అష్టావక్రగీత#5
మన మనస్సులో ఏ భావము బలంగా ఉంటుందో అదే నిజమవుతుంది. ఇందులో మ్యాజిక్ ఏమీలేదండి. మనఃనిర్మతం ప్రపంచం. మన మనస్సులో అనుకున్నదే మనకు కనపడుతుంది. లేకపోతే మన దృష్టికి ఆనదు. ఉదాహరణకు ఆకలిగా ఉన్నవారికి ప్రతీది ఆహారంలా కనపడుతుంది. అప్పటి వరకూ కనపడని హోటల్స్ కనబడుతాయి. మనస్సులో ఆలోచనతో లోకం చూస్తారు.
చాలా సార్లు తరగతి గదులలో విద్యార్థులను టీచర్లు “ఎక్కడ పెట్టావు బుర్ర… పాఠం వినటంలేదు” అంటూ ఉంటారు.
అంటే మనస్సులో ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. అందుకే ఎదురుగా ఉన్నవి వినపడవు కనపడవు.
అందుకే చాలా సార్లు “కొద్దిగా శ్రద్ధపెట్టి వినమని” అనటం మనము వింటూ ఉంటాం.
ఎవరి భావనా ప్రపంచం వారిది. అందుకే ఎవరి లోకం వాళ్ళదన్న మాట వచ్చింది.
అదే అష్టావక్రుడు చెబుతున్నాడు.
“ముక్తాభిమానీ ముక్తో హి బద్దాభిమాన్యపి।
కిం వదంతీహసత్యేయం యా మతిస్సాగతిర్భవేత్॥
తాను ముక్తుడని భావిస్తే ముక్తుడవుతాడు. బద్ధుడుగా భావిస్తే భద్దుడిగా మిగిలిపోతాడు. ఎవరు ఎలా భావిస్తే అలా మారుతారు. ఇదే పరమసత్యం.
ముక్తుడు – బద్ధుడు కూడా మనోకల్పితాలు.
అజ్ఞానంతో నేను సర్వం చూసుకుంటున్నా, భార్యాపిల్లలూ…అంటూ బంధాలు కల్పించుకుంటాడు. నేనే చూసుకుంటున్నా…అంటాడు.. అది బంధం.
బాధ్యతగా ఉండాలి కాని బంధాలతో కట్టేసుకోకూడదు. యద్భావం తద్బవతి అన్నారు.
నేను ముక్తుడౌతాను అనుకుంటే ఆ దిశగా ప్రయాణం, ముక్తి తథ్యం అంటున్నాడు ఇక్కడ అష్టావక్రుడు.
“ఆత్మాసాక్షీ విభుః పూర్ణ ఏకో ముక్త శ్చిదక్రియః।
అసంగో నిస్పృహశ్శాంతో భ్రమాత్సంసారవానివ॥
చుట్టూ ఉన్న ప్రపంచము మాయతో కప్పబడి ఉంది. ఈ మాయ మూలంగా మానవుడు తాను సృష్టించుకున్న ధనం వెనకపడి పరుగుపెడుతున్నాడు. మాయ మూలంగానే తమ ముందు జీవులు మరణిస్తున్నా, వస్తువులు నశిస్తున్నా తాము మాత్రం శాశ్వతం అని అనుకుంటాడు. అనుబంధ మమకారాల మధ్య పడి మాయతో కప్పబెడి అజ్ఞానంలో బ్రతుకుతాడు.
మాయ నుంచి తప్పించుకోవటం ఎవ్వరి వల్లా సాధ్యం కాదు. మాయను ఆశ్రయించినవారికే ఇది సాధ్యమవుతుంది.
ఎండమావులలో నీరు ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. కాని దగ్గరికి వెళ్ళి చూస్తే అది నీరు కాదని కాంతి పరావర్తనంతో నీరుయని భ్రమ పడ్డామని తెలుస్తుంది. అలాగే ముత్త్యపు చిప్ప చూడటానికి వెండి లాగా కనపడుతుంది. కాని విచారించి చూస్తే అది ముత్త్యపుచిప్పగా తెలుస్తుంది. ఇదే మాయ.
