నేను” అన్నది ఏమిటో తెలుసుకో!, అన్నారు భగవానులు.
“నేను” మీద ధ్యానం చెయి, తెలియగలదని అన్నామలై (రమణుల వారి శిష్యులు) చెప్పారు.
“నేను” అన్న భావమే అహం.
మానవుకున్న 26 తత్త్వాలు/ గుణాలు/భూతాలలో ముఖ్యమైనది అని చెబుతారు వేదాంతులు.
దీని విషయం తెలుసుకోవటానికి గురువును ఆశ్రయించమన్నారు పెద్దలు.
గురువు ఏం చెబుతాడు?
“అజ్ఞానివి నీవు కాదయ్యా! నీ స్వభావం జ్ఞానమే. కాని నీవు, నీవు కానిదైన శరీరము నీవన్న బ్రాంతిలో ఉండి నీ అసలు రూపం గహ్రించటము లేదు. నీ అసలు స్వరూపము జ్ఞానమే.” అంటాడు గురువు.
మనము మరింత కంగారు పడి “నా అసలు రూపం జ్ఞానమైతే నేనెందుకు ఇలా ఉన్నాను? జ్ఞానముతో నిత్యతృపః లా ఉండాలి కదా!!” అని అనుకుంటాము, అడుగుతాము.
“ఇవన్నీ నిజమే. ముందు నీ అసలు రూపమేదో తెలుసుకో… అన్నీ తెలుస్తాయి” అంటాడు గురువు మళ్ళీ.
****
ఇవి జీవిత సత్యాలు.
మానవ జన్మ తీసుకున్న వారు తెలుసుకోవల్సినవి. తెలియవలసినవీ.
తిండి, నిద్ర,మైధనం…ఇదేనా జీవితం??
పుట్టుట, చచ్చుట, తిరిగి పుట్టుట అన్న చట్రంలో కొట్టుకుపోకుండా అసలు “ఈ మానవ జన్మ ఎందుకు కలిగింది? నేను ఏమి చెయ్యాలి మానవునిగా?” అన్న ప్రశ్న వేసుకోవాలి జీవితంలో ఒక్కసారైనా మనిషిగా జన్మించినవారు…
సనాతన ధర్మంలో ఎంతో జ్ఞానం పంచే సాహిత్యం మునులిచ్చారు.
గురువులు బోధిస్తున్నారు.
అది (జ్ఞాన సాహిత్యం) సముద్రమంత ఉన్నా…. మనకు కావలసినది గురువు ద్వారా కాని, పరమాత్మ మరో రూపంలో కాని అంద చేస్తారు.
జీవుతంలో జరిగే ఆటుపోట్లకు, జీవిత వేగం ద్వారా కలిగే ఒత్తిడికీ కృంగక ఊతగా పరమాత్మను ధరించి ప్రయాణం సాగిస్తే తప్పక ముక్తి పొందగలరు. జీవుంచటానికి ధైర్యం వస్తుంది కూడా.
అలా ముక్తి కలిగించే జ్ఞానము,
వేదాంతుల నుంచి గురువుల వరకూ కూడా మెచ్చుకోబడిన పుస్తకం ఉంది.
అది డైరెక్టుగా జ్ఞానం తలుపులు తెరిచి, ముక్తిపథంలోకి నడిపిస్తుంది.
ఆ గ్రంధరాజ్యం ఉత్తమోత్తమమైనదిగా ఎందరిచేతనో మెచ్చబడినది.
నిజమైన సాధకులకు, జీవన్ముక్త స్థితి కలిగాలనుకున్న జిజ్ఞాసులకు మాత్రమే లభ్యమవుతుంది.
ప్రతి శ్లోకం ఒక జ్ఞానగుళిక.
ఆ అద్భుతాలను తెలుసుకునే అదృష్టం ఈ ఉపాదికి కలగటం జగదంబ అనుగ్రహం.
తెలుసుకున్నది నలుగురికీ పంచుకోవటం ధర్మం. అందుకే అర్థమయినంతగా ఆ విషయం అందించే చిన్న యత్నం….అమృతం సముద్రమంత ఉన్నా, త్రాగగలిగినది లోటాతోనే కాబట్టి….అందుకోగలిగిన వారికి అందుకున్నంత….
