నిత్య పూజ ప్రాముఖ్యత
కొందరు పూజ చెయ్యనిదే ఉదయపు అల్పాహారం కూడా అంటరు.
అసలు ఈ నిత్య పూజ ఏమిటి?
దాని ప్రాముఖ్యత ఏమిటి?
ఆ విధి – విధానం ఏమిటి?
అన్న సందేహం మనకు తప్పక కలుగుతుంది.
ప్రతి దినం చేసే చేసే ప్రార్థనే నిత్య పూజ. పర్వదినములలో, ప్రత్యేక సందర్భాలలో చేసేది ప్రత్యేకమైన పూజ.
నిర్గుణుడు, నిరాకారి అయిన పరమాత్మని తలుచుకోవాటానికి, కొలుచుకోవటానికి మనకు వీలుగా వుండటానికి మన ఋషులు చూపించిన బహు చక్కని సులువైన మార్గం విగ్రహారాధన.
విగ్రహారాధన అన్నది మానవుడు – మహాత్మునిగా మారటానికి, తన జీవితం పండించుకోవడానికి, జీవిత పరమ లక్ష్యం తెలుసుకోవటానికి మొదటి మెట్టు.
సర్వం అంతటా నిండి ఉన్న భగవంతుని తలుచుకోవటానికి, సేవించుకోవటానికి- అతిసామాన్యమైన మనం, మన వీలు కోసం ఇచ్చుకున్న ఏర్పాటు విగ్రహారాధన. పరమాత్మ అంతటా నిండి వున్నా, అంతటా మనము పూజ, ధ్యానము అంతటా చెయ్యలేము కాబట్టి ఈ నిత్యపూజ, విగ్రహారాదన అవసరమైయ్యింది.
మన ఫామిలీ ఫోటోలు ఎలానో, వాటి అర్థం పరమార్థం ఏమిటో, పరమాత్ముని విగ్రహం కూడా అంతే!
మరి మన కిష్టమైన విగ్రహం తెచ్చుకున్న తరువాత ఎలా ఈ నిత్యా పూజ చెయ్యాలి? ప్రతిరోజూ చెయ్యాలా? అన్న ప్రశ్న వస్తుంది.
దానికి సమాధానం మనం ప్రతి దినం ఎలా మన పనులు చూసు కుంటున్నామో, అలానే నిత్య పూజ కూడా!. మన పిల్లలను ఎలా సాకుతామో అంతే ప్రేమగా భగవంతుని విగ్రహంలో ఆరాదించాలని పెద్దలు చెబుతారు.
నిత్యపూజ వలన మనలో భక్తి బలపడుతుంది. మనకు ఒక క్రమశిక్షణ వస్తుంది.
జీవితం మీద ఆశా దృక్పథం ఏర్పడుతుంది. మన ఉదయం ధ్యానం తో కూడిన నిత్యపూజ వలన రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చు.
తరువాత మనకు కలిగే సందేహము: ఈ నిత్యపూజ చేసే విధానం ఏమిటి అని.
పూజ ని షోడశోపచారములు, లేదా పంచోపచారములతో చేస్తారు.
ప్రతి దినం చేసే ఈ షోడశ పూజతో అహంకారం నశిస్తుంది. ఈర్షా, అసూయా, ద్వేషం వంటివి దుర్గణాలు మాయమవుతాయి.
శరీరానికి వ్యాయామం ఎలాగో, మనసుకు ధ్యానం అలాగు. ఈ ధ్యానంతో కూడిన షోడశోపచారముల తో పరమాత్మను అర్పించిన వారికి పారమార్థికమైన జీవితం తప్పక లభిస్తుంది.
మానవులలో ఉండ వలసిన స్వచ్ఛత ఏర్పడుతుంది. జీవితంలో కలిగే ఆటుపోటులతో మాయమౌతుంది. ఇవి కొన్ని మాత్రమే. ఎన్నో మార్పులను ఆ మానవులు పొందుతారు.
అయితే ఈ 16 ఉపచారముల ఏమిటి? ఈ సంఖ్య ప్రత్యేకత ఏమిటి? అని చూసినట్లయితే :
అమ్మవారిని పదహరు కళలుగా చెబుతారు. ఆ పదహారు కళలను ఉపాసించటము, పదహారు అక్షరాల అమ్మవారి మంత్రరాజము తో సేవించటము శ్రీ విద్యా ఉపాసనలో వున్నది.
