మాఘమాసం అద్భుతమైన కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం మొదట వచ్చే ఈ మాసం పుణ్యకాలం.
అప్పటి వరకూ ఆగిన ముహుర్తాలు మాఘమాసంతో మొదలవుతాయి. నదీ స్నానానికి, సముద్రస్నానానికి ప్రసిద్ధి ఈ మాసం.
మాఘమాసంలో సూర్యారాధన ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలోనే మనకు రథసప్తమి కూడా వస్తుంది.
ఇదే కాక ఈ మాసంలో జ్ఞానాన్ని ఇచ్చే శ్యామలా నవరాత్రులు కూడా వస్తాయి.
ఈ మాఘ శుక్ల పాడ్యమి నుంచి శుక్ల నవమి వరకూ కూడా రాజ్యశ్యామలా నవరాత్రులుగా ప్రసిద్ధి. ఇవి గుప్త నవరాత్రులు. ఈ గుప్త నవరాత్రులు శాక్తేయులకు ముఖ్యమైనవి. సంవత్సరములో నవరాత్రులు నాలుగుసార్లు వస్తాయి. చైత్ర మాసపు నవరాత్రులు, అశ్వీజమాసపు నవరాత్రులు మనకు తెలిసినవి. మిగిలిన రెండు మాఘ మాసపు నవరాత్రులు, ఆషాడ నవరాత్రులు. వీటికి గుప్తనవరాత్రులని పేరు.
ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి వీటి వివరాలు పూర్తిగా తెలియవు బయటకు. కేవలం దశమహావిద్యల సాధన ఉన్న వారికి తెలిసిన ఈ నవరాత్రులు ఎంతో ప్రసిద్ధమైనవి. ప్రత్యేకమైనవి.
దశమహావిద్యలలో మాతంగి విద్యగా ఈ తల్లి ప్రసిద్ధి. మతంగ ముని తపస్సు చేసి అమ్మవారిని మెప్పించాడు. అమ్మవారు శ్యామలా దేవి ఆయనకు కుమార్తెగా అవతరించింది.
నీల శరీర చాయతో మెరిసిపోతూ ఉండే ఈ త్లలికి నాలుగు చేతులతో ప్రసిద్ధి. కొన్ని చోట్లు ఎనిమిది చేతులతో కూడా మనము దర్శించవచ్చు. వీణాపాణిగా కనపడే ఈ తల్లి సరస్వతీమాతకు మరో రూపము. అమ్మవారు లలితా సహస్రంలో మంత్రిణి నామంలో పూజలందుకుంటుంది. ఈ తల్లి లలితాపరమభట్టారికకు మంత్రిణిగా ఉంటుంది. ఈమె గేయచక్ర రథంలో ఈమె ఉంటుంది. ఈ తల్లి యంత్రం ఏడు ఆవరణలతో కూడి ఉంటుంది.
ఈ తల్లిని ధ్యానిస్తే జ్ఞానమునిస్తుంది. సంగీతాన్ని సాధన చేసే వారు ఈ తల్లిని ఆరాధిస్తే వారికి సంగీతం వశమవుతుంది. కళలలో ప్రావిణ్యం పొందటానికి ఈ తల్లి సాధన ఉత్తమమైనది.
జీవితంలో కావలసిన వన్నీ ఈ తల్లిని సేవించి పొందవచ్చు.
సప్త స్వరాలలో “ని”సర్వం శబ్ధం ఏనుగు ఘీంకారంలో ఉంటుంది. ఏనుగును మతంగమంటారు. మాతంగ విద్య అంటే తారాస్థాయిలో ఉన్న సంగీత నాదం. అంటే బ్రహ్మవిద్యే. మాతంగిని దేవిని కొలవటమంటే బ్రహ్మ విద్యనే అని అర్థం.
ఈతల్లిని గురించి వేదాలలో ఉంది. ఉపనిషత్తులలో వివరించబడి ఉంది. ఈ తల్లిని సేవించటం వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. తదనంతరం మోక్షం కూడా సిద్ధిస్తుంది.
“మతం గచ్ఛతి ఇతి మతంగః” అంటే ఒక అభిప్రాయార్థమై వెళ్ళటమే మతంగం.