ఇంతకీ పేరు చెప్పలేదు కదా…. ఆ జ్ఞానగ్రంధం “ అష్టావక్రగీత”
గీత అంటే పాట.
ఏ పాట ఇది? ఆధ్యాత్మిక జ్ఞానవాహినే గీత. ఈ గానం చేసింది అష్టావక్రుడు, కాబట్టి దీనిని “అష్టావక్రగీత” అన్నారు.
అష్టావక్రుడు పుట్టుకతో జ్ఞాని.
ఆయన కథ టూకీగా- పూర్వం సమంగా నది తీరంలో ఉద్దాలకుడనే ముని శ్రేష్టుడు ఉండేవాడు. ఆయనకు కూతురు సుజాత. ఆయన వద్ద ఉన్న శిష్యుల్లలో కహోడుడు గొప్పవాడు. గురుభక్తుడు. ఉద్దాలకుడు సుజాతను కహోడునికచ్చి వివాహం చేశాడు. కహోడుడు చాలా పేదవాడు. అతని వద్ద ఆవులు కాని, ధనం కాని లేవు. సుజాత గర్బం ధరించింది. కహోడుడు ధనమెలా సంపాదించాలా అన్న ఆలోచన కలిగి మనసు నిలవలేదు. అతను రోజూ చేస్తున్న వేదగానంలో తప్పులు దొర్లాయి. సుజాత గర్బం నుంచి శిశివు తండ్రిని హెచ్చరించింది, వేదగానంలో తప్పుల గురించి. కోపమొచ్చిన కరోడుడు సుజాత గర్భంలోని శిశువును ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
ఆ తరువాత ఆయన ధన సంపాదన కోసం జనకుని కొలువుకు వెళ్ళాడు.
జనకుని కొలువులో బందుదన్న పండితుడితో వాదానికి దిగి ఓడిపోయాడు కహోడుడు. ఫలితంగా సమంగా నదిలో ముంచబడ్డాడు.
సుజాతకు నెలలు నిండి కుమారుడు కలిగాడు. కాని తండ్రి శాపం వలన ఎనిమిది వంకలతో పుట్టాడతను. అందుకని అతనిని అష్టావక్రుడని పిలిచేవారు.
ఉద్దాలకునికి కూడా కుమారుడున్నాడు. అతను శ్వేతకేతు. ఒకనాడు అష్టావక్రునికి తండ్రి గురించి తెలుస్తుంది. తండ్రి సంగతి తెలుసుకోవటానికి అతడు శ్వేతకేతు తో కలిసి జనకుని కొలువుకు వెడతాడు. అక్కడ బందుడిని ఓడించి తండ్రిని దక్కించుకుంటాడు. ఇది టూకీగా కథ.
అయితే జనకుడు జ్ఞాని. అతనిని రాజయోగి అని పిలిచేవారు. అటువంటి జనకుడు అష్టావక్రుని సమీపించి తనకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థిస్తాడు. జనకుని ప్రశ్న అష్టావక్రుని సమాధానమే ఈ గ్రంధం.
మనము గుర్తు పెట్టుకోవలసినది జనకుడు తానుగా జ్ఞాని. అష్టావక్రుడు మహాజ్ఞాని. వారి సంభాషణ మొదలవటమే ఎంతో ఉన్నతమైన స్థితి నుంచి మొదలవుతుంది. కాబట్టి ప్రాదమిక మెట్లు (basic steps) కోసం ఇక్కడ వెతకకూడదు. ఇది ఉన్నతమైన స్థాయి(advanced level) లో ఉంటుంది.
*****
జనకుడు అడుగుతున్నాడు –
“కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి।
వైరాగ్యం చ కథం ప్రాప్తమేతత్ బ్రూహి మమప్రభో॥”
కథం అంటే how.
జ్ఞానాన్ని ఎట్లా ఆర్జించాలి? ముక్తి ఎట్లో పొందాలి? వైరాగ్యం ఎలా నిలుపుకోవాలి? ప్రభో! నాకు చెప్పండి.
జనకుడు జ్ఞాని కదా మరి ఎందుకు మళ్ళీ జ్ఞానం ఎలా లభిస్తుందన్నాడు? ఆయనకు ఉన్న జ్ఞానము. ముక్తినివ్వదని గ్రహించాడు కాబట్టి అడుగుతున్నాడు.
