స్వాద్యాయ సెంటరులో వారాంతరం గొప్ప సాహిత్య సమావేశాలు జరుగుతాయి.
ఆ సెంటరు నారపల్లిలో ఉంది. ఊరికి కొంత దూరంగా ఉన్నందునా, ఇంకా రణగోణధ్వనుల ప్రవేశం లేనందునా ఆ ప్రదేశంలో కొంత ప్రశాంతత నిలిచే ఉంది.
శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యులువారి గ్రంధాలయంలో నెలకొని ఉంది ఆ కేంద్రం. ఆ ప్రాంగణము చెట్లతో నిండి ఉంది. బయట వేడి లోపలికి రానియ్యని వృక్షసంపదతో పాటూ, ఆ ఇంటి గ్రౌండు ప్లోర్లే కావటం వలన వారి గ్రంధాలయం ఎంతో ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంది. ఎన్నో విలువైన పురాతనమైన పుస్తకాలతో పాటూ వారికి వచ్చిన షీల్డలతో ఆ ప్రదేశం ఒక గౌరవం సంతరించుకొని వాణీ ప్రభలతో వెలుగొందుతోంది.
ఒక్క ప్రక్క భగవాను రమణుల పోటో, మరో ప్రక్క అరబిందుల చిత్రపటము. ఆ ప్రక్కనే విశ్వనాథ సత్యనారాయణగారి పటము తగిలించి ఉన్నాయి.
పాత కాలపు బీరువాలు, అందులో సాహిత్య సంపద మనోహరంగా తోచాయి. అలాంటి చోట్ల స్వాధ్యాయ సమావేశాలకు సరి అయిన చోటు. సౌహిత్య సత్కళ సదా సాదరంగా సాగుతున్నది వాణి అనుగ్రహంతో ఆ చోట.
సంచిక ఎడిటరు గారు అక్కడి వారం వారం జరిగే కార్యక్రమాలను వివరాలు పంచుతూనే ఉన్నారు. భారతావనికి వచ్చింది మొదలు ఒక్క సమావేశం వెళ్ళటానికి కుదరకపోవటం మా దురదృష్టం.
కాని అమ్మ అనుగ్రహముంటే తప్పక అన్నీ కుదురుతాయి.
ఆషాడమాసాంతరం ఆ అదృష్టం కలిగింది. ఎడిటరు గారు ఈ నాలుగు పుస్తకాల గురించి సమీక్షలంటే కొంత మొహమాటమేసింది. నడిపించిన అమ్మవారిని తలుచుకోవాలి కాని ఉపాది నేందుకని. పైగా ఆ సమీక్షలు చేసే వారంతా లబ్ధప్రతిష్ఠులు. ఎన్నో విషయాలు తెలిసినవారు. ప్రాతఃస్మరణీయులు. వారు ముందు ఈ చిన్న గడ్డిపువ్వు చిందులేంటి? అని.
కాని ఎడిటరు గారి బలవంతం మీద ఆ రోజు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.
ఆ సమావేశం గురించి సంచికలో వారు ప్రకటించారు. మిత్రులతో ఆ విషయమే రెండు రోజుల ముందర పంచాము.
ఆషాడమాస చివరి రోజు బతకమ్మ ను పూజించే సమయం.
హైదరాబాదులో ఆ రోజు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున బతకమ్మల పండుగ సాగుతోంది. స్త్రీలంతా తమ తమ భక్తి కొలదీ, శక్తి కొలదీ బ్రతకమ్మలను చేసి పూజిస్తున్నారు.
ఉదయం వారు చెప్పిన సమయానికి ఉండేలా బయలుదేరాను. మేమున్న చోట నుంచి అరగంట ప్రయాణం. మా ప్రయాణం పొడుగునా బతకమ్మగా గౌరిదేవి దర్శనం కలిగింది. మేము చేరుకున్న ఆ ప్రదేశం అద్భుతమైన ప్రశాంతతతో స్వాగతించింది.
ఎడిటరుగారు హడావిడిలో ఉన్నారు.
పూజ్యలు కోవెల సుప్రసన్నాచార్యులు ఆరోగ్యం బాగా లేనందున రాలేకపోతున్నారని వారి ఆసీస్సులను పంపారు. వారు కార్తీకంలో కాశీయాత్ర సమీక్షరిస్తామన్నారుట.
