అష్టావక్రగీత#4
అహం కర్తేత్యహం మాన మహాకృష్ణాహి దంశితః
నాహం కర్తేతి విశ్వసామృతం పీత్వా సుఖీభవ॥
ఒక నల్లటి త్రాచు పాము ఉంది. దాని వంటి నిండా కాలకూట విషముంది. దాని కాటుకు విషముతో కుట్టబడితే విషంతో వారు నిండిపోయి దుఃఖమనుభవిస్తారు. కర్తృత్వం అన్నది నల్లటి త్రాచుపాము. కర్తృత్వం అంటే చేసేది నేనే అన్న అహంకారం. అహంకారం కన్నా నల్లటి త్రాచు మరోటి లేదు. అహంకారం నిండా ఉన్నవారు వంటి నిండా ప్రవహిస్తున్న విషం కలవారు ఒక్కటే.
వారికి ఎవ్వరూ కనపడురు. వారంత గొప్పవారు మరొకరు ఉన్నారనుకోరు. ఆ అహంకారంతో వారు దుఃఖ తెచ్చుకుంటున్నారు. సర్వనాశనమును పిలుస్తున్నారు.
ఈ అహంకారం వల్ల విషయభోగాలవైపుకు లాగబడుతారు. కోరికల వెనుక పరగుపెడుతూ ఉంటారు.
మనకు తెలిసినదే ఇది.
చిన్న టీవి నుంచి పెద్ద టీవి, చిన్న ఇంటి నుంచి పెద్ద ఇల్లు, చిన్న పదవి నుంచి పెద్ద పదవి. ఇలా కోరికలు వాటి వెనక పరుగు ఆగదు. ఇలా పరుగుపెడుతున్నవారంతా కాలసర్పవిషం వల్ల పరుగులు పెడుతున్నారని మనం (సాధకులం) గ్రహించాలి. మనము ఆ విషానికి విరుగుడుగా, “చేసేది మనం కాదు” అన్న సత్యాన్ని గ్రహించాలి. బుద్ధి, దేహాం ఇంద్రియాలు నేను కాదు అన్న భావన అమృతమయమైనది. ఆ భావనలో నిలిచే యత్నం చెయ్యాలి.
ఏేకోవిశుద్ధబోధోఽ హమితి నిశ్చయవహ్నినా
ప్రజ్వాల్యా జ్ఞానగహనం వీతశోక స్సుఖీభవ॥
అజ్ఞానమన్నది అరణ్యం. దాన్ని కాల్చమని ముని సలహా చెబుతున్నాడు. ఏ అగ్నితో తెలుసా? జ్ఞానమన్న అగ్నితో అజ్ఞానమన్న అరణ్యాని కాల్చాలి. అప్పుడు బంధాల నుంచి విముక్తి.
అజ్ఞానం అంటే ఏది అని మనకు సందేహం కలుగుతుంది.
అజ్ఞానం రెండు రకాలు. ఉన్నదాని అసలు స్వరూపం తెలుసుకోలేకపోవటం మొదటి అజ్ఞానం. దానిని అగ్రాహ్యం అంటారు. ఉన్న వస్తువును చూసి మరో వస్తువనుకోవటం మరో అజ్ఞానం. దీనిని అన్యథాగ్రాహ్యం అంటారు.
శరీరం రక్తమాంసధాతువులతో నిర్మతమైనది. శరీరమే నీవనుకోవటం ఒక అజ్ఞానం. అది అన్యధాగ్రాహ్యం. లోన ఉన్న ఆత్మభవుని గ్రహించకపోవటం అగ్రాహ్యం.
ఈ రెండు అజ్ఞానాలన్నవి మానవుని జన్మ పరంపరలలో పడవేస్తున్నాయి.
ఆ అజ్ఞానాని జ్ఞానమన్న ఖడ్గంతో ఖండిచాలి.
గురువును ఆశ్రయించటం వల్ల అజ్ఞానం పోతుంది.
యత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జుసర్పవత్।
ఆనందం పరమానందః సభోధస్త్వం సుఖంచర॥
నీ అసలు స్వరూపము ఆనందం. ఆ ఆనందం చైతన్యం. కాని జగత్తు అజ్ఞానం వలన తాడులో పాములా కనిపిస్తోంది. పరిపూర్ణమైన ఆనందస్వరూపంగా సంతోషంగా జీవించు.
వేదాంతంలో తప్పక చెప్పే ఉదాహరణలలో రజ్జు సర్పబ్రాంతి.
తాడును చీకట్లో చూసి పాము యని పొరపాటు పడి కంగారు పడటము సామాన్యమే. ఇది చాలా సార్లు మనకూ అవుతూ ఉంటుంది. తాడును పామనుకోవటం.
అప్పటి వరకూ పాము కనిపించింది కదా. మరి పాము ఏమైపోయింది? చచ్చిపోయిందా? మాయమైపోయిందా? లయమైపోయిందా?
పాము పారిపోలేదు, చచ్చిపోలేదు, లయంకాలేదు. మాయం కాలేదు. అసలక్కడ పామే లేదు. అక్కడ ఉన్నది కేవలం తాడు. త్రాడును చూసి మసక చీకట్లో పామనుకొని భయపడతాము. దీపపుకాంతిలో పరిక్షీస్తే అది పాము కాదు త్రాడని తెలిసింది. అదే రజ్జసర్ప బ్రాంతి. జ్ఞానం కలగగానే భ్రాంతి జన్యమైన వస్తువు అధిష్టానంలో కలిసిపోయింది. పాము అనుకున్నది దీపపుకాంతి పడగానే త్రాడులో కలిసిపోయింది. అలాగే జగత్తు లేదు. ఉందని నీవు అనుకుంటున్నావు. అదంతా భ్రాంతి. మనోకల్పితమైనది. జ్ఞానం కలగగానే అధిష్టానమైన ఆత్మలో కలిసిపోతుంది. ఆ ఆత్మవు నీవే, నీకన్నా వేరైనది లేదు అని అష్టావక్రుడు చెప్పాడు జనకునికి.
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥
స్వస్తి
(మిగిలినది రేపు)