ఆయన అడిగిన జ్ఞానం “ముక్తి నిచ్చే జ్ఞానం” గురించి అడుగుతున్నాడు.
పరమేశ్వరుని గురించి తెలుసుకున్నవాడు జ్ఞాని. వానికి చరాచర జగమంతా పరమేశ్వరుడే. దృశ్యమానమైనదంతా పరబ్రహ్మమే. ఇది జ్ఞానం.
అంటే కనపడేది, కనపడదని అంతా ఈశ్వరుడే. ఈశ్వర చైతన్యం తప్ప మరి ఒకటి లేదు. కనపడే ప్రపంచము ఏ చైతన్యంతో నడుస్తుందో ఆ చైతన్యం మనలోనూ ఉంటుంది. ఆ చైతన్యమే నిజం. మిగిలినది మార్పులు చెందే దృశ్య ప్రపంచం. ఈ జ్ఞానము గురించే జనకుడు అడిగాడు.
వైరాగ్యం అంటే ఐహిక సుఖాలపై విరాగం. మనకు వైరాగ్యం కలుగుతూ ఉంటుంది…పోతూ ఉంటుంది. కష్టాలు కలిగినప్పుడు “అబ్బా ఏంటీ ఈ జీవితం?” అని మనలో అనుకోనివారు అరుదు. దీనినే పెద్దలు శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని చెప్పారు. ఇవి క్షణికాలు. మళ్ళీ ఇంద్రియాలు మొలకెత్తి మనను సుఖాలవైపుకు లాగుతాయి. ఈ సుఖాలన్నీ ఇంద్రియాలను తృప్తి పరచేవి. ఇంద్రియాలకు తృప్తి అన్నది ఉంటుందా? అంటే సందేహమే.
ఒక కోరిక తరువాత మరో కోరిక వరుసగా వస్తూ ఉంటాయి. వాటికి అంతు అన్నది ఉండదు పొంతూ ఉండదు.
“కామి కానివీడు మోక్షగామి” అన్నది నిజంకాదు.
కోరికలు తీర్చుకుంటుంటే తృప్తి కలగదు. మరిన్ని కోరికల చిట్టాసిద్ధమవుతుంది.
అగ్నికి నెయ్యి అందిస్తే మరింతగా మండుతుంది తప్ప ఆరదు. కాబట్టి, వైరాగ్యం ఎలా నిలబడుతుంది అన్నది నిజంగా ఆలోచించవలసిన ప్రశ్న.
జ్ఞానము, వైరాగ్యం తరువాత ముక్తి ఎలా కలుగుతుంది అని అడిగాడు జనకుడు. ముక్తి అంటే ఐహిక బంధాల నుంచి విడుదల. ఆ బంధం ఎవ్వరూ కల్పించలేదు. ఎవరికి వారు కట్టుకున్నదే. ముక్తి అన్న మాట ఇక్కడ మోక్షమన్న అర్థంలో వాడబడింది.
జనకుడు ఇలా అడగటంలో ఆయన జ్ఞాని అని తెలుస్తుంది. ముందు జ్ఞానం సముపార్జన ద్వారా వైరాగ్యం కలిగి నిలబడుతుంది. వైరాగ్యం నిలవాలంటే జ్ఞానము అవసరము. నశించిపోయే వాటి కన్న శాశ్వతమైనది కావాలనుకోవటము కదా జ్ఞానము. ఆ జ్ఞానము వలన విషయవాసనలపై వైరాగ్యం నిలబడుతుంది. ఆ వైరాగ్యం నిలబెట్టుకొని సాధన చేస్తే ముక్తి లభిస్తుంది.
జనకుడు అడిగిన ప్రశ్నతోనే ఆయన జ్ఞాని అని తెలుస్తోంది. పైగా ఆయన అడగటము కూడా సరాసరి జ్ఞాన, వైరాగ్య, ముక్తి గురించి అడిగాడు.
మొదలుపెట్టటమే డైరెక్టుగా ముక్తి వద్దుకు తీసుకుపోవటము జ్ఞాని మాత్రమే చెయ్యగలడు.
ఈ ప్రశ్న వలన జనకుని యొక్క స్థితి మనకు తెలుస్తుంది.
భక్తితో
సంధ్యా యల్లాప్రగడ