సంచిక సోమశంకరుగారు గొప్ప అనువాద రచయిత. ఆయన “వడ్డించిన రుచులు- చెప్పిన కథలు” గురించి మాట్లాడారు.
శ్రీ హనుమంతరావుగారు దూరదర్శన్ లో పనిచేసి ఉన్నారు. తన అనుభవాలను వారు ఈ మధ్య లిఖితం చేసి అచ్చు వేశారు. వారు “నమామి దేవి నర్మదే” గురించి సమీక్షరించారు.
గౌరవనీయులు, గొప్ప పేరున్న రచయిత అయినా ఎంతో సాదాసీదా ఉండే తమిరిశ జానకి గారు “భారతీయ యోగులు” పుస్తకం సమీక్షరించారు.
ఇక “సత్యాన్వేషణ” ను ప్రాణ్యం దత్తశర్మగారు సమీక్షరిస్తామన్నారుట. కాని అవసరమైన పని మీద వారు వేరు ఊరు వెళ్ళవలసి వచ్చి తమ ప్రసంగ పాఠం పంపారు. దానిని వారు రికార్డు కూడా చేసి పంపారు.
వీటన్నిటినీ సమన్వయపరుస్తూ కస్తూరి మురళీకృష్ణ గారు కూర్పు చేశారు.
అమ్మ పొత్తూరు విజయలక్ష్మిగారు వారికి వచ్చిన పెద్ద కష్టం సైతం ప్రక్కన పెట్టి దీవించ వచ్చారు. వారిని నాలుగు పలుకులు పలకమని ప్రార్థిస్తే వారు తమ దీవెనలు పంచారు.
అక్కడికి మిత్రులు ఎంతో ప్రేమ చూపే నళినీ ఎర్రా గారు వచ్చారు. ఆమె అమ్మవారి భక్తులు. పూర్ణ దీక్షాపరులు.
ఆమెను పూర్వం రెండుమూడు సార్లు కలిశాను. వారికి కొంతకాలం ఆరోగ్యం బాలేదని మిత్రులు చెప్పారు. కస్తూరి మురళీకృష్ణగారు వారిని కూడా నాలుగు పలుకులు పలకమని అడిగారు.
నళిని ఎర్రా తన మాటలలో అమ్మవారిని ప్రస్తుతించి, తనకు మంత్రం వలన అమ్మవారి అండతో జీవితంలో సాధించినది చెబుతూ “నర్మదా పరిక్రమ” గురించి సంచికలో చదివానని చెప్పారు. వారికి అనారోగ్యం కలిగి చికిత్స సమయంలో అనుభవించిన ఓంటరితనము ఈ వ్యాస పరంపరలను తిరిగి తిరిగి చదువుతూ ఎదుర్కొన్నానని, క్యాన్సరు వంటి రోగాన్ని జయించానని, ఆ ధైర్యం అమ్మవారి వలన, నర్మదా పరిక్రమ చదవటం వలన కలిగిందని చెప్పుకొచ్చారు.
అంత వరకూ వక్తలు చెబుతున్నవి వింటూ ఆ ప్రజ్ఞ జగదంబ విభూదిగా తలుస్తూ అమ్మ ధ్యానిస్తున్న నాకు ఆమె చెప్పిన పలుకులు హృదయాంతరాలలో తగిలాయి. రచనా వాటి ప్రసారం అమ్మవారి కృపగా భావించి, ఈ ఉపాదిని ఎన్నుకున్నందుకు ఆ తల్లికి కైమోడ్పులు చెపుతున్నా, నళిని గారి మాటలకు భావోద్రేకం ఆగలేదు.
వారిని “అమ్మ నడిపిస్తున్న మరో అద్భుతం” అనవచ్చు. వారి భక్తి, వారి ధైర్యం ఒక ఎత్తు, ఇలా వచ్చి విషయం చెప్పటం మరో ఎత్తు.
