అష్టావక్రగీత#10
జనక మహారాజు అష్టావక్రునికి జ్ఞాన తృష్ణతో అడిగిన ప్రశ్నకు అష్టావక్రుడు ఆత్మ నిజతత్త్వాన్ని గురించి వివరించి చెబుతాడు.
జనక మహారాజుకు ఆత్మానుభవము కలిగింది. ఆ జ్ఞానం కలిగిన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెబుతున్నాడు.
సముద్రంలో అనేకమైన అలలు పుడుతూ ఉంటవి. అవే కాదు కెరటాలు, నురుగు, నీటి బిందువులు వెదజల్లబడుతూ ఉంటాయి. తిరిగి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అలాగే పరమాత్మ నుంచి ఆత్మలు ఉద్భివిస్తాయి. తిరిగి లయమవుతాయి. అన్నీ సముద్రంలో భాగాలలా, పరమాత్మలో ఇవీ భాగాలే. అలా ఆత్మ పరమాత్మలో భాగమే అంటూ తనకు కలిగిన జ్ఞాన్నాని చెబుతున్నాడు. ఇంకా
జనకునికి తనకు కలిగిన జ్ఞానముతో తన భావాలను చెబుతున్నాడు:
“అహో! అహం నమో మహ్యోమేకోహం దేహవానపి।
క్వచిన్నగంతా నాగంతా వ్యాప్యవిశ్యమవస్థితః॥
అద్భుతమైన నాకు నమస్కరము. శరీరంలో ఉన్నా… నేను ఎక్కుడ్నుంచీ రాలేదు. ఎక్కడికీ పోలేదు. జగమంతా నేనే”
ఆత్మ దర్శికి రెండోది కనపడదు. జనకునకు రెండోదన్నది కనపడటంలేదు. ఆయన ఇలాంటి అద్భుతమైన ఆనందములో మునిగి తన స్వస్వరూపం గురించి చెబుతాడు.
“అహోమయిస్థితం విశ్వం వస్తు తో న మయిస్థితం।
సమేబంధోస్తిమోక్షోవా భ్రాంతిశ్శాంతా నిరాశ్రయా॥
జగము నాలో కనిపిస్తున్నా నాలో ఏమీలేదు. నాకు బంధమూ లేదు. మోక్షం లేదు. అజ్ఞానం నశించటముతో బ్రాంతి కూడా నశించింది.”
బంధమే అజ్ఞానం. ఎప్పుడైతే బంధము లేదో అప్పుడు అజ్ఞానమూ లేదు. మోక్షము కావాలనుకోవటము కూడా ఒక రకమైన బంధమే.
అటువంటి బంధాలన్నీ వీడిన తరువాత కలిగేది పూర్ణ జ్ఞానము. ఆ జ్ఞాన స్వరూపమే ఆనందం. అందుకే శంకరులు “చిదానంద రూపం శివోహమ్ శివోహం।” అన్నారు.
సదా “నేను పరమాత్మ స్వరూపాన్ని నాకు బంధాలు లేవు” అని త్రికరణశుద్దిగా భావన చేస్తే ముక్తి లభ్యమని గురువులు చెబుతారు. అలా భావన చేసే వారికి లోకంలోని విషయాల మీద చింత ఉండదని గమనించుకోవాలి.
“నశరీరమిదం విశ్వం న కించిదపినిశ్చితమ్।
శుద్ధిచిన్మాత్ర ఆత్మా చ తత్తస్మి న్కల్పనాఽధునా॥
ఈ శరీరం మిథ్య. జగత్తు మిథ్య. ఆత్మ పరిశుద్ధమైనది. చైతన్య స్వభావము గలది. నేనే ఆత్మని. నాకేం కావాలి?”
“శరీరం స్వర్గ నరకౌ బంధ మోక్షౌ భయం తధా।
కల్పనా మాత్రమే వై తత్కింమే కార్యం చిదాత్మనః॥
ఈ శరీరం, స్వర్గం, నరకం, బంధం, మోక్షం, భయము ఇవన్నీ కల్పనలు. వీటి వల్ల ప్రయోజనం లేదు. వీటికన్నింటికీ ఆధారం చైతన్యమే.”
“నాహం దేహో నమే దేహః జీవో నాహమహం హి చిత్।
అయమేవ హి మే బంధ ఆసీద్యా జీవితే స్పృహా॥
నేను శరీరం కాదు. నాకు శరీరం లేదు. నేను చైతాన్యాన్ని. దేహం జడం. నేను చైతాన్యాన్ని కాబట్టి దేహం నాది కాదు. నేను కర్తను కూదు భోక్తను కాదు. చిదానందరూపుణ్ణి.”
ఇలా జనకుడు ఆనందమే అవర్ణమై తన స్వస్వరూపాన్ని ప్రకటిస్తూ సాగుతాడు.
“మయ్యనంత మహంభోధౌ చిత్తవాతే ప్రశామ్యతి।
అభాగ్యాజ్జీవ వణిజో జగత్పోతో వినశ్వరః॥
అనంత చైతన్యసాగరమైన నాలో మానసిక కల్లోలం తీరిపోయినప్పుడు జీవ వ్యాపారం ఛిన్నాభిన్నమైపోతుంది”
మనస్సు లో సంకల్ప వికల్పాలు శాంతిస్తే స్థిరత్వం కలుగుతుంది. మనస్సు బుద్ధి అహంకారాల వలన మనం జీవన వ్యాపారంలో మునిగి ఉంటావు.
ఎప్పుడైతే ఈ మనస్సు బుద్ధి అహంకారాలు ఆత్మలో లీనమైనప్పుడు అన్ని ప్రారబ్ధాలు క్షయమై మోక్షం కలుగుతుంది. మానసిక కల్లోలాలు అణిగిపోతే జగత్తు అదృశ్యమయిపోయి కేవలం ఆత్మమాత్రమే.
ఇలా జనకుడు ఎన్నో శ్లోకాలలో తన సంతోషం ఆత్మానంద్న్ని తెలుపుతాడు.
ఈ గీత ఒక్క రోజు సాగదు కదా. గురువును దర్శించటము సందేహ నివృత్తి సాగుతూఉంటుంది.
అయితే జీవన్ముక్తులకు లోకంలో జరిగే వ్యాపారం మీద ఆసక్తి ఉండదు. కాని లోక వ్యాపారం సాగుతూనే ఉంటుంది కదా. ముక్తుడయ్యాడంటే మరణించటము కాదు. అజ్ఞానము విడిపోవటం. అసలైన సత్యపదార్థం తెలుసుకేవటం. అటు పై కూడా ముక్తుడు లోక వ్యాపారం సాగిస్తాడు.
అప్పుడు ఆయన మనస్సు ఏలా ఉంటుంది? ఈ లోక వ్యాపారంలో ఆయన ఎలా పాల్గొంటాడు? ఆయన యొక్క ప్రాత ఏమిటి? జీవన్ముక్తుల దృష్టి ఏమిటి? మనలాగ మాములు పనులు చేసుకుంటారా వంటి సందేహాలు కలగటం లోక నైజం.
ఈ వివరాలు తదుపరి భాగంలో చర్చించుకుందాం-
***
“అష్టావక్రం ముని శ్రేష్ఠం పితుర్మోచక కారణం।
జనకస్య గురుః వందే తత్త్వనిష్ఠ పునఃపునః॥
స్వస్తి
సంధ్యాయల్లాప్రగడ
(మిగిలినది రేపు)