ఆది శంకరుల ప్రాతఃస్మరణ స్తోత్రం:

ఆది శంకరుల ప్రాతఃస్మరణ స్తోత్రం:

శంకర భగవత్పాదుల సాహిత్యం విసృతమైనది.  

వారి సాహిత్యాన్ని మూడు విధాలుగా విభాగం చేస్తారు. 

మొదటి శ్రేణిలో ప్రస్థానత్రయానికి భాష్యాలు ఉంచబడ్డాయి. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లను కలిపి ప్రస్థానత్రయం అంటారు. వీటికి భాష్యాలను, అనగా వివరణను శంకరులవారు రచించి జన ప్రాచుర్యం చేశారు. అందుకే మనకు బ్రహ్మసూత్రాలు నేటికీ లభిస్తున్నాయన్నది సత్యం.

రెండవ శ్రేణిలో నిలబడేవి ప్రకరణగ్రంథాలు. ఇవి వివేకచూడామణి, ఆత్మబోధ, తత్వబోధ, అపరోక్షానుభూతి, మనీషాపంచకం, ఉపదేశపంచకం, ప్రాతఃస్మరణ స్తోత్రం ఇత్యాదివి వస్తాయి.

మిగిలిన స్తోత్రసాహిత్యాన్ని మూడవ శ్రేణిగా చెబుతారు.

స్తోత్రాలలో కూడా దక్షిణామూర్తి స్తోత్రం, లక్ష్మీకరావలంబ స్తోత్రం వంటివి ప్రకరణలోకే వస్తాయి.

ప్రకరణలు వేదాంతాన్ని చూపుతూ బ్రహ్మతత్వమైన ఆత్మను ఆవిష్కరిస్తాయి. అద్వైతాన్ని విశదపరుస్తుంది. 

సగుణసాకారాన్ని కొలవటానికి భౌతికమైన వస్తువుల అవసరం ఉంటుంది. నిర్గుణ పరబ్రహ్మను కొలవటానకి ధ్యానమే మార్గం. దానినే ఉపాసన అంటారు. ఉపాసనన్నది మానసికమైనది. మానసికమైన ఉపాసనకు సాధకుడు చేరుకుంటే తప్ప అద్వైతం అనుభవంలోనికి రాదు. అంతటా ఉన్న పరంబ్రహ్మలో తనూ ఒక తునక అన్నది అవగతం కాదు. 

ముందు సగుణపరబ్రహ్మకు భౌతిక పూజల వంటివి చేసినా, సాధకుడు ధ్యానంతో అంతర్ముఖత్వం వైపుగా అడుగులు వెయ్యాలి.

 ఉదయం నిద్రలేచినదాదిగా సాధకుడు ఈ విషయం మరువక సాధన చెయ్యాలి. ఉదయం నిద్రలేవటం సహజంగా జరిగినప్పుడు మనస్సు పరమ శాంతంగా ఉంటుంది. ప్రవృత్తులలో ఉన్నట్లుగా నిద్రలో కూడా సాత్విక, తామస, రాజస నిద్రలు ఉంటాయి.

కలత నిద్రలు, కలలతో కూడిన నిద్రలు తామస, రాజస నిద్రలు. 

భోగాసక్తి, బద్ధకం, పనుల ఒత్తిడి, ఇత్యాదివి తామస, రాజస నిద్రలకు కారణమవుతాయి. నిద్రకు ఉపక్రమించే కొద్ది ముందుగానే పనులను పూర్తి చేసుకొని, కొంత ధ్యానం చేసి నిద్రకు ఉపక్రమిస్తే ఆ నిద్ర సాత్విక నిద్రగా మారుతుంది. 

రాత్రి పడుకునే ముందు ధ్యానం చేసి పడుకొని, ఉదయం మొదటి పనిగా ధ్యానం చేసుకుంటే నిద్ర పూర్తిగా ధ్యానంగా పరిగణించబడుతుంది. దీనిని ప్రత్యేహారన్యాయం అంటారు.

రాత్రి చివరి ఆలోచన పరమాత్మదై, ఉదయం తొలి ఆలోచన పరమాత్మది అయితే ఆ నిద్ర పూర్తిగా ధ్యానంగా పరిగణించబడుతుంది. నిద్ర నుంచి లేచింది మొదలుగా  పరమాత్మలో ధ్యానం ధ్యాస ఉంచటమన్నది సాధకులకు అవసరం. పూర్వం నిద్ర నుంచి లేవగానే “కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యై సరస్వతీ, కరమూలేః గోవిందా ప్రభాతే కరదర్శనం” అని చదువుకుంటూ లేచేవారు. 
కాని ఇప్పుడు లేవగానే మొబైల్ చూసుకుంటూ, సోషల్‌మీడియాలో మెసేజులు చదువుకోవటం సర్వసామాన్యమైయింది. మొబైల్ చూడటంతో సర్వ విశ్వ సంసారం నెత్తిన పడి, ఆందోళనగా లేవటం, అరక్షణం కూడా ప్రశాంతత అన్నది లేకపోవటం జీవిత విధానంగా మారింది. లేవగానే ఫోను వంటివి చూడక, మెలుకువ వచ్చిన తరువాత మొదటి ఆలోచనగా భగవన్నామం తలచి అలాగే లోలోపలికి ఆలోచనా రహితంగా ఉండగలిగితే క్షణకాలం మనస్సు చలనం లేక ఉంటుంది.  అది పరమాత్మానుభూతిగా ఆచార్యులు చెబుతారు. అటువంటి పరంబ్రహ్మానుభూతిని సదా అనుభవంలో కలిగిన వారు యతులు, హంసలు, పరమహంసలు. 