వారే చెప్పారు “ఈ మాటలు ఎక్కడా చెప్పలేదు… FBలో కూడా రాయలేదు. సంధ్యకు కూడా తెలియదు. ఆమెను చూస్తూ మా అమ్మను చూసినట్లుగా ఉంటుంది. ఆమె రచనలు చదివి అమ్మవారి మీద భక్తితో చెబుతున్నా” అంటూ చెప్పుకొచ్చారు.
ఆమె మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచాయి. అమ్మవారి కృపకు ఆనందం కలిగించాయి. ఆమె మాట్లాడటం అయ్యాక ఆగలేక వెళ్ళి వారిని కౌగిలించుకున్నా. కన్నీరు ఆగదు. అవి ఆనందభాష్పాలు. జగదంబ అణుక్షణం ఆమె విభూతులను చూపుతుందండి. ఆమెను నమ్మటం మాత్రమే మనం చెయ్యగలం. ఆమె మనలను చెయ్యట్టుకు నడుపుతుంది. ఎప్పుడు ఓంటరి అనిపించదు. ఆమె స్పర్శ తగులుతూనే ఉంటుంది హృదయానికి.
ఎంత చెప్పాలి? ఏమి చెప్పాలి? జగదంబ గురించి!!
వేదాలే మూగపోయాయి అమ్మ గురించి చెప్పలేక. మానవమాత్రలం మనము చెప్పగలమా? కాని అమ్మ మీద ప్రేమ ఆగక చెబుతాము అవోఇవో. ఆమె తల్లి కనుక సంతోషపడుతుందని.
సర్వం సహా అమ్మే! అమ్మ తప్ప ఉన్నది మరోటి లేదు.
నర్మదా పరిక్రమలో అణుక్షణం ఎ తల్లి స్పర్శను అనుభూతి పొందామొ, ఈ గడ్డిపువ్వును సైతం నలుగురికీ పనికివచ్చేలా చెయ్యకలిగిందో ఆ ప్రజ్ఞ అమ్మే కదా.
లేకపోతే మురళీకృష్ణగారు రాయమని ఎందుకు అడుగుతారు? సంచికలో ఎందుకు ప్రచరిస్తారు? ఎందరికో సత్యాన్వేషణ గురించి, నర్మద పరిక్రమ వివరాలు అందటంఎలా సాధ్యం? చదివిన వారు తామూ చెయ్యాలని, తమ మిత్రులకు పంచాలని అనుకోవటం అమ్మ అనుగ్రహమే కదా!!
“నళీనిగారు! మీరు అమ్మను నమ్మినవారు. గురువులు దైదీప్యమానమైన వెలుతురులో నడుస్తున్నవారు. మీరు ఆనాడు చెప్పిన మాటలు నా చెవులలో మ్రొగుతున్నాయి.
చదివి, ఆలోచించి, ఈ శరీరం మీద, రోగం మీద కన్నా అమ్మ మీద అనురాగం పెరిగిందన్నారు”. ఎంత ఉన్నతమైన మాట. ఎంత మహోన్నతమైన భావన. అమ్మే మనలను నడిపించే చైతన్యం. ఆ విషయం ఒక్కటి చాలదూ జన్మ కడతేరటానికి!!
అందుకే మీకు సదా ప్రణామాలు. నా వరకూ అమ్మవారే మీ రూపు దాల్చి అక్కడికి వచ్చి చెప్పింది.
మీకు సదా జగదంబ అండ.
కస్తూరిగారు కూడా నళినిగారి మాటలకు అందరిలా ఆనందాశ్చర్యాలను లోనైనా, వారు వెంటనే రకరకాలుగా వారి పోను కెమారాలో ఫోటోలు తీసారు.
“క్షరము కానిది అక్షరం ఎంతో విలువైనది” అని వక్కాణించారు. అందుకే ఆధ్యాత్మిక రచనలను చిన్నచూపుతో కాన ఉన్నతమైన దృక్పదంతో చదవాలని చెప్పారు. వారికే కాదు అందరికీ ఆశ్చర్యము కలిగించారు నళినిగారు తమ అనుభవముతో.
ఇలా వివరాలు రాయటానికి నళిని గారి అనుమతి తీసుకు, నవరాత్రులలో అమ్మను ధ్యానించి ఇప్పటికి మిత్రులతో పంచుతున్నాను.
“అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే సుమా!!!”