అష్టావక్రగీత#7
”సాకారమనృతం విద్ది నిరాకారం తు నిశ్చలమ్।
ఏతత్త్వోపదేశేన న పునర్భవ సంభవః॥”
రూపం నశిస్తుంది. రూపం లేనిది శాశ్వతంగా ఉంటుంది. ఈ జ్ఞానం వల్ల పునఃజన్మ నుంచి విముక్తి పొందుతావు.
జగత్తు మిథ్య. కనిపించేది అశాశ్వతం.ఆత్మ సర్వసాక్షిగా ఉంటుంది. నశించిపోయే వాటి మీద అభిమానం వద్దు. ఆకారంలేని ఆత్మ సర్వకాలాల్లో ఉంది. ఇదే ఆనందం. ఇటు వంటి ఆనందమే బ్రహ్మం. ఇదే చిన్మాత్ర. చిన్మాత్రలో విశ్రయించటమే ముక్తి.
“యథైవాదర్శమధ్యస్తే రూపేంతః పరితస్తుసః।
తథైవాస్మిన్శరీరేంతః పరితః పరమేశ్వరః॥”
అద్దంలో ప్రతిబింబం కనపడుతుంది. ప్రతిబింబంతో పాటూ చుట్టూ ఉన్న శూన్యం లేదా ఆకాశం కూడా కనపడుతుంది. అలాగే దేహం పక్కలా పైనా క్రిందా పరబ్రహ్మమే ఆవరించి ఉంటుంది.
“విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాం తర్గతం।
పశ్యన్నాత్మని మాయయా బహురివోరద్భూతం యథానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మ్న మేవాద్యయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥”
కలలో జరుగుతున్నది కల యని మెలుకువ వస్తే తప్ప తెలియదు. అలాగే మాయ వల్ల జగత్తు అంతా అద్దంలో కనిపించే ప్రతిబింబంలా కనిపిస్తుంది. జగత్తంతా పరమాత్మ స్వరూపం.
జగత్తు నామరూపాత్మకమైనదంతా నశించేదే. ఏది దేని నుంచి ఆవిర్భవిస్తుందో అందులో కలిసిపోతుంది.
అద్దంలో ప్రతిబింబానికి బయటాలోపలా అద్దం ఉంటుంది. ఒకవేళ ప్రతిబింబం పోయినా
అద్దం మిగిలి ఉంటుంది. ప్రతిబింబం ఉన్నా అద్దానికి సంబంధం ఉండదు. అలాగే పరమాత్మలో జగత్తు కనిపిస్తుంది. ఉంది. జగత్తు లేకపోయినా పరబ్రహ్మ ఉంటుంది.
ఎలా కుండలలో ఆకాశం వ్యాపించి ఉన్నా కుండ బయటకూడా ఆకాశం ఉంటుందో అలా పరబ్రహ్మ సర్వత్రా ఉంది.
“ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యథా ఘటే
నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వ భూతగణే తథా॥”
కుండలున్నాయి. ఉన్న కుండలలో ఆకాశం వ్యాపించి ఉన్నది. కుండల బయటా ఆకాశం వ్యాపించి ఉన్నా కుండ లోనా బయట కూడా ఆకాశం ఉంటుందో అలా పరబ్రహ్మ సర్వత్రా ఉంది. అలాగే సర్వవ్యాప్తం అచలం అయిన పరబ్రహ్మలో చరాచర జగత్తు నిండి ఉంది. అన్ని జీవులలో వస్తువులలో వ్యాపించి ఉంది. అన్నింటిలో అంతర్లీనంగా ఉంటుంది. అదే అంతర్యామి.
గురువు చెప్పిన బోధలకు శిష్యునకు జ్ఞానం కలిగింది. శిష్యునకు ఆత్మదర్శనం కలిగిందనుకోండి. అప్పుడు శిష్యుని స్థితి ఎలా ఉంటుంది? ఆత్మ సాక్షాత్కారం పొందినవారి మాటలెలా ఉంటాయి?
“నేనే పరబ్రహ్మను, నేనే జ్ఞానరూపుడిని, నేనే శాంతరూపుడిని, నేను కలిసి ఉన్నాను. నేనే విడిగా ఉన్నాను. నేను చిదానందుడిని…నేనే పూర్ణరూపుడిని, నేనే బ్రహ్మను… నాకు నామరూపాలు లేవు. అన్నీ నామాలు నేనే అన్ని రూపాలు నేనే. గురువు లేరు శిష్యులు లేరు. మంత్రం లేదు తంత్రం లేదు. దృశ్యము, దృక్కు లేదు. నేను మాత్రమే”… ఇలా సాగుతాయి.
జ్ఞాని అయిన జనకునికి అష్టావక్రుని వలన ఆత్మజ్ఞానం కలిగింది. ఆయనకు కలిగే ఆలోచనలు రెండవ అధ్యాయములో చెప్పబడ్డాయి.
అవి పైన చెప్పినట్లుగా సాగుతాయి. తేజోబిందు ఉపనిషత్తు జ్ఞాని స్థితి గురించి ఇలాగే చెబుతుంది. అంటే ఆత్మజ్ఞానం కలిగిన తరువాత హృదయంలో కలిగే మార్పులను గురించి.
ఆ వివరాలు రేపు….
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥
స్వస్తి