శంకరులు అందించిన అద్వైత ప్రకరణాలలో ప్రాతఃస్మరణ స్తోత్రం అత్యంత ఉత్తమమైనది. 

ప్రాతః స్మరణం కాబట్టి ఉదయం నిద్ర లేవగానే చదువుకోవాల్సినది. అందుకే ఇది కేవలం మూడు శ్లోకాలుగా ఉంది. ప్రతి శ్లోకంలో శంకరులవారు ఆత్మతత్వాన్ని నింపి అందించారు.

ఇది చదివి అర్థం చేసుకొని ప్రతి ఉదయం సాధన చెయ్యటం వలన సాధకులు పరబ్రహ్మ తత్త్వాన్ని గ్రహించగలరు. 

ప్రాతఃస్మరణ స్తోత్రం:

1. ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం

సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ |
యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః  || ౧ ||

సచ్చిదానంద రూపమగు మహాయోగులకు శరణ్యం, మోక్షమిచ్చు ప్రకాశవంతమైన ఆత్మతత్వాన్ని ప్రాతఃకాలములో నా మదిలో స్మరించుచున్నాను. జాగృత్, స్వప్న, సుషుప్తి మరియు తురీయం అన్న స్థితులుంటాయి. మెలుకువలో ఉన్నప్పుడు మానవులు మనుసు చేత బానిసలై తిరుగుతారు. నిద్రలో వారికి కలలతో కూడిన నిద్ర, గాఢనిద్ర అన్నవి ఉంటాయి. కలలో మనస్సు కదులుతూ ఉంటుంది. అందుకే కలలన్నవి వస్తాయి. వీటిని దాటి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఆత్మ పరమాత్మలో మమేక్యమై తన నిజ స్థితిలో ఉంటుంది. (కొన్నిసార్లు గాఢనిద్రలో ఉన్నవారిని లేపితే వారు తత్తరపడి వారి ఉనికి గుర్తురాక కంగారు పడటం మనం చూస్తాం). ఏ బ్రహ్మ స్వరూపం స్వప్నం, జాగరణ, సుషుప్తి, తురీయం అన్న వాటిని తెలుసుకున్నదో నిత్యం భేదంలేనిదైన ఆ బ్రహ్మను నేనే. పంచభూత సముదాయం కాదు. (ఆత్మ పంచభూతాత్మకం కాదు. కేవలం శరీరం మాత్రమే పంచభూతాత్మకమైనది.)

2. ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ |
యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః
తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్  || ౨ ||

మనస్సుకు, మాటలకు అందని పరబ్రహ్మను ఈ ప్రాతఃకాలంలో సేవించుకుంటున్నాను. ఆయన అనుగ్రహం వల్లనే సమస్త వాక్కులూ వెలుగుతున్నాయి. వాక్కులు పరంబ్రహ్మను తెలుపలేవు. కన్ను సర్వం చూడగలదు కాని తనను చూసుకోలేదు. చెయ్యి అన్నింటిని పట్టుకోగలదు కాని చేతినే పట్టుకోలేదు. అలాగే వాక్కు పరంబ్రహ్మను చెప్పలేవు.  మాటలకందని మౌనం తో పరంబ్రహ్మను పొందవచ్చు.

వేదాలు “నేతి నేతి” అన్న మాటతో పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాయి. ఉపనిషత్తులు దేవుని గురించి చెప్పవు. ఏది దేవుడు కాదో “నేతి నేతి” (ఇది కాదు…ఇది కాదు) అని చెబుతాయి. జనన మరణాలు లేని దేవదేవుని అన్నింటి కన్నా గొప్పవానిగా పండితులు చెబుతున్నారు. 

3. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం

పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై  || ౩ ||

అజ్ఞానాంధకారం కంటే వేరుగా సూర్యుని వలె ప్రకాశించు పూర్ణస్వరూపు, సనాతనుడు అయిన పురుషోత్తముని ప్రాతఃకాలం భజించుచున్నాను. అనంత స్వరూపుడగు ఆయన యందు సర్వ జగత్తు తాడులో సర్పంలా కనపడుతోంది. 

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ||

ఈ శ్లోకాలను ఉదయమే ఎవరు పఠిస్తారో వారు పూర్ణులవుదురు.

దివ్యమైన ఈ స్తోత్రాన్ని సాధకులు ప్రతి ఉదయం పఠించాలి. పరబ్రహ్మను ఆలోచనలో పెట్టుకొని, మిగిలిన ఆలోచనలను రానియ్యక సాధన చెయ్యటం వేదాంతుల ధర్మం. ఉదయం మెలుకువ వచ్చిన క్షణం నుంచి, సంసారమన్న నీడను మనస్సు మీదకు తెచ్చుకోక, శాంతిలో లయించటం సాధన. అప్పుడే అసలైన బ్రహ్మాన్ని అందుకోగలరు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s