జనకుడు అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు సమాధానంగా విషయలంపటాలను విషంగా వదిలెయ్యమని చెబుతాడు.
ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు….
“నిస్సంగో నిష్క్రియో సిత్వం స్వప్రకాశో నిరంజనః
అయమేవ హితే బంధః సమాధి మనుతిష్టసి॥”
నీవు నిస్సంగుడవు. నిప్ర్కియుడువు. స్వయంజ్యోతివి. నీకు ఏ మలినము లేదు. అంటవు. బంధాలు తొలగించుకొని స్థిరంగా ఉండు.
నీ మనస్సుతో కాని, శరీరంతోకాని, అవి అనుభవించే విషయాలతో నీకు సంబంధం ఉండదు. నీ ఆత్మకు నీ కర్మకు సంబంధం ఉండదు. పరమాత్మకు ఏ కర్మలు అంటవు. అందుకే చెట్టు మీద ఉన్న రెండు పక్షులలో ఒక పక్షి ఏమీ తినకుండా చూస్తూ ఉంటుంది. పరమాత్మ నిష్క్రియుడు. ఆత్మ స్వయం జ్యోతి.
ఏ విధమైన మలినము అంటదు.
మలము/ మలినము ఐదు రకాలు.
అణవమలం: పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలన్న జ్ఞానం అప్పడప్పుడు కలిగితే దాన్ని మరుగనపడవేసేది,
కార్మికమలము: పెద్దలు వేదాంతులు పరబ్రహ్మ విషయం చెబుతుంటే అది బుద్ది యందు చోరబడకుండా చేసేది,
మాయికమలము: దట్టమైన అజ్ఞానము పరమాత్మను తెలుసుకోనియ్యదు,
మాయేకమలము: మాయతో మనస్సు కప్పబడి జ్ఞానం వైపుకు నడవనీయ్యదు,
తిరోధానమలము: పరబ్రహ్మ కన్నా వేరు దేవతలున్నారని నమ్మడం.
వేదసమ్మతమై పరమాత్మను నమ్మి నిస్సంగుడు, నిష్క్రియనడు, నిరంజనుడు అయిన పరమాత్మను స్వయంజ్యోతి అయిన ఆత్మలో ధ్యానం చెయ్యమని అష్టావక్రుడు చెబుతున్నాడు.
“త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయిప్రోతం యథార్థతః।
శుద్ధబుద్ధ స్వరూపస్త్వం మాగమః క్షుద్ర చిత్తతామ్॥”
నువ్వు జగమంతా వ్యాపించి ఉన్నావు. క్షుద్రమైన భ్రమతో విచారించవద్దు. పరిశుద్ధమైన ఆత్మచైతన్యం నీవు.
(కార్య కారణ సంబంధము) కార్యమైన ఆభరణాలకు కారణమైన బంగారం ఒక్కటే. మట్టి కారణమైతే కార్యం కుండలు. మట్టి నుంచి కుండలు తయారవుతాయి. అలాగే జగత్తు అంతా నీలోనే ఆవరించి ఉంది.
ఇది ఎలా అంటే బంగారం ఆభరణాలు ఉన్నాయి. ఆభరం పేరు ఏదైనా దాని నిండా నిండిఉంది మాత్రము బంగారమే కదా. బంగారపు గాజు ఉంది. దాని నుంచి బంగారం తీసివేస్తే గాజు నిలబడుతుందా? అలాగే బ్రహ్మమే జగమంతా నిండి ఉంది. బ్రహ్మంను జగం నుంచి తీసివేస్తే మరి బ్రహ్మాండాలు ఉండవు.
బ్రహ్మజ్ఞానికి జగత్తు ఉండదు. ఏమవుతుంది? జగత్తు బ్రహ్మంలో లీనమవుతుంది. తాడు పాము ఉదాహరణలో తాడని తెలిశాక పాము తాడులో కిలిసిపోతుంది కదా.
తాడులో పాము లీనమైనట్లుగా బ్రహ్మజ్ఞానికి జగత్తు బ్రహ్మంగా కనపడుతూ మారిపోతుంది.
అందుకే బ్రహ్మజ్ఞానికి లోకమంతా బ్రహ్మమే కనపడుతుంది. నీవు ఆత్మవు కాబట్టి ఈ విషయాలను గ్రహించు అని చెప్పాడు అష్టావక్రుడు.
“నిరపేక్షో నిర్వికారో నిర్భరశ్శీతలాశయః
అగాధ బుద్ది రక్షషుభో భవ చిన్మాత్రవాసనః॥”
నీవు కోరవలసినది ఏదీ లేదు. నీలో మార్పుల ఉండదు. అంతటా సమదృష్టి కలిగిన సాక్షివి నీవు. నీకు కోరిక ఉంటే చైతాన్యాని కోరుకో.
దేహం మార్పు చెందుతుంది. జాయతే- అస్థి – వర్థతే – నశ్యతే అన్నది శరీరానికి ఉన్న అవస్థలు. ఆత్మకు ఆ అవస్థలు లేవు. అవిద్య వలన ఆ మార్పులు నాకే కలుగుతున్నాయని అనుకుంటావు. వాటిని వదిలి చిన్మత్రుడవై ఆత్మానందంలో ఉండు, అని అష్టావక్రుడు జనకునికి చెబుతున్నాడు.
***
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥”
స్వస్తి
(మిగిలినది రేపు)