇక్కడ హెచ్చరిక.
సాధకులు శాస్త్రం చెప్పిన కర్మలను విడవరాదు. ఆ కర్మాచరణ వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అదే హనుమ సాగుతుండగా అడ్డు వచ్చిన సురస. ‘సు’ అంటే మంచి ‘రస’ అంటే ఆనందం ఇచ్చునది. ఆమె దేవతా స్త్రీనే. నాగ కన్య. నాగ అంటే నిశ్చయాత్మకమైన బుద్ధిని భంగపరుస్తుంది. ఆమె సుఖాలను కలిగిస్తుంది. ఈ సురాగాల వలన సుఖమైన జన్మాంతరవాసనలు కలుగుతాయి. తనని కాదని సాగరాదన్న నియమం చెబుతుంది సురస. కర్మలాచరించాలి కాని వాటిచే బంధింపబడకాడదన్న హెచ్చరిక కూడా ఉంది.
సాధకులు కూడా శాస్త్ర హిత కర్మలు చెయ్యాలనటం ఇదే. హనుమ ఆమె చెప్పినట్లుగానే తెలివిగా చేసి ఆమె అనుగ్రహం పొందుతాడు. అలాగే సాధకుడు కూడా ప్రలోభాలకు లొంగక కర్మాచరణను భగవంతునికి అర్పించట ద్వారా అనుగ్రహం పొందాలన్న భావం ఇందులో చూపుతున్నాడు ముని.
తరువాత హనుమ ఛాయాగ్రాహిణి సింహిక ద్వారా వేగం కోల్పోతాడు. సింహిక విహితకర్మలకు సూచన.
శాస్త్రకర్మలు ఎలా ఆచరించాలో సాధకుడు విహిత కర్మలు అలా వదిలివెయ్యాలి. ఇవి నిషిద్ధకర్మలు. హనుమ సముద్రయానం అంటే సాధకుడు ఆత్మ కోసం అన్వేషణ. అందు సాధకులు చెయ్యవలసినవి, చెయ్యకూడనివి హనుమకు మధ్యలో కలిగిన ఆటంకాలు ఈ నాలుగు లక్షణాలు సాధకులకు తప్పక ఉండాలని సూచన ఉంది. ఆ నాలుగు ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఈ నాలుగు ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తాయి.
అన్ని తెలుసుకొని దేనీకి భయపడక సాత్త్వికగా ఉండటం ధృతి. సత్కార్యాలు అంగీకరించక సాగటం. విహితకర్మలు చెయ్యటం, నిషిద్ధకర్మత్యాగం అన్న లక్షణాలును సాగరం దాటటంలో హనుమ చూపాడు. సాధకుడు సంసార సాగారాన్ని దాటటానికి ఈ లక్షణాలను గ్రహించాలి.
హనుమ సముద్రం దాటి లంక చేరిన తరువాత నూరు యోజనాలు చాలా సులువుగా దాటానని అనుకుంటాడు. సాధకులు కూడా ఆసనం పై ప్రాణాయామాదులు చేసి లేచిన తరువాత శరీరం కాని మనసు కాని బడలిక చెందరాదు. అలా అలసట పొందనంత కాలం సాధన చెయ్యాలి. నూరుయోజనాల దూరం అన్న మాటలో కూడా సంకేతం ఉంది. తత్త్వం బట్టి నూరు భగవతత్త్వం, జీవతత్త్వం, ప్రకృతితత్త్వం సూచిస్తుంది.
అలాగే లంకలో కేవలం నలుగురు మాత్రమే ప్రవేశించగలరు అని హనుమ తలుస్తాడు. ఆ నలుగురు అంగదుడు, నీలుడు, హనుమ, సుగ్రీవుడు.
లంక శరీరానికి గుర్తు. శరీరంలోనికి ఆత్మాన్వేషణ కై ప్రవేశించటానికి ఎవరికి సాధ్యమవుతుంది?
ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉంటాయి. వీటిని బహిర్ముఖం నుంచి లోపలికి తిప్పాలి. దానికి నామసంకీర్తన మొదటి పని. ఏదో ఒక నామం ఆశ్రయించి మనసును భగద్విషయము వైపు ప్రసరింపచెయ్యాలి. ‘అం’ అంటే భగవంతుడిని ‘గద’ అంటే కీర్తించువాడు. అంగద అంటే నామసంకీర్తన చేయువాడు. నీలుడు అగ్నిహోత్రుడి పుత్రుడు. సాధకుడు అగ్నిహోత్రం వంటివి ఆచరించాలి. ఇది ఆత్మతత్త్వం, భగవత్తత్త్వాన్ని దర్శింపచేస్తాయి. హోమం, దానం వలన మనసులో మాలిన్యాలు తొలుగుతాయి. హనుమ వాయుపుత్రుడు. హనుమ మంత్రానికి గుర్తు. మంత్రం జపించటము వలన, మననం చెయ్యటం వలన పరమాత్మ స్వరూపం గ్రహించే అవకాశం కలిగిస్తాయి. నాలుగు సుగ్రీవుడు. సుగ్రీవుడు వేదాధ్యయన సంపన్నుడు. ఇంద్రియాలకు తెలియనిది తెలియపరుస్తుంది వేదం. వేదాద్యయనం వలన ఆత్మ పరమాత్మల దర్శనం కలగుతుంది. ఈ నలుగురూ లంకలో ప్రవేశించగలరు. ఈ నాలుగు విధుల ద్వారా ఆత్మను సాధకుడు దర్శించగలడు.
