అష్టావక్రగీత#9
జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు.
జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు.
సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే. అలా ఆత్మ పరమాత్మలో భాగమే అంటూ తనకు కలిగిన జ్ఞాన్నాని చెబుతున్నాడు జనకుడు.
ఇంకా ఇలా చెబుతున్నాడు:
తంతుమాత్రో భవేదేవ పటో యద్వద్విచారతః।
ఆత్మతన్మాత్రమేవేదం తద్వద్విశ్వం విచారితమ్॥
దారం పోగులతో ఒక వస్త్రం ఏర్పడుతుంది. దారాల సమూహమే వస్త్రం. ప్రతి పోగూ కూడా వస్త్రంతో తన అస్తిత్వం కలిగి ఉంటుంది. తనకు తాను స్వతంత్రం కాదు.
అలాగే దృశ్యమానమైన జగత్తు అంతా ఆత్మచైతన్యమే.
యథైవేక్షురసేక్లుప్తా తేనవ్యాప్తైవ శర్కరా।
తథా విశ్వం మయిక్లుప్తం మయావ్యాప్తం నిరంతరం॥
చెరుకురసంతో తయారైన పంచదార లో ఉన్నది చెరుకు రసమే. జగత్తు అలా నాలో ఉన్నది, అంతటా ఉన్నది కూడా అదే అని జనకుడు చెబుతున్నాడు.
నూలు నుంచి వచ్చిన వస్త్రం నూలు నుంచి వేరు కానట్లుగా, మట్టి నుంచి తయారైన కుండలు మట్టి నుంచి వేరు కానట్లుగా, బంగారం నుంచి తయారైన నగలు బంగారం నుంచి వేరు కానట్లుగా ఆత్మనుంచి కల్పించబడిన జగత్తు ఆత్మ కన్నా వేరు కాదు.
ఆత్మజ్ఞానాజ్జగద్భాతి ఆత్మజ్ఞానాన్నభాసతే।
రజ్జ్వజ్ఞానా దహిర్భాతి తద్జానాద్భాసతే నహి॥
ఆత్మ గురించి తెలియకపోవటం వలన కలిగిన అజ్ఞానం వల్ల జగత్తు ఉన్నట్లుగా అనిపిస్తుంది.
ఇది రజ్జు సర్పభ్రాంతి.
జ్ఞానికి జగత్తు కనిపించదు. లయమయిపోయి ఉంటుంది.
మిగిలిన వారికి మాత్రమే జగత్తు కనిపిస్తుంది.
ప్రకాశో మే నిజం రూపం నాతిరిక్తోస్మ్యహం తతః
యదా ప్రకాశతే విశ్వం తదాఽహం భాస ఏవహి॥
నేను స్వయం జ్యోతిని. నా ప్రకాశం వల్లనే జగత్తు ప్రవర్తిస్తుంది.
అహో! వికల్పితం విశ్వమజ్ఞానాన్మయి భాసతే।
రూప్యం శుక్తౌ ఫణీ రజ్జౌ వారి సూర్యకరే యథా॥
జగత్తు భ్రమ వలన నాలో జనించి నాలో ప్రకాశిస్తున్నది.
ఈ జగత్తు ఎవరి భ్రమ వలన వారికలా కనపడుతుంది. త్రాడులో పాములా, ముత్యపుచిప్పులో వెండిలా, ఎండమాములలో నీరులా జగత్తు కనపడుతుంది.
ఇవి తిరిగి తిరిగి చెప్పబడుతున్నాయి. ఇది పునరుక్తి దోషంగా పరిగణించపడకూడదు.
తిరిగి తిరిగి పట్టుకోవలసినది ఇది.
ఇవ్వన్ని మనసు వలన కలిగిన బ్రాంతులు. జ్ఞానము వలన ఇవి బ్రాంతి అని తెలుస్తుంది.
మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయమేష్యతి।
మృది కుంభోజలేవీచిః కనకే కటుకం యథా॥
ఏ విధంగా కుండలో మట్టిలో కలిసిపోయినట్లుగా, కెరటం నీటిలో కలిసినట్లుగా, బంగారం నగలు బంగారంలో కలిసినట్లుగా నాలో భాసించే జగత్తు నాలోనే లయమైపోయింది.
పైన చెప్పినవే…బంగారం నుంచి వివిధ ఆభరణాలు తయారు చేస్తారు. ఆభరణాల పేరు వేరైనాబంగారం ఒక్కటే. బంగారం ఆభరణాలు ఒక్కటే. ఆభరణాలను కరిగిస్తే తిరిగి బంగారంగా మారుతుంది. అలాగే జగత్తు మనో కల్పితమై ఉంటుంది. తిరిగి తనలో కరిగిపోతుంది. అందుకే ఎవరి లోకం వారిదే అన్న మాట వచ్చింది.
అహో! అహం నమోమ్యహం వినాశో యస్యనాస్తిమే।
బ్రహ్మాది స్తంబ పర్యంతం జగన్నాశేఽ పి తిష్ఠతి॥
అహో! నేను అద్భుతంగా ఉన్నాను. ఆశ్చర్యంగా ఆనందంగా ఉన్నాను. నన్ను నేను అభినందించుకుంటున్నాను. బ్రహ్మాది స్తంబపర్యంతరం జగత్తంతా నశించినా నేను శాశ్వతంగా ఉంది.
జనక మహారాజు ఆత్మానందం వలన తన సంతోషాన్ని ప్రకటిస్తున్నాడు. తనలో జగత్తు, జగత్తులో తాను ఏకంగా చూడగలిగాడో అప్పుడు ఆనందంలో “అహో నాకు సంతోషంగా ఉంది. అంతటా నేనే ఉన్నాను. అన్నాడు.
అంటే సర్వం ఒక్కటే అన్న జ్ఞానం కలిగింది. రెండోది లేదని తెలిసింది. ఆ సంతోషాన్ని ప్రకటిస్తున్నాడిలా.
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥
స్వస్తి
(మిగిలినది రేపు)