అవ్యక్త శబ్ధం వ్యక్తం కావటానికి ఆలోచించే మనస్సు దగ్గరకు వెడుతుంది. వాక్కు యొక్క ఈ దశనే మతంగం అంటారు. అంటే హృదయం నుంచి భావం వ్యక్తం కావటానికి వాక్కు మనస్సు దగ్గరకు వెడుతుంది. అపుడు మాతంగి అవుతుంది. పరా వాక్కు అవ్యక్తం. వైఖరి యే మాతంగం. (వాక్కు నాలుగు రూపాలుగా ఉంటుంది. అది పరా, ఫశ్యంతి, మధ్యమా, వైఖరి.)
అంటే వాక్కు కు తల్లి ఈమె. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులతో జ్ఞానశక్తి రాజ్యశ్యామల. ఈ తల్లిని సేవించిన వారికి ఆధ్యాత్మిక విద్యను మోక్షాన్ని ఇస్తుంది.
ఈమెకు పరివారము 16 మంది.
ఈ తల్లిని నీల సరస్వతి, గేయ చక్రవాసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ది మాతంగి, వ్యాస మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామలు పరివారమై ఒప్పుతున్నారు.
శ్యామలాదేవి, లలితదేవి ఆత్మగా ధ్యానించాలి. యోగదృష్టిలో చూస్తే హృదయ స్థానములో ఉన్న అనాహతము అమ్మవారి స్థానము. అమ్మవారు “ఐం” కారానికి ప్రతీక. ఈ ఐం అన్న ఒక్క మాటతో సిద్ధింపచేసుకున్నావారు చరిత్రలో ఉన్నారు.
ప్రపంచంలో కాళిదాసు చేసిన శ్యామలా దండకము ప్రసిద్ధి. కాళిదాసు కథ అందరికీ తెలిసినదే. ఏమీ తెలియని వెర్రి వాడు కాళిదాసుగా మహా పండితుడుగా మారింది ఈ తల్లి దయ వలననే.
ఆయన చెప్పిన శ్యామలా దండకం మంత్రమయం. ఈ దండకం అమ్మవారి ఉనికిని, రూపును, అటు పైన తత్త్వమును విశదపరుస్తుంది. ఆ దండకము సాధనచేసిన చాలు జ్ఞానము ప్రసాధిస్తుందీ తల్లీ.
శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు ,కొత్త పదవులు ఉద్యోగాలలో ఉన్నతిని పొందుతారు. త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.
శ్యామలా మూల మంత్రం అనుష్టించుకోవటానికి ఈ మాఘనవరాత్రుల కాలం అనుకూలమైనవి. మంత్రం లేని వారు అమ్మవారి దండకము, లేదా అష్టోతరముతో సేవించుకోవచ్చు.
ఈ నవరాత్రులలో అమ్మవారిని పాడ్యమి ముందరరోజుననే పీట సిద్ధం చేసుకొని, కలశం కాని ఫోటో కాని పెట్టుకొని ప్రతి రోజు ఆరాధన చెయ్యాలి. కుదిరితే శోడషోపచారములతో కాకపోతే పంచోపచారముతో పూలు పళ్ళతో పూజ చేసి బెల్లంతో చేసిన పాయసం నివేదన చెయ్యాలి. అమ్మవారికి జామపండ్లు ప్రీతి. దానిమ్మ పండు కూడా ప్రియమైనది. అమ్మవారికి తాంబూలము నివేదించాలి.
కుదిరినంతగా కొందరినైనా సువాసినలకు పసుపు కుంకుమ తాంబూలమిచ్చుకోవాలి. ఇలా దూపదీపాలతో భక్తి ప్రధానంగా అమ్మవారిని ఈ పది రోజులు సేవించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావచ్చును.
అమ్మవారు ఈ నవరాత్రులలో మొదటి రోజు లఘ శ్యామలగా, రెండవ రోజు వాగ్వాధిని, మూడవ రోజు నకుళీశ్వరి, నాలుగవ రోజు కల్యాణశ్యామల, ఐదవనాడు జగద్రంజని మాతంగి, ఆరున వ్యాసమాతంగి, ఏడవనాడు సారిక, ఎనిమిదనాడు శుకశ్యామల, తొమ్మిదవ రోజు రాజశ్యామలగా సేవించాలి.
పిల్లలు ఈ రోజులలో సరస్వతీ పూజ చేసుకొని విద్యలలో వృద్ధి పొందవచ్చు.
జ్ఞాన స్వరూపి అయిన శ్యామలాదేవిని అర్పించి జ్ఞానము పొందు ఎల్లరూ జీవనయానంలో శాంతి సౌభాగ్యం పొందగలని ఆకాంక్షిస్తూ అందరికీ మాఘమాసపు శుభాకాంక్షలు.