***.
హనుమ రాత్రి వరకూ ఆగి లంకలోకి ప్రవేశించాలనుకుంటాడు. రాత్రి అంటే బాహ్యమైన రాత్రి కాదు. ఎదురుగా ఉన్న వస్తువు కనపడకపోవటమే రాత్రి. ఎదురుగా ఉన్న వస్తువు ఆత్మ. ఆ ఆత్మను దర్శించలేకపోవటమే రాత్రి.
భగవద్గీతలో రాత్రి గురించి, “యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః” అని చెబుతాడు భగవానుడు. అంటే సర్వభూతాల ఏది రాత్రో అది యోగులకు రాత్రి కాదు. సర్వభూతాలూ ఎప్పుడు మోల్కొని ఉంటారో అప్పుడు యోగికి రాత్రి. యోగికి శరీరం అనిత్యమని తెలుసు. శరీరం, ఆత్మ వేరు వేరని తెలుసు. లౌకికమైన విషయాలకు పట్టదు. కనుక లౌకికవిషయాలకూ రాత్రి, యోగులకు రాత్రి కాదు. యోగులకు రాత్రి లౌకికులకు కాదు. రాత్రి వేళ లంకా నగరంలోనికి వెళ్ళటమంటే విషయభోగాల వారు ఆత్మ విముఖులై ఉన్నప్పుడు హనుమ నగర ప్రవేశం జరుపుతాడు. అంటే ఆత్మాన్వేషణలో శరీర భావం ఉండదు.
లంకా నగర దేవత కాలానికి గుర్తు. లంకను తిప్పితే కాలమే.
లంకలోకి ప్రవేశించటానికి పిల్లి సైజులోకి హనుమ మారిపోయాడు. పిల్లియంతే ఎందుకు? అంతకన్నా చిన్న జంతువులేదా?
పిల్లి ‘అద్భుతదర్శిని’. చీకటిలో చూడగలదు. ఆత్మ అద్భుతమైనది. అంటే ఆత్మదర్శనం అంటే అద్భుతం కదా.
సీతాన్వేషణ సమయంలో చంద్రుడు గురించి వర్ణణ మూడుసార్లు కనపడుతుంది. మాడు సార్లే ఎందుకంటే శ్రవణ, మనన, నిధిద్యాసనకు గుర్తు. సుందరకాండలో ముఖ్యమైనవి సీత అన్వేషణ, దర్శనం, విరోధనిరసనం. హనుమ వెతికి, అమ్మను దర్శించి ఆమెకు విరోధులైన వారిని చంపుతున్నాడు.
ఆత్మను అన్వేషించి, దర్శించి భగవత్పాప్తి కొరకు ప్రతిబంధకమైన పాపాలను నశింపచేయ్యాలి.
రావణుడు మనస్సుకు గుర్తు. పది తలలు పది ఇంద్రియాలు. ఇంద్రియాలు నిద్రలో ఉపశమిస్తాయి. కాని మెలుకువలో అవి లోకవ్యాపారం చేస్తాయి.
సీత ఉన్న వనం అశోకవనం. శోకం లేని వనం అశోకం. రాత్రి కొంచం మిగిలి ఉండగా సీతను చూస్తాడు హనుమ. ఆత్మ దర్శనం తదనంతరం జన్మపరంపరలు ఉండవు. అంటే రాత్రి జన్మలకు గుర్తు. ఆ పరంపరలు మిగిలినవి కూడా పోతాయని గుర్తు రాత్రి ఎక్కువ లేదని భావన.
రావణుడన్న- మనస్సు. కామము అంటే కోరికలు ఉన్న వారిని మనస్సు బంధిస్తుంది. ఆ కోరిక విష్ణువు అంటే పరబ్రహ్మం వైపు తిప్పితే మనస్సు బంధించదు ఆత్మను. అదే సీతా సంభాషణలో చెబుతుంది.
హనుమ కేవలం ఒక కోతో, లేకో దూతో కాక కేవలం ఆచార్యునిగా, గురువుగా జీవాత్మను పరమాత్మను అనుసంధాన పరిచే గురువుగా మనకు సందరకాండలో కనపడుతాడు. అంతరార్థంతో సుందరకాండను విచారం చేస్తే తప్పర బ్రహ్మం గురించి అవగాహన కలుగుతుందనటంలో సందేహం లేదు. సుందరకాండ ఈ చైత్రమాసం పారాయణం చెయ్యటం అనాధిగా ఉన్నదే.
సీతా మహాసాధ్వి కేవలం జగన్మాత. ఆమెనే కుండలినీ శక్తిగా విచారించటం కూడా ఉంది. ఇప్పటికే ఈ వ్యాసం నిడివి బట్టి ఆ విషయం మరో సారి చర్చించవచ్చు. సద్గురువుగా హనుమను ధ్యానిస్తే ఆత్మ దర్శనం తద్వారా పరమాత్మతో అనుసంధానం తప్పక కలగగలదు.
ఈ రామనవమికి ఎల్లరకు శ్రీరామును పరిపూర్ణ కటాక్షం కలగాలి. సాధకులకు హనుమ అండ సదా లభించాలని కోరుతూ-
“నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ,
దేవ్యైచ తస్యై జనకాత్మజాయై,
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో,
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥”
ఽఽ స్వస్తిఽఽ
ఉపయుక్తగ్రంధములు
సుందరకాండ తత్త్వవిచారం –
సుందరకాండ – డా. మైలవరపు శ్రీనివాసరావు
సుందరకాండ – తత్త్వవిచారం – శ్రీభాష్ష అప్పలాచార్యస్వామివారు
షోడశి – గుంటూరు శేషేంద్రశర్మ
One Comment Add yours