పదహరు కళలలో మనకు చంద్రుడు కూడా కనపడుతాడు. దినమునకు ఒక విదముగా శుక్ల పక్షములలో తరుగుతూ, కృష్ణ పక్షములో పెరుగుతూ చంద్రుడు ప్రయాణిస్తూ ఉంటాడు.
పదహారవ సంఖ్యకు, మానవ జీవితానికి గొప్ప లంకె ఉన్నది.
మానవులకు జీవితకాలంలో చేయు వివిధ వేడుకలు, లేదా క్రియల మొత్తం 16. గర్భాదామం, పుంసావనము, శ్రీమంతము, జాతకర్మ, చోడకర్మ, చెవులు కుట్టించటం, ఉపనయనం, కేశకండన సమావర్తనము, అంతేస్టి ” మొదలైన వన్నీ 16. వీటికి సింబాలిక్‌గా 16 ఉపచారములు అనుకోవచ్చు.
మాములుగా మన ఇంటికి ఒక అతిథి వస్తే మనము వివిధములైన సేవలు చేస్తాము. ఆ వచ్చిన వారు ప్రియమైన వారైతే మరింత శ్రద్దగా వుంటాయి మన ఉపచారములు. మరి ఈ అండ పిండ బ్రహ్మాండాలని ఏలే ఆ పరమాత్మను పిలిస్తే ఎన్ని ఉపచారాలు చెయ్యాలి? ఎంత శ్రద్ధగా, భక్తిగా చెయ్యాలి? అందుకే ఈ షోడషోపచారములు.
ఉప అంటే దగ్గరగా, చారము అంటే సరితము, సేవ. దగ్గరగా వుండి సేవించుకోవటము -ఉపచారములు
అవి: ధ్యానము, ఆవాహనము, ఆసనము,పాద్యము, ఆర్ఘ్యాము, ఆచమనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవేతము, గంధము, పుష్పము, ధూపము,దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణ, నమస్కారములు. ఇవి షోడోశోపచారములు.
1.ఈ ఉపచారములు మరింత వివరముగా చెప్పాలంటే మన ఇంటికి, మన పూజా మందిరానికి రమ్మని “ధ్యానము” అన్నది ఆహ్వానము (Invitation) వంటిది. ధ్యానము వలన గురి కుదురుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
- ‘ఆవాహనము’ రమ్మని ప్రేమగా పిలిచిన భక్తుని వద్దకు భగవంతుడు, విదురుని గృహానికి వెళ్ళిన కృష్ణులా వచ్చేస్తాడు. ఆ స్వామిని స్వాగతించటము ‘ఆవాహనము’.
- ‘ఆసనము’. అలా వచ్చిన భగవంతునికి ఆసనము లో కూర్చుండబెట్టటము.
- పాద్యము: మరి వచ్చిన వారికి కాళ్ళు కడుతాముగా. అదే పాద్యము.
- ఆర్ఘ్యము : చేతులు, ముఖము కడగటము కై నీరు ఇవ్వటము.
- ఆచమనము: త్రాగటానికి నీరు ఇవ్వటము.
- స్నానము: స్నానముకై నీరు అందివ్వటము.
- వస్త్రము. : స్నానము తరువాత తడి తుడుచుకోవటము,నూతన వస్త్రాలు కట్టడము అన్నవి ఈ ఉపచారము.
- యజ్ఞోపవేతము: నూతన యజ్ఞోపవేతము సమర్పించటము.
10.గంధము.; సుగంధపూరితమైన గందము సమర్పంచటము. దీని మూలముగా భక్తుని మనసు నెమ్మదిస్తుంది.
11.పుష్పము: అధాంగ పూజతో , స్త్రోత్రం తో పుష్పములు, పుష్ప మాల సమర్పించటము.
12.ధూపము: సంపూర్ణమైన అనుగ్రహనికై ధూపము సమర్పించవలెను. - దీపము: భక్తుని హృదయములో, జీవితములో అజ్ఞానము తొలగి, సుజ్ఞానపు వెలుతురుకై దీపము వెలిగించటము.