ఈ మాయ వలన ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా బ్రాంతి కలుగుతుంది.
ముందు సృష్టిలో ఒక్కడే ఉన్న పరమాత్మ నుంచి శక్తి ఉద్భవించింది. అనంతరం అవ్యక్తం, మహత్తత్త్వం, అహంకారం వచ్చాయి. అహంకారం నుంచి పంచ తన్మాత్రలు, వాటి నుంచి పంచభూతాలు వెలుబడ్డాయి. అంటే జీవునికి పరమాత్మ కు మధ్య మాయ అన్న పొర నిలబడి ఉంది. మానవుడు జ్ఞానంమన్న నిప్పుతో అజ్ఞానమన్న అడవిని కాల్చిన నాడు పరమాత్మ తత్త్వమైన ఆత్మ దర్శనం కలుగుతుంది.
అష్టావక్రుడు చెబుతున్నాడు – “రాజా! అందుకే “నేను” అన్న అహంకారం వదిలిపెట్టు. “నాది” అన్న అహంకారం వదిలిపెట్టు. నేను దేనికీ కర్తను కాదు. నేను సర్వవ్యాపకుడైన పరమాత్మను అని భావించు“ అని అంటున్నాడు.
నేను అంటేనే అహంకారం. మిగిలిన ఇంద్రియాల వలనే అహంకారం కూడా ఆత్మ చైతన్యం యొక్క వెలుగులో వెలుగుతూ ఉంటుంది.
“కూటస్థం బోధ మద్వైతమత్మానం పరిభావయ।
అభాసోహం భ్రమం ముక్త్వాభావం బాహ్యమధాన్తరమ్॥”
బాహ్యంలో అంతరంలో అలజడి సృష్టించే భావాలు వదిలి నేను అహంకారం అన్న భావం కూడా వదిలి సచ్చిదానందమైన ఆత్మ నేను అన్న భావంతో ఆత్మను ధ్యానం చేస్తూ సంతోషంగా ఉండు.
అభాస అంటే కనపడటం, వెలగటము.
పరిభావయా అనగా ధ్యానం చెయ్యటం. కూటస్థ మంటే కూటవత్ ఇతి తిష్టతి.
నేను నాది యన్న భావం వదిలిపెట్టెయ్యి.
సుఖం దుఃఖం వదిలెయి. అభిమానం, మమకారం వదిలెసి నేను కర్తను కాను, నేను సర్వ వ్యాపకుడైన పరమాత్మను అన్న భావమును ధ్యానము చెయి. అహంకారం, ఆత్మ రెండూ వేరు వేరు. ఆత్మ వెలుగులో అహంకారం వెలుగుతూ ఉంటుంది. సచ్చిదానందమైన ఆత్మను నేను అన్న భావాన్ని ధ్యానించమని చెప్పాడు అష్టావక్రుడు.
“దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక।
బోధోఽహం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీభవ॥
దేహమే నేను అన్న భావంతో ఎన్నో యుగాలుగా ఉంటారు మానవులు. ఆ భావము తొలగించుకోవటం అంత తేలికగా కుదరదు. జ్ఞానమన్న ఖడ్గంతో ఆ బంధాని ఛేదించు అని చెబుతున్నాడు ముని.
శరీరం అన్న భావం నుంచి ఎవరికి వారు స్వతంత్రం పొందాలి. ఉన్నది ఒక్కటే. అదే ఆత్మ. ఏతి సర్వత్ర గచ్ఛతి. అది శుద్ధమైనది. దాని వెలుగులో అన్నీ మెరుస్తూ కనపడుతాయి.
కాబట్టి అనాత్మ భావం తొలగించుకోవాలి.
***
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥”
స్వస్తి
(మిగిలినది రేపు)