కొన్ని సార్లు మనకు తెలియకుండా కొన్ని దివ్యమైన అనుభవాలు ఆవిష్కరించబడుతాయి. అవి మనమెంతో కోరుకున్నవైతే ఇక చెప్పేదేముంది?
అదో అద్భుతమే కదా!
ఈ ఉపోత్ఘమంతా ఈమధ్యనే నాకయిన ఒకానొక అనుభవం పంచుకో టానికి. అసలు అనుభవం పంచుకోవాలా? అని వారం రోజులు ఆలోచించి ఓటు వెయ్యటానికి వరుసలో నిలబడి ఈ విషయం రాసుకుంటున్నా.
జిల్లేళ్ళమూడి అమ్మ గురించి చదివి, అమ్మతో అనుభవాల గురించి ఇంటర్యూలు విని, చాలా కాలం అమ్మను ప్రత్యక్షంగా చూడలేదని కష్టపెట్టుకున్నాను. పైగా నాయనమ్మ వాళ్ళది రెపల్లె. బాపట్లలో బాబాయి ఉండేవాడు. చిన్నతనంలో ఎన్నో సార్లు రెపల్లె వెళ్ళి ఉంటాము. మా ఇంట్లో పెద్దలంతా అమ్మను దర్శించే ఉంటారు.
మరి మాకానుభవము ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డాను. ఈ జన్మకు జగదంబ మానవరూపంలో వస్తే చూడలేని నా కర్మను తలచుకు వగచాను. ఎంత అమ్మ స్వప్న దర్శనమిచ్చినా, జిల్లేళ్ళమూడిలో ఎంతో మంచి అనుభవాలు కలిగినా ఈ దిగులు మనస్సులో నిలబడిపోయి, ఒక అసంతృప్తితో మిగిలిపోయాను.
వారం క్రితం మా పెద్దమేనమామ గారి వివాహవేడుకలు జరిగాయి చికాగోలో. స్వర్నోత్సవ వేడుకలివి తప్పక రమ్మని పిలిచారు మామయ్య కొడుకు. ఉన్న పెద్దవారు ప్రస్తుతం వారే కాబట్టి, నేను ఇండియా నుంచి రాగానే అటు వెళ్ళాను అదరాబాదరగా. బాబాయి కొడుకు కూడా అక్కడే ఉంటాడు. ఆ వేడుకలు అయ్యాక రాత్రి బబయ్యకొడుకు ఇంటికి వెళ్ళాము తమ్ముడు నేనూ.
ఆ మరునాడు ఉదయము మా కబుర్లు సాగాయి…. ఎన్నో చిన్నతనం విషయాలు అలవోకగా దొర్లాయి.
అందులో మా చిన్నతనంలో మేము తిరిగిన ఊర్లు, మా ఆటలు, దెబ్బలాటలు… నాయనమ్మ మమ్మల్ని తిప్పిన తిప్పుడు గురించి
కూడా వచ్చింది. మాటల సందర్భంలో జిల్లేళ్ళమూడి కూడా తలుచుకున్నాము.
తమ్ముడు “మనం మన చిన్నప్పుడు మామ్మ తీసుకుపోయిందిగా” అన్నాడు.
“లేదురా! మనం కొమ్మూరు, పొన్నూరు వెళ్ళాము. జిల్లేళ్ళమూడి వెళ్ళలేదు“ చెప్పాను నేను.
“లేదే. మనం వెళ్ళాము. అమ్మను చూశాము” అన్నాడు వాడు.
వాట్?????
నాకు ఏమీ అర్థం కాలేదు. నిజానికి గుర్తు కూడా రాలేదు. కొంత సేపటి నా ఉద్రేకాలు తగ్గాక లీలగా హేమాలయం గుర్తుకు వచ్చింది. అమ్మ ఎంతకూ గుర్తుకురాలేదు.
నేను చాలా ఎమోషనల్ గా “అమ్మ అన్నం పెట్టిందా మనకు?” అడిగాను. “గుర్తులేదు!” అన్నాడు వాడు.
నేను మౌనంగా ఉండిపోయాను కాసేపు.
వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుతునే ఉన్నారు.
“అవును వెళ్ళాము” అన్నాడు రఘు.
“మనము ఐదో క్లాసా? ఆరో క్లాసా?
గుర్తులేదు.” తమ్ముడు చెప్పాడు.
“మనమేమి చేశాము” నా ప్రశ్న.
“ఏదీ గుర్తు రాలటంలేదు…”
“ఆలోచించరా…”
“తెలీదు। నీవెంటి పూనకం వచ్చేస్తోంది…”
“పూనకమా?”
జన్మంతా ఏ తల్లి చరణాలు పట్టుకు వేలాడుతున్నానో, ఏ తల్లిని క్షణం కూడా విడవక మనసులో తలుస్తున్నానో ఆతల్లి మానవరూపం చూసానని తెలియటం చిన్న విషయమా? వీళ్ళకు ఎలా అర్థమవుతుంది?
నా హృదయంలో ఒక మౌనం. కలా నిజమా కాని దృశ్యమా?
«మెట్లు ఎక్కాము. విశాలమైన హాలు.
ఒక కుర్చీ. సింహాసనంలా ఉంది. అందులో అమ్మ దివ్యమంగళంగా కూర్చునుంది.
పెద్ద పెద్ద స్తంభాల మధ్య ఉన్న ఆ దివ్య సింహాసనం ఎత్తుగా ఉంది.
అందరూ నేల మీద కూర్చొని ఉన్నారు.
మేము వెళ్ళి వెనకాల కూర్చున్నాము. అమ్మ కూర్చుంటున్న మమ్ముల్ని చూసింది”.
ఇదో కలో నిజమో తెలీదు. అమ్మను చూసిన గుర్తు కలగటం లేదు.
అయితేనేమీ జగములేలు ఆ తల్లి ఈ జీవిని చూసింది. చూస్తోంది. నడుపుతోంది. ఇంకే బేంగేలనే మనసా?
నాకు గుర్తు ఉన్నా లేకున్నా అమ్మ చూసింది. చూస్తోంది. నడిపిస్తోంది.
అందుకేనేమో వచ్చిన వెంటనే బడలిక తీరకమునుపే షికాగో ట్రిప్పు పెట్టి రాత్రి రఘు వాళ్ళంట బస పెట్టించి మమ్మిల్ని చిన్ననాటి విషయాలు కబుర్లలో పెట్టి జిల్లెళ్ళమూడి విషయం గుర్తు చేయించిన అమ్మ ప్లానుకు ఏమనగలము?
జయహో మాతా అని తప్ప!!
జయహో మాతా!!!
జోరుసే బోలో జయహో మాతా!
ధ్యాన్ సే బోలో జయహో మాతా!