- భగవంతునిది యథాశక్తి, ఫలమో, కాయో నివేదించటము ఈ సేవ.
- తాంబూలము: భోజనము తరువాత తాంబూలము వుంటుంది కదా.
- ప్రదక్షిణతో కూడిన నమస్కారము.
భక్తుల సౌలభ్యము కోసము వివిధ మంత్రాలను ఈ ఉపచారములలో వాడటానికి ఋషులు ఇచ్చారు.
శైవులు, శివున్ని ఆరాదించి వారు రుద్ర మంత్రాలతో ఈ ఉపచారములు చేస్తారు.
విష్ణువును ఆరాధించు భక్తులు పురుషసూక్తం,
శక్తి ఉపాసకులు శ్రీ సూక్తంతో, ఇలా వివిధ మంత్రాలతో ఆరాధన అమలులో వుంది.
ఎలాంటి మంత్రాలు రాని వారు వారికి వచ్చిన, నచ్చిన నామముతో కూడా ఈ ఉపచారములు చెయ్యవచ్చు.
భగవంతుడు తమ బిడ్డగా మారితే తల్లికి కలిగే ప్రేమతో ఎంత గారాబముగా చూసుకుంటారో అలా చూసికోవటమే ఈ ఉపచారాల వెనక ఉన్న అంతరార్థం.
పదహారు ఉపచారములు నిత్యము చెయ్యలేని వారు కనీసము ఐదు ఉపచారాలన్నా చెయ్యాలి. వాటినే “పంచోపచారములు” అంటారు. ‘గంధ పుష్ప ధూప దీప నైవేద్య’ములే అవి.
అయితే ఇక్కడ ఒక సందేహము వచ్చితీరుతుంది. అదేమంటే, సర్వత్రా నిండి వున్న పరమాత్మకు, సర్వము ఇచ్చే ఆ దేవదేవునికి మనము మళ్ళీ తెచ్చి ఇచ్చేదేమిటని?
గంధ పుష్ప ధూప దీపాలన్నీ పరమాత్మా సృష్టే. సర్వత్రా ఆయనే వున్నాడు. అంతటా నిండి వున్నాడు. మరి అలాంటి స్వామికి మన మిచ్చేదేమిటన్న సందేహము నిజ భక్తులకు కలగక మానదు.
అన్నీ ఆయనే ఇచ్చినా, వాటిని కూర్చి మన ప్రేమను భక్తి ని అద్ది తిరిగి భగవంతునకు అందిస్తే ఆ పరమాత్మ తృప్తి చెందుతాడు.
ఉదాహరణకు తల్లి ప్రేమతో పాలు, పంచదార కలిపి పాయసము చేసి పిల్లవాడికి పెడుతుంది. పిల్లవానికి పాయసము చెయ్యటము తెలియదు. రాదు. కమ్మని ఆ తినుబండారము తిన్నప్పుడు వాడికి కొంత తల్లికి తినిపించాలనే కోరిక పుడుతుంది. వాడు తల్లిని పిలిచి తన చేతులతో కొంత ఆమెకు తినిపిస్తాడు. పాయసము తియ్యని పదార్థమని తల్లి కూడా తినాలని తప్ప మరోటి తెలియని ఆ పిల్లవాడి ప్రేమ పూర్వకమైన పనికి తల్లి ఆనందముతో పొంగిపోతుంది. ఆమెకు ఆ చర్యలో పిల్లవాణ్ణి ప్రేమ తప్ప మరోటి కనపడదు. ‘నే వండునది నాకే పెడతావా’ అనదు తల్లి. పిల్లవాడు ఇచ్చినది సంతోషముగా తింటుంది.
అలాగే మనము పిల్లవాండ్లము. పరమాత్మ తల్లి వంటివాడు. అందుకే మనం శ్రద్దతో, చెదరని విశ్వాసంతో, మొక్కవోని నమ్మకంతో అను నిత్యం దేవదేవునికి ఉపచారములు చెయ్యాలి. అందుకే గృహస్తులను తరించటానికి ఈ నిత్యపూజ పరము సులభమైన మార్గమని చెప్పబడింది.
మానవులుగా జన్మించిన వారు ఈ నిత్యపూజ ద్వారా తరించగలరు.
సద్భక్తితో
సంధ్యా యల్లాప్రగడ.